నాకూ మంత్రి ప‌ద‌వి కావాలి…!

మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న వాళ్ల‌లో తాను కూడా ఉన్నాన‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. స‌గం పాల‌న పూర్త‌యిన త‌ర్వాత కేబినెట్‌ను పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చేస్తాన‌ని నాడు ముఖ్య‌మంత్రి వైఎస్…

మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న వాళ్ల‌లో తాను కూడా ఉన్నాన‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. స‌గం పాల‌న పూర్త‌యిన త‌ర్వాత కేబినెట్‌ను పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చేస్తాన‌ని నాడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్న మాట‌కు క‌ట్టుబ‌డి, నేడు ఆ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ సందర్భంగా ప‌లువురు ఎమ్మెల్యేలు త‌మ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని పార్టీ, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మొర పెట్టుకుంటున్నారు. 

త‌మ‌కెందుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలో, జ‌గ‌న్‌కు, పార్టీకి తామెంత విధేయుల‌మో క‌థ‌లుక‌థ‌లుగా చెబుతున్నార‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టుకున్నారు. మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే కొత్త కేబినెట్ జాబితాలో త‌న పేరు వుందో, లేదో తెలియ‌ద‌న్నారు. 150 మంది ఎమ్మెల్యేల‌కూ మంత్రి కావాల‌నే ఆశ వుంటుంద‌ని కోటంరెడ్డి చెప్ప‌డం విశేషం. 

అంతిమంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యానికి అంద‌రూ క‌ట్టుబ‌డి ఉంటార‌న్నారు. తిరిగి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న‌న్న మాట‌, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కి కోటంరెడ్డి బాట కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తాన‌న్నారు.

ఇదిలా వుండ‌గా కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వైసీపీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ వెంట న‌డుస్తున్నారు. ఏ ప‌ద‌వీ లేక‌పోయినా వైసీపీ వాయిస్‌ను వివిధ మీడియా సంస్థ‌ల వేదిక‌గా బ‌లంగా వినిపిస్తూ వ‌స్తున్నారు. 2014, 2019ల‌లో వ‌రుస‌గా నెల్లూరు రూర‌ల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

నెల్లూరు జిల్లాలో కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కోవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిని పిలిపించుకుని మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేన‌ని చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట‌. రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న ఆ జిల్లాలో వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం స‌ముచితమ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కోటంరెడ్డిని జ‌గ‌న్ ఏ విధంగా సంతృప్తిప‌ర‌చ‌నున్నారో మ‌రి!