నటుడు బాలయ్య 92 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయన సినిమాల్లో బాగా గుర్తుండిపోయే పాత్ర అల్లూరి సీతారామరాజులోని అగ్గిరాజు. కనిపించింది కాసేపే అయినా గుర్తుండిపోతాడు. హీరోగా చేసింది తక్కువే కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 300 సినిమాలు నటించారు. కథా రచయితగా, నిర్మాతగా కూడా ఉన్నారు. ఆయన కుమారుడు నటుడిగా ప్రయత్నించి విరమించుకున్నారు.
డైలాగ్ చెప్పడంలో బాలయ్యకో ప్రత్యేకత. గీర గొంతుతో అదో రకమైన ఎమోషన్ వినిపిస్తుంది. సీతారామరాజులో అగ్గిరాజుగా ఆవేశం రగిలిస్తాడు. హాలీవుడ్ క్రైమ్ సినిమాల ప్రేరణతో వచ్చిన మొనగాళ్లకు మొనగాడులో (1966) ఇన్స్పెక్టర్గా చాలా స్టైలిష్‌గా వుంటాడు. రష్యా నవలల ప్రేరణతో అపరాధ భావన కథాంశంతో 1973లో నేరము – శిక్ష సినిమా కృష్ణ హీరోగా వచ్చింది (అయితే ఇది డాస్టోవిస్కీ క్రైమ్ అండ్ ఫనిష్మెంట్ కాదు). దర్శకత్వం కె.విశ్వనాథ్ చేస్తే కథ బాలయ్య ఇచ్చారు. నిర్మాత కూడా ఆయనే.
డబ్బున్న అబ్బాయి కృష్ణ ఒక రోడ్డు ప్రమాదంలో బాలయ్య కళ్లు పోగొట్టి, అతని తమ్ముడి మరణానికి కారణమవుతాడు. ఈ నేరానికి శిక్షగా హీరో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఇదే రకమైన కథతో హిందీలో దుష్మన్ వస్తే 1974లో దాన్ని శోభన్‌బాబుతో ఖైదీ బాబాయిగా తీశారు. త్రివిక్రమ్ “అతడు” కూడా ఇలాంటి కథే.
అంతకు ముందు 1971లో విశ్వనాథ్ దర్శకత్వంలోనే శోభన్ హీరోగా చెల్లెలి కాపురం సినిమాని బాలయ్య నిర్మించారు. ఆడవే మయూరి పాట సూపర్‌హిట్. ఇప్పటికీ వినాలనిపించే పాట. అనాకారిగా, రచయితగా ఉన్న హీరో చెల్లెలి కోసం ప్రేమ కోసం ఎదుర్కొన్న సంఘర్షణ ఈ కథ. బాలయ్య రాశారు. తాను నిర్మించిన సినిమాలకు ఆయనే కథ రాసుకునేవారు.
1981లో చిరంజీవితో ఊరికిచ్చిన మాట తీశారు. బాలయ్య నిర్మాతగా ఉన్న అన్ని సినిమాల్లో ఎమోషన్స్ ప్రధానంగా వుంటాయి. పల్లెటూరి జీవిత చిత్రణ కనిపిస్తుంది. అమరావతి సమీపంలోని ఒక పల్లెలో జన్మించారు. అప్పట్లోనే మద్రాస్‌లో ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేసుకోకుండా సినిమాల్లోకి రావడం ఒక విచిత్రం.
వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లో మరణించిన ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
-జీఆర్ మహర్షి