తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన లక్షణమైన ముఠా తగాదాల విషయంలో అధిష్ఠానం కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రెండు మూడు రోజుల కిందట హస్తినలో జరిగిన కాంగ్రెస్ వ్యూహ కమిటీ సమావేశంలోనే.. రాహుల్ గాంధీ ముఠా తగాదాల గురించి క్లారిటీతో మాట్లాడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
మీరెవరూ ఏమి చెప్పద్దు అన్ని సంగతులు నాకు తెలుసు అంటూ ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ‘విభేదాలు ఉండడం సహజం.. పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప మీడియాలోకి వెళ్లి మాట్లాడే వారిపై వేటు తప్పదు’’ అని హెచ్చరించడం విశేషం. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా ఎవరిని ఉద్దేశించి చేశారా అని తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలోనే.. తెలంగాణలో సుదీర్ఘమైన పాదయాత్ర సాగిస్తున్న భట్టి విక్రమార్కకు అధిష్టానం ఆశీస్సులు స్పష్టం అవుతున్నాయి.
భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మం జిల్లాలో జూలై రెండవ తేదీ నాటికి ముగుస్తుంది. అదే రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఖమ్మంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలోనే భట్టి పాదయాత్ర ముగింపు కూడా ప్రకటిస్తారు.
అయితే ఈ సభ ఎంత పెద్ద సక్సెస్ అయినప్పటికీ.. దానికి సంబంధించిన కీర్తి భట్టి విక్రమార్కకు దక్కకుండా.. పొంగులేటి ఖాతాలో వేయడానికి కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం ఉంది! సాక్షాత్తు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెరవెనుక నుంచి ఈ ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినేరియో ఒక్కసారిగా మారనుంది. భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి చేరిక రెండింటికీ ఒకే సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిని పాదయాత్ర ముగింపు సభగానే, జనగర్జన సభగానే పరిగణిస్తారు!! భట్టి సభలోనే పొంగులేటి చేరిక కూడా ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తగిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని అంటున్నారు.
భట్టి పాదయాత్ర ముగింపు సభగా దానిని నిర్వహించడం వలన, పొంగులేటి అలకపూనకుండా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే వీరితో ఒక భేటీ నిర్వహించారు. విక్రమార్కను పొంగులేటిని కలిపి కూర్చోబెట్టుకొని మాట్లాడారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే భట్టి విక్రమార్కకు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని.. ఆయనకు కీర్తి దక్కకుండా ఒక వర్గం చేస్తున్న ప్రయత్నాలను అధిష్టానమే స్వయంగా అడ్డుకుంటున్నదని అర్థమవుతోంది.