తెలంగాణాలో మరో నెలలో ఎన్నికలు. ఒక పక్క గులాబీదండు తమదే గెలుపని నమ్మకంతో ఉంటే మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎకైక ముఖచిత్రమైన రేవంత్ రెడ్డి తన గెలుపు కోసం ఆరాటపడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది.
ఒక పక్క సర్వేలు దోబూచులాడుతున్నాయి.
భారాసా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ పట్ల ఓటర్లు అనుకూలంగా లేరన్నది ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మళ్లీ భారాసాకే పడతాయా లేక కాంగ్రెస్, భాజపాల్లో దేనికి పడతాయి అనేది ఫలితాలొస్తేతప్ప తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ ఉత్కంఠ మధ్య చంద్రబాబు నాయుడు పరిస్థితిని చర్చించుకోవాలి.
అదేంటి.. ఆంధ్రాలోనే చాలా జటిలమైన సమస్యని ఎదురుకుంటున్న చంద్రబాబుకు తెలంగాణ ఎన్నికలతో పనేంటా అనుకుంటున్నారా?
చాలా పని ఉంది!
ఒకరకంగా కాంగ్రెస్ సీ.యం అభ్యర్ధి రేవంత్ రెడ్డికన్నా, ఆ పార్టీ అధిష్టానం సోనియా, రాహుల్ ల కన్నా చంద్రబాబుకి తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపు అత్యంత అవసరం.
తెలంగాణలో తెదేపా భూస్థాపితమై తొమ్మిదేళ్లవుతోంది. అప్పటి తెలంగాణ తెదేపా నాయకులు కాంగ్రెసులో కొందరు, భారాసాలో కొందరు చేరి ముందుకెళ్లారు.
తెలంగాణాలో తెదేపా మళ్లీ అంకురించే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడంలేదు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాకి చాలా పెద్ద సవాలుంది. ఎన్నికల లోపు చంద్రబాబు జైల్లోంచి బయటకు రావాలి, ఓపిగ్గా పోరాడాలి, జనం నమ్మాలి.. ఓట్లేయాలి.
అటు చూస్తే జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమ్మవొడి నుంచి జగనన్న ఇళ్లు, ఆరోగ్య సురక్ష దాకా విస్తరించి అధికశాతం ఓటర్లని మరొక పార్టీ గురించి ఆలోచించే పరిస్థితే లేకుండా చేస్తున్న మాట వాస్తవం. ఎటొచ్చీ పథకాల పరిధిలోకి రాని జనాభాలో కొంత శాతం ప్రభుత్వవ్యతిరేకతని చూపిస్తున్న మాట వాస్తవమే అయినా ఆ ఓట్ల శాతం తెదేపాని ఏ మాత్రం గెలుపుకి దగ్గరకు చేసేలా లేదు.
ఈ నేపథ్యంలో ఆంధ్రలో గెలుపుపై ఆశలు ఎల్లో మీడియా వార్తలు అదే పనిగా చూసేవాళ్లకి కలగచ్చేమో తప్ప, బయట పరిస్థితి చూస్తుంటే తెదేపా కేడర్ కి కూడా గెలుపుపై నమ్మకం కలగడంలేదు.
ఇప్పుడు చంద్రబాబుకి ముందున్న ఆశాకిరణం తెలంగాణ ఎన్నికలు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నది భారాసా ప్రభుత్వం.. చంద్రబాబుకి వ్యతిరేకి. పైగా భారాసాకి ఆంధ్రలోని వైకాపాకి స్నేహం ఉంది.
ఇక చంద్రబాబుకి కాంగ్రెస్ సీయం అభ్యర్థి రేవంత్ రెడ్డి అత్యంత మిత్రుడు. వోటుకి నోటు కుంభకోణం నుంచి నేటి వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోటు వేసుకున్న తెదేపా మనిషి అనే అందరూ అనుకుంటారు.
అటు ఢిల్లీలోని కాంగ్రెస్ హై కమాండుతో కూడా బాబుకి సత్సంబంధాలున్నాయి.
ఈ లెక్కలో బాబుగారి మొదటి ఆశ రేవంత్ గెలుపు. అదే జరిగితే ముందు తెలంగాణా రాష్ట్రం మీద చంద్రబాబు నీడ పడినట్టే. సింహాసనం మీద రేవంత్ రెడ్డే కూర్చున్నా రాష్ట్రాన్ని తన అదృశ్య హస్తంతో నడిపించుకోగల స్థితిలో ఉంటాడు చంద్రబాబు. దానివల్ల ముందుగా డబ్బుకి లోటుండదు. తెలంగాణా వ్యవస్థలు తన గుప్పెట్లో ఉంటాయి. తన రాజగురువు రామోజీరావుని, “తన వాళ్లు” అనుకునే పారిశ్రామక, వ్యాపార దిగ్గజాల్ని పక్కనుండి కాపాడుకోవడం, వాడుకోవడం చేసుకోవచ్చు!
అంతే కాదు ఏప్రిల్ లో జరిగే ఆంధ్రా ఎన్నికల్లో కూడా రేవంత్ సాయంతో తనకి వనరుల లోటు లేకుండా పోరాడే అవకాశం చిక్కుతుంది. ఒకవేళ అక్కడ ఓడినా తెలంగాణా గుప్పెట్లో ఉండనే ఉంటుంది. పూర్వ సమైక్య ఆంధ్రప్రదేశు మ్యాపులో.. అయితే ఆ ముక్కో.. లేకపోతే ఈ ముక్కో.. చేతిలో ఉంటే చాలు ఆక్సీజన్ అందుతున్నట్టే చంద్రబాబు కి.
ఆశ ఎప్పుడూ ఒక దగ్గర ఆగదు. అందుకే కాస్త ముందుకి వెళ్లి కేంద్రంలో కూడా బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలని చంద్రబాబు జైల్లో తపస్సు చేస్తూ కూడా ఉండొచ్చు.
అది జరిగితే ఇంకేముంది?
జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఒక్క క్షణం ఊపిరి సలపనీయకుండా ఇబ్బంది పెట్టగలడు బాబు. అసలే గాయపడ్డ పాములా పగతో బుసలు కొట్టే నాయకుడికి కేంద్రం సాయముండి, తెలంగాణాలో పట్టుంటే.. ఇక జగన్ ప్రభుత్వాన్ని కొలాప్స్ చేయడం చేతిలో పని. కేసుల్లో లోపలేయడం చిటికలో పని.
కనుక ఆంధ్రప్రదేశులో తన పావులు పారకపోయినా కాంగ్రెస్ గాలి గట్టిగా వీస్తే తెలంగాణా వైపునుంచి అయినా జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా, న్యాయపరంగా చావుదెబ్బ కొట్టే పథకాలు చంద్రబాబు సత్వరం రచిస్తాడనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
చూడాలి మరి ఏంజరుగుతుందో! నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్లో ఫలితాలు…ఈ రెండూ ప్రస్తుతం పాడె మీద ఉన్న తెదేపాకి దింపుడుకళ్లెం అవకాశాలు.
– శ్రీనివాసమూర్తి