నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి పేరును అధినేత వైఎస్ జగన్‌కు మేకపాటి కుటుంబం సూచించింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరగనుంది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉండడంతో మేకపాటి గౌతమ్‌రెడ్డి సతీమణి శ్రీకీర్తి బరిలో నిలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
శ్రీకీర్తికి రాజకీయాలపై ఆసక్తి అని కూడా సమాచారం. అనూహ్యంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి తమ్ముడు విక్రమ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆత్మకూరులో గౌతమ్‌రెడ్డి లేని లోటును భర్తీ చేయాలనే భావన శ్రీకీర్తిలో బలంగా ఉందని సమాచారం. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తూ, గౌతమ్‌రెడ్డిని ఎప్పటికీ మరిచిపోకుండా చేయాలనే పట్టుదల ఆమెలో ఉందని తెలిసింది.
మరీ ముఖ్యంగా ఉప ఎన్నిక బరిలో గౌతమ్‌రెడ్డి సతీమణి శ్రీకీర్తి నిలిస్తే, టీడీపీ, జనసేన పోటీ చేసేవి కావనే చర్చ జరుగుతోంది. ఏకగ్రీవానికి అవకాశాలు ఉండేవని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకీర్తిని కాదని విక్రమ్‌రెడ్డిని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. శ్రీకీర్తి రాజకీయాలు వద్దనుకున్నారా? లేక ఆమెను కుటుంబ సభ్యులు వద్దన్నారా? అనేది చర్చనీయాంశమైంది.
అయితే విక్రమ్‌రెడ్డిని తెరపైకి తేవడం ద్వారా ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌతమ్‌రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు తన రెండో కుమారుడు విక్రమ్‌రెడ్డి సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్టు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.