తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం అంటే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం లభించిందని సంతోషిస్తారు. లక్షలాది రూపాయల జీతం తీసుకునే ఉద్యోగంలో లేని సంతృప్తి, ఆనందం… కేవలం టీటీడీ ఉద్యోగంలో మాత్రమే దక్కుతుంది. అందుకే టీటీడీలో ఉద్యోగం దొరకడం మహాభాగ్యంగా భావిస్తారు. అయితే టీటీడీలో కొన్ని విభాగాల్లో ఉద్యోగం అంటే సేవకు బదులు ఆర్థికంగా సేవ్ (save) చేసుకునేందకన్నట్టు వ్యవహరిస్తున్నారు.
తిరుమలలో భక్తులకు గదులు కేటాయించే కేంద్రాల్లో సంవత్సరాల తరబడి కొంత మంది ఉద్యోగులు తిష్టవేసి అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పద్మావతి ఎంక్వైరీ సెంటర్, ఎంబీసీ-34, సీఆర్వోలలో భక్తుల స్థాయిని బట్టి గదులు కేటాయిస్తుంటారు. ఈ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఐదారేళ్లుగా కొనసాగుతుండడంపై ఉద్యోగుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమలకు వచ్చే భక్తులు మొట్ట మొదట అక్కడ ఉండడానికి వసతి సౌకర్యం గురించి ఆలోచిస్తారు. దీంతో వసతి కేంద్రాల్లో పని చేసే ఉద్యోగుల గురించి ఆరా తీస్తారు. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడే వ్యాపారానికి బీజం పడుతుంది. ఈ చిన్న లాజిక్కే వసతి కేంద్రాల్లో పని చేసే సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలకు తావిస్తోంది.
సాధారణంగా టీటీడీలో మూడేళ్లకోసారి ఉద్యోగుల బదిలీ జరుగుతుంటోంది. అదేంటో గానీ, వసతి కేంద్రాల్లో పని చేసే ఉద్యోగుల విషయమై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దృష్టి సారించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్కడ అంతా బాగుందన్న భావనలో ఆయన ఉన్నారో, లేక ఎవరి ఒత్తిళ్లతోనైనా వారిని అక్కడే కొనసాగిస్తున్నారో తెలియదు.
కానీ గదుల కేటాయింపునకు సంబంధించిన ముఖ్యమైన కేంద్రాల్లో ఉద్యోగులను ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల అవినీతికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. టీటీడీలో అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. అవినీతి కూడా అపచారమనే వాస్తవాన్ని టీటీడీ ఈవో గ్రహించాలి. అవినీతి విషయమై తెలియక చర్యలు తీసుకోకపోతే అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికైనా వసతి కేంద్రాల్లో పని చేసే సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఎంత కాలం నుంచి పని చేస్తున్నారు? వారి లాబీయింగ్‌పై దృష్టి సారించి, స్థాన చలనం కల్పించి, కొత్త వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం వుంది. అవినీతి విషయంలో ధర్మారెడ్డి కఠినంగా ఉంటారనే ప్రచారం వుంది. మరి ఆచరణ ఏ మేరకో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.