ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ (77) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ లో భారత్ తరఫున తొలి తొలి రికార్డు పుటలను తెరిచిన స్పిన్ బౌలర్ బేడీ. తన కెరీర్ లో 67 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన బేడీ 266 వికెట్లను సాధించారు. టెస్టుల్లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లను తీసిన బౌలర్ గా చాన్నాళ్ల పాటు బేడీ పేరిటే రికార్డు కొనసాగింది. స్పిన్నర్ లలో అయితే కుంబ్లే, హర్భజన్లు ఆ రికార్డును అధిగమించే వరకూ బేడీదే రికార్డు.
1966 నుంచి 1979 వరకూ బేడీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొనసాగారు. తన కెరీర్ లో ఆయన పది వన్డేలు కూడా ఆడారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో బేడీ ఎక్సెప్షనల్ గా పేరు పొందారు. కెరీర్ అనంతరం ఆయన విశ్లేషకుడిగా కొనసాగారు. భారత స్పిన్ బౌలర్ల పై కూడా పలు సార్లు పదునైన కామెంట్లను చేస్తూ వార్తల్లో నిలిచారు. టీమిండియా ప్రదర్శనను ప్రశంసించడమే కాదు, విమర్శలకు కూడా బేడీ వెనుకాడే కారు. అలా కూడా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు బేడీ గుర్తుంటారు.
బేడీ మరణం పట్ల బీసీసీఐ శ్రద్ధాంజలి ఘటించింది. ఒక దశలో బేడీ టీమిండియాకు మేనేజర్ గా వ్యవహరించారు. 90లలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు టీమిండియా మేనేజర్ గా వ్యవహరించారు బేడీ. భారత జాతీయ జట్టు కూడా స్వల్ప కాలం కెప్టెన్ గా వ్యవహరించారు. ఢిల్లీ రంజీ టీమ్ కు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించిన ఘనత కూడా బేడీదే.
బేడీ, ఎర్రవల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, వెంకట్రాఘవన్ లు తమ స్పిన్ తో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యేకంగా నిలిచారు. వీరి స్ఫూర్తి ఆ తర్వాత ఇండియా తరఫున క్వాలిటీ స్పిన్నర్లు తయారయ్యేలా చేసింది.