తను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా నటి గౌతమి ప్రకటించడం ఆసక్తిదాయకంగా మారింది. ఈ అంశంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. తమిళనాట కొంత కాలం కిందట సినిమా హీరోయిన్లు భారతీయ జనతా పార్టీ పట్ల ఆసక్తిని వ్యక్తం చేసి, అందులో చేరారు. అలాంటి వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ, గౌతమి కూడా ఉన్నారు. ఇప్పుడు గౌతమి రాజీనామాతో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు స్పందించారు.
గౌతమి రాజీనామా చేస్తూ.. పార్టీ నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ లభించలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అది ఆమె వ్యక్తిగతం అని, అపార్థం చేసుకున్నారంటూ అన్నామలై స్పందించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తన దాదాపు 20 యేళ్లుగా ఆర్థికంగా ఒక వ్యక్తిని నమ్మి తన వ్యవహారాలను కట్టబెడితే అతడు మోసం చేశాడంటూ కొన్నాళ్ల కిందట గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అళగప్పన్ అనే వ్యక్తి గౌతమి ఆర్థిక వ్యవహరాలను చూస్తూ మోసం చేశాడట, కొన్ని ఆస్తుల విషయంలో అతడి చేతిలో గౌతమి మోసపోయినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి సదరు అళగప్పన్ పరారీలో ఉన్నాడట. ఈ వ్యవహారంలో పార్టీ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించలేదనేది గౌతమి బాధగా తెలుస్తోంది. తను కష్టకాలంలో ఉంటే ఆదుకోని పార్టీలో తను కొనసాగదలచనట్టుగా ఆమె రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ఈ అంశంపై అన్నామలై స్పందిస్తూ.. అది ఆమె వ్యక్తిగత వ్యవహారం అని, ఆమెకూ ఆమె మాజీ మేనేజర్ కు వివాదం వస్తే పార్టీ ఏం చేస్తుందన్నట్టుగా స్పందించారు.
మరి రాజకీయాల్లో ఏదైనా పార్టీకి మద్దతు పలికే హీరోయిన్లు ఇలాంటి మద్దతును ఆశించడంలో తప్పు లేదనే చెప్పాలి! పార్టీలకి హీరోయిన్ల గ్లామర్ కావాలి, హీరోయిన్లకు కొన్ని రకాల ఇబ్బందులను తట్టుకోవడానికి రాజకీయ మద్దతు అవసరం కావొచ్చు. మరి ఈ మద్దతే బీజేపీ నుంచి గౌతమికి లభించనట్టుగా ఉంది. ఇప్పుడు తన నమ్మకం సీఎం స్టాలిన్ మీదేనంటూ గౌతమి అంటోంది!