విషాదం.. ప్ర‌ముఖ‌ ఫోక్ సింగర్ హఠాన్మరణం!

తెలంగాణ ప్రముఖ కళాకారుడు,  రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్‌ జిల్లా కారుకొండలో ఉన్న అతని ఫామ్ హౌజ్‌కు వెళ్లారు.  ఆ…

తెలంగాణ ప్రముఖ కళాకారుడు,  రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్‌ జిల్లా కారుకొండలో ఉన్న అతని ఫామ్ హౌజ్‌కు వెళ్లారు.  ఆ టైంలోనే సాయిచంద్‌కు గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయన్ని నాగర్‌కర్నూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్క‌డి డాక్ట‌ర్లు ఆయ‌న‌ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్ప‌డంతో మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

సాయిచంద్ 1984 సెప్టెంబర్‌ 20న వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించారు. ఆయన పిజీ వరకు చదువుకున్నారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. సాయిచంద్ కూడా తన తండ్రిలాగే ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను తన పాటలతో చైతన్యం చేసేవాడు. 

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్య పరిచారు. ఇప్పటివరకు అనేక పాటలు పాడారు. అందులో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను తన ఆట పాటలతో ప్రజలోకి తీసుకువెళ్లారు. 2021, డిసెంబర్‌లో సాయిచంద్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది.