బాలీవుడ్ లో మరో సినిమాను పూర్తి చేసుకుంది రష్మిక. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న 'అనిమల్' సినిమాకు సంబంధించిన తన షూటింగ్ పార్ట్ పూర్తయినట్టుగా రష్మిక అనౌన్స్ చేసింది. యాభై రోజుల పాటు తను ఈ సినిమాకు డేట్స్ కేటాయించినట్టుగా తన పార్ట్ షూట్ ను పూర్తి చేసుకున్నట్టుగా రష్మిక ఇన్ స్టాలో ఒక స్టోరీ పెట్టింది. ఈ సినిమా షూటింగ్ ను తను పూర్తి చేసుకోవడంతో ఇక పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లిపోబోతున్నట్టుగా కూడా రష్మిక చెప్పింది.
మరి ఈ అప్ డేట్ చెప్పడంతో ఆగిపోలేదు రష్మిక. రణ్ బీర్ కపూర్ ను ఆమె ఒక రేంజ్ లో పొగిడింది. సాధారణంగా పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి తమ షూట్ పార్ట్ పూర్తి కాగానే చాలా మంది హీరోయిన్లు కృతజ్ఞతలు చెబుతూనో, అనుభూతులను పంచుకుంటూనో చెబుతూ ఉంటారు. అయితే రష్మిక ఈ పొగడ్తల విషయంలో ఒక రేంజ్ లో స్పందించింది. ప్రత్యేకించి రణ్ బీర్ ను పొగడటానికి!
రణ్ బీర్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అట. చాలా గొప్ప మనిషట. అంతే కాదు.. రణ్ బీర్ ను తయారు చేయడానికి దేవుడు ప్రత్యేకంగా సమయం కేటాయించారట! దేవుడు అలా ప్రత్యేకంగా సమయం తీసుకున్నాడు కాబట్టే రణ్ బీర్ అంత ప్రత్యేకం అయ్యాడన్నట్టుగా రష్మిక చెప్పుకొచ్చింది. అతడితో పని చేయడం తన పూర్వ జన్మ సుకృతం అనేంత రీతిలో రష్మిక స్పందన ఉంది. ఇక అతడితో మరో వెయ్యి సినిమాలు అయినా చేయాలనుందన్నట్టుగా స్పందించేసింది.
మరో సినిమాకో, మరిన్ని సినిమాలు చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేసి ఉంటే అది రొటీన్ అయ్యేది. అయితే రష్మికకు రణ్ బీర్ తో ఏకంగా వెయ్యి సినిమాలు అయినా చేయాలనుందట! మరి ఆ అవకాశాన్ని సదరు హీరో ఏ మేరకు ఇస్తాడో మరి.
ఇక దర్శకుడు సందీప్ రెడ్డిని కూడా రష్మిక ప్రశంసించింది. తన క్రాఫ్ట్ మీద ధ్యాస ఉన్న దర్శకుడంటూ అతడికి కితాబులిచ్చింది. మొత్తానికి ఏ సినిమా చేసినా.. ఆ హీరోని, యూనిట్ పట్ల ఇలాంటి స్పందనే వ్యక్తం చేసే రష్మిక, రణ్ బీర్ విషయంలో మాత్రం డోసును చాలా చాలా పెంచేసింది!