కేడర్ పరంగా తమకు ఏమాత్రం బలం లేని జిల్లా అని పార్టీ అగ్రనాయకులే స్వయంగా ఒప్పుకున్న ఖమ్మంలో అమిత్ షా తలపెట్టిన భారీ బహిరంగ సభ చివరి నిమిషంలో వాయిదా పడడానికి గుజరాత్ ను ముంచెత్తిన తుపాను ముప్పు కారణం అన్నది నిజమే కావొచ్చు.
కానీ, బహిరంగ సభ నిర్వహించాలంటే ఫ్లాప్ అవుతుందేమో అని భయపడే స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలహీనపడుతున్న మాట కూడా నిజం! తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జరిగే ఎన్నికల్లోనే గద్దెనెక్కి చక్రం తిప్పాలని కలగంటున్న కాషాయదళానికి గడ్డురోజులు ఎదురవుతున్నాయి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయం కనుమరుగు అయిపోయింది. కన్నడ ఫలితాలు.. వారి అదృష్టాన్ని తిరగరాసి, అదృశ్యాన్ని శాసించాయి. మిగిలిన రాష్ట్రాల మీద ఎటూ ఆశలేదు. కనీసం తెలంగాణలోనైనా ఈ ఏడాది చివరికెల్లా కాషాయజెండా రెపరెపలాడిస్తే పరువు దక్కుతుందనేది వారి ఆశ! అందుకే ఏకంగా ప్రధాని మోడీ సభను కూడా తెలంగాణలో ప్లాన్ చేశారు. అమిత్ షా, నడ్డా సభల షెడ్యూలు ఎటూ ఉండనే ఉంది. కాకపోతే అమిత్ షా సభ వాయిదా పడింది.
పార్టీ నాయకులు గంభీరంగా.. అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు గానీ.. వాస్తవంలో అంత దృశ్యం లేదనేది పలువురి అంచనా. ఈటల రాజేందర్ ఇటీవలి కాలంలో మౌనం వహిస్తున్నారు. ఒకవైపు ఎంపీ సోయం బాపూరావు ఎంపీ నిధులను సొంతానికి వాడుకున్న వ్యవహారం పార్టీ పరువును రచ్చకీడ్చింది.
సొంత పార్టీ నాయకులే కుట్ర చేసి తన మీద ఈ మార్ఫింగ్ వీడియో తయారు చేశారని ఎంపీ అన్నారు. అయితే ఆయన ఆరోపణలు చేసిన పార్టీ నాయకులు రెస్పాండ్ కాలేదు. తమలో తామే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసుకుంటే పార్టీకి పరువు నష్టం అని పెద్దల సూచన మేరకే వారు ఆగినట్లు తెలుస్తోంది. భాజపాలోకి వచ్చిన కొందరు ఇతర పార్టీల నాయకులు.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీని వీడి.. కాంగ్రెసులోకి వెళ్లడానికి తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
కేంద్రంలో మోడీ హవా ఉన్నది కదాని.. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా రాష్ట్ర భాజపా నాయకులు ఇతర పార్టీలనుంచి పలువురిని చేర్చుకున్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ.. సీట్లు గెలిచే పరంగా.. బిజెపికంటె కాంగ్రెసుకే క్షేత్రస్థాయి బలం పుష్కలంగా ఉన్నదనే అభిప్రాయం పలువురిలో వ్యాపిస్తోంది. అందుకే.. బిజెపిలోని పలువురు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కమలం గుర్తుపై బరిలోకి దిగి, దారుణ పరాభవానికి గురైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని ఉత్సాహపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఏతావతా ఈ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ కమలదళానికి ప్రస్తుతం సంక్షోభ కాలం నడుస్తున్నట్టుగా ఉంది.