పెద్ద కులమైతే మాత్రం.. ఎందుకది దండగ?

కాపులు సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద కులం. అందుకే రాష్ట్రంలో ఏ పార్టీ రాజకీయం చేసినా కాపులను ప్రసన్నం చేసుకోవడం మీద దృష్టి పెడుతుంటాయి. కొందరైతే కాపుకులం ఓటు బ్యాంకును రెచ్చగొట్టి.. ఏకంగా…

కాపులు సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద కులం. అందుకే రాష్ట్రంలో ఏ పార్టీ రాజకీయం చేసినా కాపులను ప్రసన్నం చేసుకోవడం మీద దృష్టి పెడుతుంటాయి. కొందరైతే కాపుకులం ఓటు బ్యాంకును రెచ్చగొట్టి.. ఏకంగా తామే ముఖ్యమంత్రి అయిపోవాలని కూడా కలగంటూ ఉంటారు. కానీ, కాస్త లోతుల్లోకి వెళ్లి గమనించినప్పుడు.. కాపులు ఎంత పెద్ద కులం అయితే మాత్రం ఏముంది ఘనత? వారి మధ్య ఐక్యత లేనప్పుడు.. పెద్దకులమైతే ఏం చేసుకోడానికి.. దండగ కాకపోతే.. అనే మాటలు ఇప్పుడు ఆ కులంలోనే వినిపిస్తున్నాయి.

కాపు కులం సంఖ్యాపరంగా పెద్దదిగా భావించబడడం వెనుక కొన్ని సామాజిక కారణాలున్నాయి. కాపుల్లో చాలా ఉపకులాలున్నాయి. నిజం చెప్పాలంటే ఆ ఉపకులాల మధ్య కొట్లాటలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ.. ఎన్నికల సీజను వచ్చేసరికి కాపు ఓటు బ్యాంకు మీద కన్నేసే నాయకులందరూ కూడా.. ఆ అన్ని ఉపకులాలనూ కలిపి కాపు సామాజికవర్గంగానే పరిగణిస్తూ ఉంటారు. 

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే.. కాపు వర్గం నుంచి మంత్రిపదవులు ఇద్దరు ముగ్గురికైనా ఇవ్వకుండా మనుగడ సాధ్యం కాదు. తమ పార్టీ కాపు అనుకూల పార్టీ అనే ముద్రకోసం అందరూ తాపత్రయపడుతుంటారు.

ఏపీలో అధికారంలో ఉండే రెండు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశంలలో కాపు నాయకులు ప్రబలంగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కాపు ఓటు బ్యాంకును నమ్ముకునే ఏపీ మీద ఫోకస్ పెట్టింది. కాపును ఆకర్షించడానికే గతంలో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ చీఫ్ పదవి ఇచ్చింది. ఆయన టర్మ్ ముగిసిన తర్వాత.. మరో కాపు నేత సోము వీర్రాజు చేతిలో పగ్గాలు పెట్టారే తప్ప.. పార్టీలోని మిగిలిన కులాల వారు ఫీలవుతారని కూడా అనుకోలేదు. 

ఇక పవన్ కల్యాణ్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏకంగా.. కాపు ఓటు బ్యాంకును నమ్ముకుని సీఎం అయిపోవాలని అనుకుంటున్నారు. ఉపకులాలంతా ఉమ్మడిగా తనను సీఎం చేయాలని పిలుపు ఇస్తున్నారు.

అన్ని పార్టీలు ఆరాటపడేంత పెద్దకులం అయినప్పటికీ.. ఐక్యత లేకపోవడమే కాపు కులానికి పెద్ద బలహీనతగా ఉంది. తమలో తాము ఉప కులాలుగా కొట్టుకోవడం వేరు. కానీ రాజకీయంగా వచ్చినప్పుడు కూడా ఐక్యత లేకుండా.. కాపు ఎజెండా మీదనే తమలతో తాము ఒకరిని ఒకరు బద్నాం చేసుకుంటూ కులాన్నే ఇతరుల దృష్టిలో పలుచన చేసేస్తున్నారు. కులం పరువు తీస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని పవన్ కల్యాణ్ తిట్టిపోయగానే.. ద్వారంపూడికి మద్దతుగా కాపు జాతిని నేను ఉద్ధరిస్తానని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చారు. 

పవన్ కల్యాణ్ కోటరీనుంచి అంతకంటె సీనియర్ కాపు నాయకుడు హరిరామజోగయ్య విమర్శలకు దిగారు. ఇది తాజా, చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రతి విషయంలోనూ కేవలం ఐక్యత లేకపోవడం కారణంగా.. పెద్ద కులం అయినప్పటికీ.. రాజకీయ ఉన్నతిని కాపు వర్గం అందుకోలేకపోతున్నదని.. ఆ కులం వారే అంటున్నారు.