మన చిత్తానికి వచ్చినట్లు రాజకీయాలు చేస్తామంటే సాధ్యం కాదు. అది ఎన్టీఆర్ కైనా, జగన్ కైనా సరే. ఒక్క పెన్ను పోటుతో టోటల్ మంత్రి వర్గాన్ని రద్దు చేసిన ఘన చరిత ఎన్టీఆర్ ది. రెండున్నరేళ్లకు ఓసారి మంత్రులు అందరినీ మార్చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది జగన్ స్ట్రాటజీ.
నిజానికి మంచి ఆలోచనే. ఎందుకంటే 151 మంది ఆశావహుల్లో కేవలం పాతిక మందికే మంత్రి పదవి దక్కితే మిగిలిన వారి ఆశలేంగానూ? రెండున్నరేళ్లకు ఒకసారి మంత్రి వర్గాన్ని మొత్తం మారిస్తే కనీసం యాభై మందికి అవకాశం ఇవ్వవచ్చు అని ఆలోచన చేసారు జగన్.
ఈ వ్వవహారం గత ఆరు నెలలుగా వార్తల్లో నలుగుతోంది. ఆఖరికి ఇప్పటికి పూర్తయింది. కానీ జగన్ అనుకున్నట్లు మాత్రం కాలేదు. కొందరు సీనియర్లను పదవుల్లో వుంచాల్సి వచ్చింది. నిజానికి ఇది జగన్ మనోభీష్టానికి వ్యతిరేకం. కానీ తప్పలేదు. పార్టీలో అసంతృప్తి, తలకాయనొప్పులు ఇప్పుడు అంత మంచిది కాదు అనే ఆలోచనతో జగన్ ఇలా చేసి వుంటారు. అంతే వుండిపోయన వాళ్లంతా సమర్థులు, సీనియర్లు అని మాత్రం కాదు. పదవుల్లో వుంచిన వారందరితో జగన్ కు కీలక అవసరాలు వున్నాయి.
ఉదాహరణకు బొత్సను కాదని విజయనగరం జిల్లాలో, పెద్దిరెడ్డిని కాదని చిత్తూరు జిల్లాలో రాఙకీయాలు నడపడం అంత సులువు కాదు. ఎన్నికల్లో ఇలాంటి సీనియర్ల అవసరం చాలా వుంటుంది. అందుకోసమే కావచ్చు. జగన్ తన మనోభీష్టానికి వ్యతిరేకంగా వెనుకంజ వేయక తప్పలేదు.
కానీ జగన్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. 2024లో కనుక జగన్ మళ్లీ విజయం సాధించి మంత్రి వర్గం ఏర్పాటు చేయాల్సి వస్తే, ఈ సీనియర్లకు చుక్కలు చూపించే అవకాశం వుంది. ఎవరెవరైతే ఇప్పుడు జగన్ కు తిరుగుబాటు బావుటా చూపించి, తమతమ మంత్రి పదవులు కాపాడుకున్నారో వారిని కచ్చితంగా జగన్ కంట కనిపెట్టే వుంటారు. ఎందుకంటే జగన్ మనస్తత్వం అలాంటిది.
అందువల్ల మంత్రి పదవులు నిలబెట్టుకున్నంత మాత్రాన సీనియర్లకు పండగ కాదు. మునుముందు వ్యవహారం వేరుగా వుండే అవకాశం వుంది.