తనను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపై సన్నిహితుల వద్ద ఆయన మండిపడుతున్నారు. తనను బుజ్జగించడానికి వచ్చిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అలాగే మరికొందరు సన్నిహితుల వద్ద జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి బాలినేని వెనుకాడలేదు. దీన్ని బట్టి బాలినేని ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాణం పోశారు. ఇంకా నాలుగేళ్ల మంత్రి పదవీ కాలం ఉండగానే ఆయన తనయుడు జగన్ కోసం వదులుకున్నాను. కనీసం నేను వదులుకున్నంత కాలం కూడా జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. తండ్రి ప్రాణం పోస్తే, తనయుడు మంత్రి పదవి నుంచి తొలగించి గొంతు కోశారు’ అని జగన్‌పై బాలినేని ఫైర్ అవుతున్నారని సమాచారం.
ముఖ్యంగా పాత కేబినెట్ మొత్తాన్ని మార్చుతారంటే బాలినేని కూడా అంగీకరించారు. తీరా చూస్తే… తన జిల్లాకు చెందిన ఆది మూలపు సురేష్, అలాగే సొంత సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని కొనసాగించడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తనను ముమ్మాటికీ అవమానించినట్టుగానే ఆయన భావిస్తున్నారు.
సీఎం ప్రయోజనాల కోసం తనను బలిపెట్టడాన్ని బాలినేని జీర్ణించుకోలేకున్నారు. ఇక రాజకీయాలకు, వైసీపీకి ఓ దండం అంటూ…. ఎమ్మెల్యే, పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు బాలినేని సిద్ధం కావడం అధికార పార్టీని కలవరానికి గురి చేస్తోంది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలినేనిని సజ్జల, గడికోట ఓదార్చినా వినిపించుకోలేదని సమాచారం.
రాజకీయాల నుంచి తప్పుకోవాలనే బాలినేని నిర్ణయంపై కట్టుబడి ఉంటారా? లేక చల్లబడుతారా? అనేది కాలమే తేల్చాల్సి వుంది.