సినీగేయ కవి గారి కొత్త రాజకీయ కామెడీ షో!

సినీ గేయరచయితల్లో మంచి విద్వత్తు ఉన్న వారిలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒకరు. విద్వత్తుకు మించిన స్వాతిశయం ఆయన ప్రతిభకు దక్కవలసిన ఖ్యాతిని దారి మళ్లించిందనే అభిప్రాయం కూడా సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తం చేస్తుంటారు.…

సినీ గేయరచయితల్లో మంచి విద్వత్తు ఉన్న వారిలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒకరు. విద్వత్తుకు మించిన స్వాతిశయం ఆయన ప్రతిభకు దక్కవలసిన ఖ్యాతిని దారి మళ్లించిందనే అభిప్రాయం కూడా సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తం చేస్తుంటారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. 

రాజేంద్రప్రసాద్ హీరోగా, రాజేంద్రప్రసాద్ నే సంగీత దర్శకుడిగా కూడా పరిచయం చేస్తూ రూపొందిన సదరు ‘పెళ్లాం పిచ్చోడు’ అనే సినిమా ఎప్పుడు విడుదలైందో, ఎక్కడ ఎన్ని రోజులు ఆడిందో ఎవ్వరికీ తెలియదు గానీ.. ప్రజాదరణ పొందిన ఉత్తమచిత్రంగా 2005 నంది అవార్డును కూడా గెలుచుకుంది. 

జొన్నవిత్తుల గాఢమైన సాహిత్యపు లోతులున్న, భావగర్భితమైన పాటలు రాయడంతో పాటూ.. హాస్యం, చతురత, అధిక్షేపణ ప్రధానంగా పేరడీలు రాయడంలో కూడా పేరు గడించారు. అలాంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తాజాగా రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నారు. తాను జైతెలుగు అనే పార్టీని స్థాపిస్తున్నట్టుగా ఆయన విజయవాడలో ప్రకటించారు.

జై తెలుగు అనే రాజకీయ పార్టీ తెలుగు భాషను పరిరక్షించుకునే దిశగా నాయకులు, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పనిచేస్తుందని ఆయన చెప్పారు. భాషకు పునర్ వైభవం తేవడమే తన లక్ష్యమని కూడా అన్నారు. తెలుగు భాష పరిరక్షణ అనే ఎజెండాతోనే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని కూడా జొన్నవిత్తుల ప్రకటించారు.

అయితే ‘భాష కోసం’ రాజకీయ పార్టీ అనే మాట అందంగానే ఉంటుంది గానీ.. ప్రాక్టికల్ గా ఎంతవరకు అది నిలబడుతుందనేది సందేహమే. రాజకీయ పునాదుల మీద రూపుదిద్దుకున్న పార్టీలే మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయిన దృష్టాంతాలు మనకు అనేకం ఉన్నాయి. అలాంటిది తెలుగు భాషకోసం- అనే నినాదంతో పార్టీని ఆయన ఎలా ముందుకు తీసుకువెళ్లగలనని అనుకుంటున్నారో తెలియదు.

అదే సమయంలో భాషగురించిన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అయితే అందుకు రాజకీయ పార్టీ మంచి మార్గం అవుతుందా? ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్న రాజకీయ పార్టీ అయినా సరే.. అధికారంలోకి రాగలిగితే తప్ప ఆ సిద్ధాంతానికి న్యాయం చేయడం సాధ్యమా? జొన్నవిత్తుల ఒకవేళ తాను ఎమ్మెల్యేగా గెలిచినా కూడా.. పార్టీ అధికారంలోకి రాకపోతే.. తెలుగు భాషకోసం ఏమైనా చేయగలరా? అనేవి కీలకమైన ప్రశ్నలు. 

ఈ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేస్తానని కూడా ఆయన అంటున్నారు. ఒక్కరే పోటీచేస్తారా? రాష్ట్రమంతా కూడా భాషా ప్రియులను పోటీచేయిస్తారా? భాష గురించిన నిర్దిష్ట ఎజెండాను ఏమైనా ప్రకటిస్తారా? వంటివేమీ ఇంకా బయటకు రాలేదు. మరి జొన్నవిత్తుల తన రాజకీయ ప్రస్థానం కామెడీ ప్రయత్నంగా మిగిలిపోకుండా, ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.

One Reply to “సినీగేయ కవి గారి కొత్త రాజకీయ కామెడీ షో!”

Comments are closed.