ఆంద్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులకు నిజంగా ఆత్మాభిమానం లేదు. అలాగని ఏపీ ప్రజలు తమను ఎప్పటికీ ఛీత్కరించుకుంటూ ఉంటానే భయం కూడా లేదు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ద్రోహాలు చేసినా సరే.. ఇక్కడ తాము అధికారంలోకి రావాలనే కోరిక మాత్రం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులకు ఉత్సాహపడుతుండడం కేవలం అధికారం మీద ఆశతోనే అనే అభిప్రాయం పలువురిలో ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి ప్రవేశించేంత బలహీన నాయకుడు కాదు. ఇక కమలదళానికి గతిలేదు. చంద్రబాబు జట్టులో చేరి, ఆయనను బెదిరించి మభ్యపెట్టి బుకాయించి.. కాసిని ఎక్కువ సీట్లు దక్కించుకోవాలనేది వారి కోరిక! అధికారంలోకి రావడమే పరమలక్ష్యం.
అధికారం కోరుకోవడం మంచిదే గానీ.. ఆ మేరకు రాష్ట్రానికి తాము ఎంతో కొంత మేలు చేయాలనే కోరిక వారికి ఉండాలి కదా. అందరికీ ఇచ్చినట్టుగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల గణాంకాలను, ప్రత్యేకంగా ఇచ్చిన బిల్డప్పుతో చాటుకుంటూ గప్పాలు కొట్టడం తప్ప.. వారు రాష్ట్రానికి మేలు గురించి పట్టించుకోవడం లేదు. అలాంటి నేపథ్యంలో కమలనాయకులకు కనువిప్పు కలిగేలా.. చీరాలలో జరిగిన సభలో బిజెపి రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజుకు స్థానిక ప్రజలు చుక్కలు చూపించారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సంగతేంటి? విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ సంగతేంటి? విశాఖకు రైల్వేజోన్ సంగతేంటి? అంటూ చీరాలలో స్థానిక ప్రజలు సోము వీర్రాజు సభలో నిలదీశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు కూడా.
అయితే ఇక్కడ కమలనాయకులు గమనించాల్సింది ఏంటంటే.. తొమ్మిదేళ్లు గడచిపోయాయి గనుక.. ఏపీలోని పార్టీలు పెద్దగా రభస చేయకుండా వారిని తాము కంట్రోల్ చేయగలిగాం గనుక.. తెలుగు ప్రజలందరూ ఏపీకి ప్రత్యేకహోదా అనే ప్రమాణాన్ని మర్చిపోయి ఉంటారని బిజెపి కేంద్రనాయకులు అనుకుంటే అది వారి భ్రమ. అయిదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తానని ప్రగల్భాలు పలికిన నరేంద్రమోడీ అధికారం దక్కగానే ఆ విషయంలో మొహం చాటేశారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి భాజపా ద్వారా జరిగిన దారుణమైన వంచన అది. రైల్వేజోన్ విషయంలోనూ అలాంటి వంచనే కొనసాగుతోంది. కడప ఉక్కు పరిశ్రమ విషయం కూడా కేంద్ర మాట నిలబెట్టుకోవడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, రాష్ట్రానికి ఉన్న వనరును కూడా లాక్కుంటోంది. విశాఖ ఉక్కును ప్రెవేటీకరించాలని అనుకోవడం పెద్ద కుట్ర.
ఇన్నింటి నేపథ్యంలో ప్రజల నాడి భాజపాకు వ్యతిరేకంగా ఉన్నదన్నమాట వాస్తవం. చాలా చోట్ల ఈ వ్యతిరేకతలను వారు తొక్కిపడుతూ ఉండొచ్చు.. లేదా తమ కార్యక్రమాలను పార్టీ వరకే పరిమితం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రజల్లోకి వెళితే.. వారిలోని వ్యతిరేకత కడుపు మంట పార్టీకి తప్పకుండా తగులుతాయని.. చీరాలలో సోము వీర్రాజుకు ఎదురైన నిరసన సెగలు అందుకు తార్కాణమని పలువురు పేర్కొంటున్నారు.