ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి? ఒకదానికొకటి పొంతన కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పిన మొదటి మాట….రెండున్నరేళ్ల తర్వాత పాత కేబినెట్ అంతా రాజీనామా చేస్తుందని, కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఇటీవల చివరి కేబినెట్లో జగన్ ఏమన్నారంటే… సీనియర్ మంత్రులను పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తామని, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమాత్య పదవులు వారికేనని ప్రకటించారు.
రెండు రోజులకే రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ప్రభుత్వ పెద్దల మాట తీరులో మార్పు వచ్చింది. కొత్త, పాత మంత్రుల కలయికగా త్వరలో కొలువుతీరనున్న కేబినెట్ వుంటుందని చెబుతున్నారు. పది మంది పాతవాళ్లే తిరిగి కొనసాగుతారని ప్రభుత్వ సొంత పత్రిక ద్వారా లీక్‌లు ఇస్తున్నారు. ఈ మాత్రం సంబరానికి అంత ప్రచారం ఎందుకనే ప్రశ్న. ముఖ్యంగా సీనియర్ మంత్రులను తిరిగి కేబినెట్లో తీసుకోవడం ద్వారా, పార్టీ బలోపేతం సంగతేంటి?
మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే సీనియర్ నాయకులు, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాలు రచించడంలో పేరెన్నికగన్న వారు మంత్రి పదవులకు పరిమితం చేయడం వల్ల వైసీపీకి లాభమా? నష్టమా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ మంత్రులను పార్టీకి పని చేయించడంలో జగన్ విఫలమవుతున్నారా? అనే అనుమానాలు లేకపోలేదు.
కొత్త కేబినెట్లో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రుల్ని మాత్రమే తిరిగి కొనసాగించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించినప్పటికీ, ఆచరణలో అది జరగకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీనియర్ నాయకులంతా మంత్రి పదవుల్లో కొలువుదీరితే, ఇక పార్టీకి పని చేసేదెవరు? అనే ప్రశ్న సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే రావడం విశేషం.
పాతవారిలో 10 మందిని కొనసాగించాలనే ఆలోచన వున్నప్పుడు, అందరితో రాజీనామాలు చేయించడం దేనికని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సీనియార్టీ, ఆర్థికంగా బలం లేని వాళ్లను కేబినెట్ నుంచి తొలగించి, వారిని పార్టీకి ఏ విధంగా వాడుకుంటారనే ప్రశ్నలు లేకపోలేదు. మంత్రి పదవి నుంచి తప్పించే వాళ్లను ఊరడించే మాటలే తప్ప, నిజానికి జగన్ అనుకున్నట్టు కొత్త కేబినెట్‌ను తీర్చిదిద్దలేకపోతున్నారనే భావన మాత్రం పౌరసమాజంలో బలంగా ఉంది.