సీమ ద్రోహానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం!

“వికేంద్రీకరణ మా విధానం.. చారిత్రక శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవిస్తాం. రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తాం” అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అధికార వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాట. తొలి భాషా…

“వికేంద్రీకరణ మా విధానం.. చారిత్రక శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవిస్తాం. రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తాం” అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అధికార వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాట. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం చెన్నై నగరాన్ని, విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన‌ సీమ ప్రజలు… 2014 విభజన తర్వాత మళ్ళీ రాజధాని రాక పోతుందా అన్న ఆశతో ఉన్నారు. 

కానీ తెలుగుదేశం ప్రభుత్వం అందుకు భిన్నంగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో రాయలసీమకు న్యాయ రాజధాని హామీ ఇచ్చింది. రాజధాని ఉండాల్సిన రాయలసీమలో కనీసం హైకోర్టుతో పాటు మరిన్ని కార్యాలయాలు వస్తే పాక్షికంగా అయినా న్యాయం జరుగుతుందని మా ప్రాంత‌ ప్రజలలో మళ్ళీ ఆశలు చిగురించాయి. 

రాజకీయంగా మధ్య కోస్తా జిల్లాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, విశాఖకు కీలక రాజధాని హామీ ఇచ్చినా పెద్దగా ప్రభుత్వానికి మద్దతు లేదు. చిన్న హామీ అయినా ప్రభుత్వానికి రాయలసీమ అండగా నిలిచింది. కానీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి ?

నిన్న KRMB, నేడు తెలుగు అకాడమీ

విభజన చట్టం ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు ఏపీకి కేటాయించారు. ఏపీ ప్రభుత్వం ఎక్కడ చెబితే అక్కడ కేంద్ర ప్రభుత్వం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. కృష్ణా, తుంగభద్రకు ముఖ ద్వారం వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిత న్యాయ రాజధాని అయినా కర్నూలులో కాకుండా ఎటువంటి సంబంధం లేని విశాఖలో ఏర్పాటుకు సిఫార్సు చేసింది. రాయలసీమ ఉద్యమ సంస్థల వినతని ఖాతరు చేయలేదు.

తాజాగా తిరుపతికి కేటాయించిన తెలుగు అకాడమీని విజయవాడకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి కి తెలుగు అకాడమీని కేటాయించారు. ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం 2 – 5 ఎకరాల భూమిని కేటాయించాల‌ని జిల్లా కలెక్టర్ గారికి అధికారికంగా సూచించారు. కానీ ఆచరణలో తిరుపతిలో కేవలం బోర్డు మాత్రం పెట్టి సిబ్బంది, కార్యాలయ పనులు విజయవాడలో జరుగుతున్నాయి. అందుకు చెబుతున్న సాకు ముద్రణాలయాలు విజయవాడలో ఉన్నాయట. 

ప్రతి ఏటా 100 టన్నుల విలువైన ముద్రణలు జరుతాయి. అందుకు తగిన ముద్రణా సంస్థలు తిరుపతిలో లేవు. అసలు వివిధ సంస్థలు వివిధ ప్రాంతాల్లో ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఆయా సంస్థల వల్ల వాటికి అనుబంధంగా మరిన్ని సంస్థలు వస్తాయని, త‌ద్వారా సదరు ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌ని. ఉదాహరణకు తెలుగు అకాడమీ ఏటా 100 టన్నుల ముద్రణ తిరుపతిలో చేస్తే అందుకు అనుగుణంగా 4, 5 ముద్రణాలయాలు ఏర్పాటు అవుతాయి. వాటికి అనుసంధానంగా DTP సెంటర్ల వస్తాయి. పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. వికేంద్రీకరణలోని ప్రాథ‌మిక సూత్రం ఇదే. తిరుపతిలో ఉండటం ఇష్టం లేని కొందరు అందుకు భిన్నంగా వ్యవహారాలు చేస్తున్నారు.

వికేంద్రీకరణ పేరుతో గర్జనలు చేసిన వైసీపీ నేతలు ఎక్కడ.

మేము వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే, విపక్షాలు అడ్డుకుంటున్నాయ‌ని, మాకు మద్దతు ఇవ్వాలని సీమ జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఇత‌ర‌ నేతలు గ‌ర్జించారు. మరి మీ ప్రభుత్వమే ఇచ్చిన తెలుగు అధికార వ్యవస్థ తిరుపతి నుంచి విజయవాడకు తరలించే కుట్రలు చేస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదు? గర్జనలు అవసరం లేదు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళితే సమస్య పరిష్కారం అవుతుంది. 

కానీ అధికార పార్టీ రాయలసీమ నేతలకు తీరక లేదు. అన్ని విష‌యాల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు… ఈ విషయంలో నోరు మెదపవు. రాయలసీమకు వచ్చిన తెలుగు అకాడమీని కాపాడుకోవాల్సిన బాధ్యత సీమ ప్రజలదే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నాయకత్వంలోని పార్టీ, ప్రభుత్వం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి చర్యలతో మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వికేంద్రీకరణ విధానంపై రాయలసీమ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం