అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి చిరంజీవి, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా వచ్చి ఉండేది. కానీ ఆటోజానీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అలా చిరును డైరక్ట్ చేయాలనే పూరి జగన్నాధ్ ఆశ కలగానే మిగిలిపోయింది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు సెట్స్ పైకి వస్తారో తెలీదు. ఇలా అంతా అనుకుంటున్న టైమ్ లోనే పూరి-చిరు కలిశారు. త్వరలోనే తెరపైకి రాబోతున్నారు.
చిరు-పూరి కలిశారు. కాకపోతే హీరో-దర్శకుడిగా కాదు, ఇద్దరూ నటులే. అవును.. గాడ్ ఫాదర్ సినిమాలో కీలకమైన ఓ చిన్న పాత్ర కోసం పూరి జగన్నాధ్ ను తీసుకున్నారు. చిరంజీవి, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో కొన్ని సీన్లు కూడా తీశారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా బయటపెట్టారు.
“నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే గాడ్ ఫాదర్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రతో పూరి జగన్నాధ్ ను నటుడిగా పరిచయం చేస్తున్నాం.”
ఇలా పూరి జగన్నాధ్ తో కలిసి నటిస్తున్న విషయాన్ని చిరంజీవి బయటపెట్టారు. ఈ సందర్భంగా కొన్ని స్టిల్స్ ను కూడా ఆయన రివీల్ చేశారు. ఆ స్టిల్స్ లో పూరితో పాటు చార్మి కూడా ఉంది.
మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది గాడ్ ఫాదర్. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పూరి జగన్నాధ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఫొటోల ద్వారా చిరంజీవి ఖైదీ గెటప్ కూడా బయటకొచ్చినట్టయింది.