సినిమా ఆడిందా..ఆడలేదా అన్నది పక్కన పెడితే, తను తీసిన సినిమా చూసిన వాళ్లు మాత్రం మంచి సినిమానే తీసావని మెచ్చుకుంటున్నారని భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల. గతంలో బేవార్స్ అనే సినిమా తీసినపుడు ఎవరూ గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా చూసిన వారు మాత్రం మంచి ప్రయత్నం చేసావు అని అంటున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా చూసిన వాళ్లు మలయాళం, తమిళ్ సినిమా చూసిన ఫీల్ ఉంది అంటూ అభినందిస్తున్నారట. భీమదేవరపల్లి అనే ఒక గ్రామానికి సంబంధించిన బ్యాంక్ బ్రాంచ్ నేపథ్యంగా జరిగే కథ. రాజకీయ నాయకులు చేసే హామీలు నమ్మి ఒక అమాయక పేదవాడు ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుంది. అనేది కథాంశం.
తన సినిమా చూస్తున్న ప్రేక్షకులకు రెండు గంటలు వాళ్ళ సొంత ఊరికి వెళ్లి…. తమ వాళ్లను కలిసి మాట్లాడిన అనుభూతి కలుగుతుందని, ఈ సినిమా నియోరియలిజం జానర్ లో తెరకెక్కించానని అంటున్నారు రమేష్.
అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు…”దేశం ఎదుర్కొంటున్న ఒక సమస్యని ఒక కుటుంబ నేపథ్యంగా హాస్యం మేళవించి చెప్పడం చాలా బాగుంది.” అని బైట్స్ ఇవ్వడం తనకు ఆనందం కలిగించింది అంటున్నారు ఆయన.