దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. వెనక కథ

బన్నీపై సాంగ్ రికార్డింగ్ చేయాలని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బన్నీలో పాట పాడే యాంగిల్ ఉందని నేను అనుకోను.

ఓవైపు తెలంగాణ సర్కారుకు, అల్లు అర్జున్ కు మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనపై చేసిన విమర్శలపై దీటుగా స్పందించాడు కూడా.

పేర్లు ప్రస్తావించకుండా ఇద్దరూ ఇలా విమర్శలు-ప్రతివిమర్శలు చేసుకుంటున్న టైమ్ లో పుండు మీద కారం చల్లినట్టు పుష్ప-2 నుంచి రెచ్చగొట్టే సాంగ్ రిలీజ్ చేశారు. “దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్” అనే సాంగ్ నిమిషాల్లో వైరల్ అయింది. రేవంత్ ను, పోలీసుల్ని రెచ్చగొట్టేందుకు బన్నీ ఇలా చేశాడంటూ ఓ టైమ్ లో ప్రచారం కూడా నడిచింది. అయితే ఆ వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలిగించారు.

ఈ వివాదం సంగతి పక్కనపెడితే, ఆ పాట వెనక జరిగిన ఆసక్తికర విషయాన్ని మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బయటపెట్టాడు. బన్నీకి తెలియకుండా ఆ పాటను రికార్డింగ్ చేసినట్టు వెల్లడించాడు.

“బన్నీపై సాంగ్ రికార్డింగ్ చేయాలని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బన్నీలో పాట పాడే యాంగిల్ ఉందని నేను అనుకోను. ఎప్పుడైతే సుకుమార్ వచ్చి నాకు షెకావత్ కు వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని వివరించాడో, అప్పుడు అది నాకు ఓ సాంగ్ లా అనిపించింది. ఎలాగైనా బన్నీతో ఆ పాట రికార్డింగ్ చేయాలనుకున్నాను. నేను చెప్పినట్టు బన్నీని స్టుడియోకు తీసుకొచ్చాడు సుకుమార్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే లైన్స్ ను అతడితో చెప్పించాం. దానికి ఢోలక్ తో పాటు మరికొన్ని సంగీత వాయిద్యాల్ని నేను యాడ్ చేశాను. అలా ఆ పాట పుట్టుకొచ్చింది.”

ఈ పాట రికార్డింగ్ చేసినట్టు చాన్నాళ్ల పాటు అల్లు అర్జున్ కు తెలియదట. నిజానికి దాన్ని నేను పాటగా అనుకోవడం లేదని, డైలాగ్ నే అలా పాటగా మార్చానని, ఆ సీన్ అలా డిమాండ్ చేసిందని వెల్లడించాడు. ఇలా ఆ పాట వెనక జరిగిన కథను దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించిన కొన్ని గంటలకే ఆ పాటను డిలీట్ చేశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ కు, తెలంగాణ పోలీసులకు మధ్య హాట్ హాట్ గా వ్యవహారం నడుస్తోంది. ఆల్రెడీ ఒకసారి పోలీసుల విచారణకు వెళ్లొచ్చాడు బన్నీ. ఇలాంటి టైమ్ లో ఆ పాటను రిలీజ్ చేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టడం కిందకి వస్తుందని భావించి సాంగ్ ను యూట్యూబ్ నుంచి తొలిగించారు.