ఏ క్రికెట్ వరల్డ్ కప్ లో అయినా.. అత్యధిక వీక్షకాదరణ ఇండియా-పాక్ మ్యాచ్ కే ఉండటం సహజం! ప్రపంచకప్ ఫైనల్ కు మించిన రీతిలో కూడా వరల్డ్ కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ కు వీక్షకాదరణ ఉంటుంది. 2023 ప్రపంచకప్ లో భాగంగా ఇటీవలే జరిగిన ఆ మ్యాచ్ కూడా అదే స్థాయిలో వీక్షకాదరణ పొందింది. వరల్డ్ కప్ మ్యాచ్ లను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న డిస్నీ-హాట్ స్టార్ ద్వారా లైవ్ లో మూడున్నర కోట్ల సబ్ స్క్రైబర్లు మ్యాచ్ ను చూశారు!
మూడున్నర కోట్ల టీవీ, మొబైల్ స్క్రీన్స్ పై ఇండియా -పాక్ మ్యాచ్ ప్రసారం అయ్యింది. మరి ఒక్కో స్క్రీన్ ముందు ఒక్కరే ఉండాలని లేదు! లైవ్ టెలికాస్ట్ విషయంలో అది ఈ వరల్డ్ కప్ కు సంబంధించి స్పెషల్ రికార్డు. మరి అదే అనుకుంటే.. ఇండియా- న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ అంతకు మించి వీక్షకాదరణ పొందడం గమనార్హం!
ఇండియా- పాక్ మ్యాచ్ ను ఏకంగా మూడున్నర కోట్ల సబ్ స్క్రైబర్లు లైవ్ లో చూసినట్టుగా లైవ్ టెలికాస్ట్ లో భాగంగా పడే గణాంకాలు చెప్పాయి. అయితే ఇండియా- కివీస్ మ్యాచ్ ను అదే డిస్నీ-హాట్ స్టార్ లైవ్ లో.. ఏకంగా 4.3 కోట్ల వీక్షణలు పొందడం గమనార్హం. ఇండియా-పాక్ మ్యాచ్ లో ఒక దశలో ఈ సంఖ్య 3.7 కోట్లకు చేరింది. ఆ రికార్డును ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ చెరిపేసింది. ఏకంగా 50 లక్షల అదనపు వ్యూస్ లభించాయి!
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో పాక్ తో మ్యాచ్ కన్నా.. న్యూజిలాండ్ తో మ్యాచ్చే ఎక్కువ ఆసక్తిదాయంగా నిలిచింది. కివీస్ జట్టు ఈ వరల్డ్ కప్ లో మంచి ఫామ్ లో ఉంది. ఇండియాకు న్యూజిలాండ్ షాక్ ఇస్తుందేమో అనే లోలోపలి భయాలు కూడా భారత ఫ్యాన్స్ లో మ్యాచ్ కు ముందున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ మ్యాచ్ ను ఇండియా అంత తేలికగా గెలవలేదు కూడా! ఈ నేపథ్యంలో.. కివీస్ తో మ్యాచ్ సర్వత్రా ఆసక్తిని రేపింది. దీంతో దానికి వీక్షకాదరణ కూడా పాక్ తో మ్యాచ్ కు మించి లభించింది.