ఒకప్పటి అందాల తార అసిన్ గుర్తుందా? ఘర్షణ, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, లక్ష్మీనరసింహా లాంటి హిట్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తర్వాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఓ పుకారు. అసిన్, తన భర్త నుంచి విడిపోయిందట. తాజాగా అధికారికంగా విడాకులు తీసుకుందట. దీంతో లైమ్ లైట్లో లేని అసిన్ పై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది.
ఊహించని విధంగా తనపై పుకార్లు రావడంతో అసిన్ వెంటనే రియాక్ట్ అయింది. విడాకుల ఊహాగానాల్ని కొట్టిపారేసింది. ప్రస్తుతం తను, తన భర్తతో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నానని స్పష్టం చేసింది.
“ప్రస్తుతం మేం మా సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉన్నాం. ఎదురెదురుగా కూర్చొని బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. అదే టైమ్ లో అసంబద్ధమైన, ఎలాంటి ఆధారం లేని న్యూస్ చూశాను. ఈ హాలిడే టైమ్ లో ఈ వార్త వల్ల 5 నిమిషాలు టైమ్ వేస్ట్ చేసినందుకు బాధగా ఉంది.”
ఇలా తనపై వచ్చిన పుకార్లను ఖండించింది అసిన్. ప్రస్తుతం తను, తన భర్త పక్కపక్కన కూర్చొని, ఒకప్పటి తమ పెళ్లి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నామని, సరిగ్గా అలాంటి టైమ్ లో ఈ పనికిమాలిన పుకారు వచ్చిందని తెలిపింది అసిన్.
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే మైక్రోమ్యాక్స్ సహ-వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది అసిన్. 2016లో వీళ్ల పెళ్లి జరిగింది. పెళ్లయిన వెంటనే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది అసిన్. 2017లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అసిన్ కు కేరళ, ముంబయి, గోవాలో వ్యాపారాలున్నాయి. అటు రాహుల్ శర్మకు కూడా బిజినెస్ లున్నాయి. తెరవెనక ఈ వ్యాపారాలన్నింటినీ ఆమె చూసుకుంటూ బిజీగా ఉంటోంది.