నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీకుడు భాషపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేం భాషని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోందని, ఏం పీకారని జగన్ను ప్రశ్నించారు. జనంలో ప్రతికూల పరిస్థితులు కనిపించడంతో జగన్ తీవ్ర అసహనానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు.
వాస్తవ పరిస్థితులకు, ఊహలకు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుండడంతో సీఎం జగన్ భాష మారిపోయిందన్నారు. అసమర్థతను సమర్థించుకునేందుకే అభ్యంతరకర భాషను జగన్ ఆశ్రయించారని ఆయన విమర్శించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పీకుడు భాష మాట్లాడ్డం సరికాదని పయ్యావుల హితవు పలికారు.
మూడేళ్లుగా అధికారంలో ఉన్న జగన్… ఏం పీకారో చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ప్రజల జీవితాల్లో వెలుగులు పీకడమే జగన్ చేసిన పని అని మండిపడ్డారు. పీకుడు భాషకు తాము వ్యతిరేకమన్నారు. అయితే సీఎం ఆ భాష మాట్లాడ్డం వల్లే ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తోందన్నారు.
కనీసం ఒక్క పనైనా తన పాలనలో జగన్ సక్రమంగా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం తన భాష మార్చుకోకపోతే ప్రజలు పీకే పరిస్థితి వస్తుందని పయ్యావుల హెచ్చరించారు. రాయలసీమలో ఎంత మంది మంత్రుల్ని పీకుతారో తాము చూస్తామన్నారు.