వైసీపీ మహిళా ఫైర్‌బ్రాండ్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. ఊహూ, మంత్రి పదవి దక్కలేదు. ఆమె అలకపాన్పు ఎక్కారు. ప్రభుత్వ పెద్దలు ఓదార్చారు. ఆ తర్వాత ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆ పదవిలో కూడా ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ నేపథ్యంలో కొత్త కేబినెట్ కూర్పు ఆమెలో ఆశలు చిగురింపజేశాయి.
కొత్త కేబినెట్‌లో బెర్త్ కోసం ఆమె తిరగని గుడి, కొలవని దేవుళ్లు లేరు. మంత్రి పదవులు ఇచ్చే ప్రత్యక్ష దైవం సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకునే మార్గం మాత్రం కనిపించలేదు.
ఆయన మనసులో ఏముందో అంతుచిక్కడం లేదు. కానీ సామాజిక సమీ కరణల రీత్యా మరోసారి ఆమెకు నిరాశే ఎదురుకానుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వైసీపీ ఫైర్‌బ్రాండ్‌కు మాత్రం ఆమె కోరుకుంటున్న పదవి కాకుండా మరో పదవి దక్కనుందని సమాచారం.
డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్‌విప్ పదవి ఆమెకు దక్కే అవకాశాలున్నాయని సమాచారం. ఈ దఫా మంత్రివర్గంలో బీసీలు, ఎస్సీ, మైనార్టీలకు పెద్ద పీఠ వేయనున్న నేపథ్యంలో సొంత సామాజిక వర్గానికి పదవుల్లో జగన్ కోత విధించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి ఫైర్‌బ్రాండ్ ప్రదక్షిణలు కొంత వరకు సత్ఫలితాలు ఇస్తాయనే చర్చ జరుగుతోంది.