తెలంగాణలో బండి! ఏపీలో ఎవరు?

వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోబోతున్న నేపథ్యంలో రాష్ట్రాలలో తమ బలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తలపోస్తోంది.  Advertisement ఇందులో భాగంగా మెజారిటీ సీట్ల మీద కన్నేస్తున్న రాష్ట్రాలలో తమ…

వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోబోతున్న నేపథ్యంలో రాష్ట్రాలలో తమ బలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తలపోస్తోంది. 

ఇందులో భాగంగా మెజారిటీ సీట్ల మీద కన్నేస్తున్న రాష్ట్రాలలో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం అక్కడి వారికి కేంద్రమంత్రి పదవులను కట్టబెట్టే దిశగా బిజెపి అధిష్టానం యోచన చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎవరికైనా మంత్రి పదవిని కట్టబెడతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే ఊహాగానాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు ఆ పుకార్లను కొట్టి పారేస్తూ వచ్చారు. కిషన్ రెడ్డి కూడా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉండకపోవచ్చునని చెప్పారు. ఈటల రాజేందర్ అసంతృప్త ప్రస్థానం, కేంద్రంలోని పెద్దలతో మంతనాలు, పార్టీ నుంచి బయటకు వెళతారని వీటన్నింటి నేపథ్యంలో అధిష్టానం పెద్దలు ఆయనను బుజ్జగించడం.. వంటి పరిణామాలు ఒకవైపు చోటు చేసుకున్నాయి.

మరోవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి అమిత్ షా, నరేంద్ర మోడీలు అర్ధరాత్రి భేటీ కీలక సమావేశం జరిపారని.. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారని, దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిగాయని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. 

ఎన్నికలకు ముందు కేంద్రంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను పక్కకు తప్పించాలనేది ప్రధాన ఆలోచన! అదే సమయంలో ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పార్టీ బలోపేతం కోసం అక్కడివారికి మంత్రి పదవులు కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బండి సంజయ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ కు పార్టీ రాష్ట్ర సారథ్యం అప్పగించడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు.

తెలంగాణ విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ, ఏపీ నుంచి ఎవరికైనా మంత్రి పదవులు దక్కుతాయా అనే మీమాంస పార్టీలో వినిపిస్తోంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే పది ఎంపీ సీట్లు తమ వాటాగా దక్కించుకోవాలని బిజెపి అనుకుంటోంది. ఒకవేళ పొత్తు లేకపోయినా సరే పార్టీని బలోపేతం చేసుకోవాలనేది వారి కోరిక! ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వదలచుకుంటే, వారిని అదృష్టం వరించినట్లే! 

జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ ఈ రేసులో ఉంటారు! ‘ఎవరు ఎక్కువగా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోగలరు’ అనేదాన్ని బట్టి వారికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని వినిపిస్తోంది.