తిరుపతికి కేటాయించిన తెలుగు అకాడమీని విజయవాడకు తరలించే ఉద్దేశం లేదని ఆ అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. తెలుగు అకాడమీని తిరుపతి నుంచి విజయవాడకు తరలిస్తున్నారని, తద్వారా సీమకు వైసీపీ సర్కార్ మరో ద్రోహానికి పాల్పడుతోందంటూ ఈ నెల 20న “గ్రేట్ ఆంధ్ర” వెబ్‌సైట్‌లో రాసిన కథనానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది.
తిరుపతిలోనే తెలుగు అకాడమీ కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, తెలుగు అకాడమీకి మంచి భవనం నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు అకాడమీకి సొంత భవనం, ఇతరత్రా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ భూమి కోసం అన్వేషణ మొదలు పెట్టారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం మల్లంపల్లిలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కోసం తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు భాషోద్యమ నాయకుడు సాకం నాగరాజ, రాజకీయ విశ్లేషకుడు మాకిరెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీవో తదితరులు పరిశీలించారు.
స్థలం ఎంపిక పూర్తి కాగానే , నిర్మాణాల్ని చేపట్టనున్నారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తెలుగు అకాడమీ రాయలసీమలోనే, అది కూడా తిరుపతి పరిధిలోనే వుంటుందని స్పష్టం చేశారు. తెలుగు అకాడమీకి సొంత భవనాల నిర్మాణం పూర్తి కాగానే సిబ్బంది అంతా ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారన్నారు. తెలుగు అకాడమీని రాయలసీమ నుంచి తరలిస్తారనే అనుమానాల్ని మనసులో పెట్టుకోవద్దని ఆమె సూచించారు.