కబ్జా భూములను కక్కిస్తాం…?

విశాఖలో భూములు అంటే కోట్లలో విలువ చేసేవే. ఆ భూముల దందా ఎపుడూ సాగుతూనే ఉంటుంది. అయితే ఇందులో రాజకీయాల పాత్ర ఎంత అన్న దాని మీద మాత్రం అటూ ఇటూ దుమారం రేగుతూనే…

విశాఖలో భూములు అంటే కోట్లలో విలువ చేసేవే. ఆ భూముల దందా ఎపుడూ సాగుతూనే ఉంటుంది. అయితే ఇందులో రాజకీయాల పాత్ర ఎంత అన్న దాని మీద మాత్రం అటూ ఇటూ దుమారం రేగుతూనే ఉంది. నాడు టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున భూములు కబ్జాకు గురి అయ్యాయని వైసీపీ సహా వామపక్షాలు ఇతర విపక్షాలు ఆందోళన చేశాయి.

నాడు దాని మీద చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోసారి సిట్ విచారణను ఆదేశించింది. ఆ నివేదికల సంగతి ఎలా ఉన్నా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చినది ఏంటి అంటే ఏకంగా ఉత్తరాంధ్రా జిల్లాలలో పదివేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు ఆక్రమించుకున్నారని.

వాటిని తాము తిరిగి స్వాధీనం చేసుకున్నామని. ఇంకా మరిన్ని భూములు కూడా ఆక్రమణకు గురి అయ్యాయని, అన్నీ కలసి తాము కబ్జాదార్ల నుంచి బయటకు కక్కిస్తామని అంటున్నారు. విశాఖలో భూ దందాల వెనక టీడీపీ ఉందని విజయసాయిరెడ్డి అంటున్నారు. నాడు చంద్ర‌బాబు హయాంలో రుషికొండ వద్ద కారు చౌకగా భూములను ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

చేసిందందా చేసి ఇపుడు తమ మీద బురద జల్లుతున్నారని ఆయన అంటున్నారు. ఇక ఈ భూముల విషయంలో రచ్చ రచ్చ సాగుతోంది. తన మీద అనవసర విమర్శలు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డి ఏకంగా పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహరరం సరికొత్త మలుపు తిగిరింది.

మొత్తానికి విశాఖ సహా ఉత్తరాంధ్రాలో భూములు కబ్జా అయ్యాయని అటూ ఇటూ చెబుతున్నారు. మరి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే భూములను మింగేసిన మహానుభావులెవరో బయటకు వస్తారు. ఆ పని తాము చేసి చూపిస్తామని విజయసాయిరెడ్డి అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి తమ ప్రభుత్వ  విశ్వరూపాన్నే టీడీపీ దందాల మీద చూపిస్తానని అంటున్నారు.