ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు రాజమౌళి. మరి వాటిలో బెస్ట్ మూవీ ఏది? బెస్ట్ ఎపిసోడ్ ఏది? ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దీనికి ఆయన సమాధానం ఇచ్చాడు. తన కెరీర్ బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ ను చెప్పుకొచ్చాడు.
“ఇప్పటివరకైతే ఆర్ఆర్ఆర్ నా కెరీర్ బెస్ట్ సినిమా అనిపిస్తోంది. ఎందుకంటే, నేను ఇంకా ఆర్ఆర్ఆర్ ను ప్రేమిస్తున్నాను. బహుశా.. 6-7 నెలల తర్వాత ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పగలను. అయితే పెర్ఫార్మెన్సుల పరంగా చూసుకుంటే ఇదే నా బెస్ట్ వర్క్. ఎన్టీఆర్-చరణ్ వర్క్ సూపర్. ఇక ఎపిసోడ్ పరంగా చూస్తే.. నా కెరీర్ లో బెస్ట్ ఎపిసోడ్ ను కొమురం భీముడో సాంగ్ గా చెబుతాను. ఇప్పటివరకు నేను తీసిన ఎపిసోడ్స్ లో అదే ది బెస్ట్.”
త్వరలోనే మహేష్ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ప్రభావం ఆ సినిమాపై ఉండదంటున్నాడు ఈ దర్శకుడు. ఓ సినిమాను మానసికంగా ఎలా వదిలించుకుంటాడో కూడా చెబుతున్నాడు.
“నెక్ట్స్ సినిమాపై ఆర్ఆర్ఆర్ ప్రభావం ఉండదు. ఇప్పటివరకు వచ్చిన ప్రసంశల్ని తీసుకుంటాం. 2 నెలలు గ్యాప్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతాం. ఈ గ్యాప్ లో నా ఫ్యామిలీతో కూర్చుంటాను. వాళ్లంతా నా సినిమాకు వర్క్ చేసినవాళ్లే. ఆర్ఆర్ఆర్ లో చేసిన తప్పుల్ని, వచ్చిన రివ్యూస్ ను, ఇంకా ఎలా బాగా చేయొచ్చు లాంటి అంశాలన్నీ నిర్మోహమాటంగా మాట్లాడుకుంటాం. అంతే, అక్కడితో ఆర్ఆర్ఆర్ ఛాప్టర్ క్లోజ్ అవుతోంది. నెక్ట్స్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది.”
మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఇంకా స్టోరీ లాక్ చేయలేదని మరోసారి స్పష్టంచేశాడు రాజమౌళి. యాక్షన్ ఎడ్వెంచర్ జానర్ లోనే సినిమా ఉంటుందని, దానికి సంబంధించి 2-3 స్టోరీలైన్స్ అనుకున్నామని తెలిపాడు. త్వరలోనే తన తండ్రితో కలిసి కూర్చొని ఓ స్టోరీని లాక్ చేస్తానని ప్రకటించాడు.