యుపిఏ-1 సర్కారు నడిచే రోజుల్లో అమెరికాతో చేయబోతున్న అణు ఒప్పందం గురించి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టారని, ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న వామపక్షాలు కూడా వారితో చేతులు కలిపాయని, మన్‌మోహన్ ప్రభుత్వం కుప్పకూలేదే కానీ యుపిఏ నాయకుల ‘రాజకీయ చాణక్యం’తో గట్టున పడ్డారని మీకు గుర్తుండే ఉంటుంది. అది జరగగానే నేను 2008 జులైలో ‘‘సాక్షి’’ దినపత్రికకు పై శీర్షికతో వ్యాసం రాశాను. దేశానికి కావలసినది తగినంత మంది వైద్యులు. ఆ అంశం గురించి ఎవరూ మాట్లాడరు. ఎంతసేపూ ఏ నాయకుడు ఎంత చాకచక్యంగా ప్రతిపక్షాన్ని మట్టి కరిపించాడు, అతనెంతటి చాణక్యుడు లేదా కౌటిల్యుడు కాకపోతే మేకియవిల్లీ అంటూ ప్రశంసిస్తూ మాట్లాడతారు. ఇప్పటికీ యిదే గోల. ముందుగా ఆ నాటి వ్యాసాన్ని ఉటంకిస్తాను.
‘స్కూళ్లు, కాలేజీలలో జరిగే సమావేశాలలో, యువసమ్మేళనాలలో ప్రసంగించేటప్పుడు తరచుగా నేను చెప్పే హితవు -‘‘మీలో కొందరైనా రాజకీయాల్లోకి వచ్చి దేశానికి దిశానిర్దేశం చేయండి’’ అని. ‘పోయి పోయి వాళ్లను పాలిటిక్స్‌లో చేరమంటారేమిటండీ బాబూ’ అని కొందరు నన్ను మందలిస్తూంటారు. నా బాధ నాది. ఒక టెక్నోక్రాట్‌గా, పరిశోధనే ఆలంబనగా సాగుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా నాయకులతో వేగేటప్పుడు నా అవస్థ వర్ణనాతీతం. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన విషయాలతో ముఖపరిచయం కూడా లేని అధికారులకు, నాయకులకు మా ప్రణాళికల గురించి ఏ విధంగా అవగాహన కలిగించాలి, ఏ విధంగా నచ్చచెప్పాలి అనే విషయంపై నా బోటివారలం తలకిందులవుతూంటాం.
అందువలన యీ విషయాలపై పరిజ్ఞానం సంపాదించిన యువకులు అధికారంలో వుంటే భావిభారతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి సముచిత వాతావరణం ఏర్పడుతుందని నా ఆశ. రాజకీయాలంటే భయపడో, తక్కువగా చూసో వీరంతా దూరంగా వుంటే వేరే తరహా వ్యక్తులే అధిపతులై, సైన్సు కీలకంగా జరగబోయే ప్రపంచపు పరుగుపందెంలో మన దేశం వెనకబడి పోతుందనే భయం నాది.
నిన్న అణు ఒప్పందంపై పార్లమెంటులో జరిగిన చర్చ చూస్తూంటే నా భయాలు మరింత పెరిగాయి, వీరి చేతిలోనా నా దేశం వున్నదీ అన్న దిగులు ఆవహించింది. ఇప్పటి దాకా పార్లమెంటులో జరిగిన బలపరీక్షలు రాజకీయ కారణాలపై జరిగినవి. పాలకపక్షానికి మద్దతు లేదనో, వారిపై విశ్వాసం పోయిందనో ఓటింగుకై పట్టుపట్టడం జరుగుతూ వచ్చింది. కానీ యీ సారి సమావేశం ఒక సాంకేతిక అంశానికి సంబంధించినది.
అందుకని గౌరవనీయ సభ్యుల్లో కొందరైనా ఆ దిశలో మాట్లాడతారని ఆశించడం తప్పు కాదు కదా! కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సాంకేతిక విషయాలపై మాట్లాడలేదు.పెరిగిన ధరల గురించి, పాలక కూటమికి తగ్గిన మద్దతు గురించి.. యిలాటి విషయాలపై మాత్రమే చర్చంతా! రోజుకి దాదాపు ఏడున్నర కోట్లు మన సొమ్ము ఖర్చయ్యే పార్లమెంటు సమావేశంలో యిలా సమయం వృథా చేసినవారు క్షంతవ్యులా? మన పార్లమెంటు సభ్యులు సైంటిస్టులు కాకపోవచ్చు, ఎకనామిస్టులు కాకపోవచ్చు. కానీ యిటువంటి ముఖ్యమైన విషయంపై మాట్లాడడానికి ఏర్పరచిన సమావేశంలో పాల్గొనడానికి వచ్చినపుడైనా కాస్త హోమ్‌వర్క్ చేసుకు రావాలి కదా! సంగతేమిటో తెలుసుకుని రావాలి కదా! అబ్బే.. ఆ ధ్యాసే లేదు!
నిజానికి అణు విద్యుత్ అవసరాల గురించి, భద్రత గురించి చర్చించ గలిగేది ఆ రంగంలోని శాస్త్రజ్ఞులు మాత్రమే. అదే విధంగా అమెరికాతో కుదుర్చుకునే ఒప్పందంలో జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలున్నాయో లేదో తేల్చవలసినది నిష్పక్షపాతంగా వ్యవహరించే న్యాయవాదులు. నిపుణులెన్ని సలహా లిచ్చినా వాటిని కార్యాచరణకు అనువదించ గలిగేది రాజకీయ దృక్పథం (పొలిటికల్ విల్) మాత్రమే! అందువలన వివిధ పార్టీల నుండి ప్రతినిథులు ఆ రిపోర్టులను చదివి సాధ్యమైనంత అర్ధం చేసుకుని అభిప్రాయ భేదాలున్నచోట వాదించుకుంటే బాగుండేది.
అద్వానీ గారు కేంద్రమంత్రిగా వున్నపుడు రెండు మూడు సార్లు సమావేశమయ్యాను. అనేక అంశాలపై ఆయన భావస్పష్టత, విషయపారీణత చూసి ముచ్చటపడ్డాను. కానీ యీసారి సమావేశంలో ఆయన ప్రసంగం చూసి నిర్దాంత పోయాను. ఒప్పందానికి శ్రీకారం చుట్టిన తామే యిప్పుడు ఎందుకు పిల్లిమొగ్గ వేయవలసి వచ్చిందో తార్కికంగా విశదీకరిస్తారమో ననుకుంటే ఆ వూసే లేదు. శాస్త్రీయ అంశం ఒక్కటైనా ఎత్తుకుంటే ఒట్టు.
పైగా నెహ్రూగారు అణువ్యాప్తి నిరోధక ఒడంబడికను వ్యతిరేకించారని బల్లగుద్ది చెప్పేశారు. నెహ్రు పోయాకే ఒడంబడిక ఏర్పడిరదన్న సంగతి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవడం శాస్త్రసంబంధమైన విషయాలపై అశ్రద్ధనీ, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆ పొరబాటు ప్రసంగం తయారుచేసిన ఆయన సహాయకులది కావచ్చు. అదే ఒక రాజకీయ అంశంపై నైతే ఆయన సవరించ గలిగేవారు కదా, సాంకేతిక విషయం కాబట్టే ఆయన అవగాహనా రాహిత్యం బయటపడిరది. అదే మన దేశప్రజల దురదృష్టం.
వామపక్షాల ప్రతిఘటన సాంకేతిక అంశాలపై ఆధారపడకుండా అమెరికా వ్యతిరేకత చుట్టూ తిరగడమే వెగటు పుట్టించే వ్యవహారం. ఎన్‌పిటి పై సంతకం చేయకపోయినా భారతదేశంతో ఈ ఒప్పందానికి సిద్ధపడడంలో అమెరికా స్వప్రయోజనాలుండవచ్చు. అది సహజం. కానీ అవి మన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని దేశప్రజలకు నమ్మకం కలిగించలేక జబర్దస్తీకి, దుందుడుకుతనానికి దిగింది, లెఫ్ట్. అనేక రంగాలలో శాస్త్ర పరిశోధనలకై అమెరికా మన దేశంతో చేతులు కలుపుతోంది. మన శాస్త్రజ్ఞుల మేధస్సు, ఆర్థికపరమైన అనుకూలత – వాటికి కారణాలు. ఎదుగుతున్న మధ్యతరగతి, పెరుగుతున్న మార్కెట్ – భారత్‌తో స్నేహానికి వారికి అత్యంత ఆకర్షణీయమైన అంశాలు. అందుకే యింతటి ‘‘‘ఔదార్యం’’ కనబరుస్తున్నారు.
ఆ మాటకొస్తే అమెరికాయే కాదు, యూరోప్, జపాన్ దేశాలు కూడా భారత్ పట్ల ప్రేమ కురిపిస్తున్నాయి. ఇది యివాళ్టి మన ప్రజల శక్తిసామర్థ్యాలకు నివాళిగానే భావించాలి తప్ప మన నాయకుల ‘‘ఉద్ధరింపు’’ కాదు. రేపు ఈ దేశాలు మనను మోసం చేయబోయినా, కబళించబోయినా – నాయకుల మాట ఎలా వున్నా – మన ప్రజలే దేశభక్తితో దాన్ని ఎదిరించగలగాలి. ఆ దేశభక్తి కొరవడిన పక్షంలో యిలాటి అవకాశాలను వదులుకుని తలుపులు మూసుకుని కూచున్నా మనం బావుకునేది ఏమీ లేదు.
చైనాతో సమానంగా భారత్‌ను ఎదగనీయకుండా వామపక్షాలు అడ్డు పడుతున్నాయన్న విమర్శకు బదులు చెప్పలేక చైనాను ప్రపంచం అణ్వస్త్రదేశంగా గుర్తించిందని, భారత్‌ను గుర్తించలేదని జవాబివ్వడం హాస్యాస్పాదం. అణ్వస్త్ర దేశమన్న ముద్ర లేకుండానే మన యింధన అవసరాలు కొంతమేరకు తీరుతున్నందుకు సంతోషించాలి తప్ప అడ్డుపడాలా? అమెరికా దేశంతో ప్రతీ ఒప్పందం విషయంలోనూ వామపక్షాలు యిలాగే అడ్డుపడతాయా? ఒకవేళ చైనా యిలాటి ప్రతిపాదనతో ముందుకు వస్తే మనం అంగీకరించాలా? ఎన్నో ప్రశ్నలు. వీటి గురించి దృష్టి సారించే నాథుడు పార్లమెంటు మొత్తంలో ఒక్కడూ లేకపోయాడు.
ఇవన్నీ చాలవన్నట్టు అణు ఒప్పందానికి మతం రంగు పులమడం, కొంతమంది వామపక్షీయులు యిది ముస్లిం వ్యతిరేకమంటూ సమాజ్‌వాది పార్టీని హడలగొట్ట బూనడం వెగటు పుట్టించింది. అంటే రేపు అమెరికా యురేనియం ఆపేస్తే, ముస్లింల యిళ్లకు మాత్రం విద్యుత్ సౌకర్యం నిలిపి వేస్తారా? ఒకవేళ రేడియేషన్ దుష్పలితాలు కలిగితే అవి హిందువులను తాకవా? లేక అమెరికాను ముస్లిము వ్యతిరేక దేశమని భావించే (అమెరికాకు సన్నిహితంగా మెలిగే ముస్లిం దేశాల మాటేమిటి? అమెరికాలో నివసించే ముస్లిముల మాటేమిటి?) ఉగ్రవాదులతో లెఫ్ట్ ఏకీభవిస్తోందా? ముస్లిం ఓట్లు కావాలంటే అమెరికా వారి, అమెరికాలో స్థిరపడిన భారతీయుల పెట్టుబడులను వారు నిరాకరిస్తారా?
మనదేశంలో అన్నీ మతం చుట్టూనే పరిభ్రమించాలా? రామసేతు ప్రాజెక్టును పర్యావరణ పరంగా, ఆర్థికకారణాల పరంగా, సాంకేతిక పరంగా వ్యతిరేకిస్తే అర్ధం వుంటుంది. దాన్ని మతంతో ముడిపెట్టి, మతవిశ్వాసాలను దెబ్బతీస్తుందనే సాకు పెట్టి అడ్డుకోబూనడం చికాకు వేస్తుంది. మనదేశంలో రోడ్ల విస్తరణ అడ్దుకోవాలన్నా, సాంకేతిక ప్రగతిని నిరోధించాలన్నా పనికి వచ్చే మహాస్త్రం – గుడి లేదా, మసీదు! ఈనాటి అణు ఒప్పందం అడ్డుకోవాలన్నా మతాన్నే అడ్డు వేసుకున్నారు. సైంటిఫిక్ టెంపర్‌మెంట్ వుండవలసిన వామపక్షీయులు కూడా యీ దారి పట్టడం విషాదకరం, వారి పరిభాషలో ‘‘చారిత్రాత్మిక తప్పిదం’’.
తృతీయకూటమి కూడా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘సాంకేతికతే నా లక్ష్యం, శాస్త్రపురోగతితో 2020 వైపు రాష్ట్రాన్ని వీలైతే దేశాన్ని తీసుకెళతానని చాటుకున్న చంద్రబాబు ఏ శాస్రీయదృక్పథంతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకించారో నాకు అర్థం కాలేదు. ప్రపంచ బ్యాంకుతో వారు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ప్రజలతో పంచుకున్నారా? పైగా ఆర్థిక నిపుణుడు మన్‌మోహన్ స్థానంలో మాయావతి వంటి రాజకీయ నాయకురాలని కూచోబెట్ట బూనడం నాకు మింగుడు పడలేదు. ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని ముంచెత్తుతున్న యీ తరుణంలో దేశాన్ని నడిపించడానికి మనకు నిపుణులు కావాలని బాబు విస్మరించారా? తమ రాజకీయ అవసరాలే తప్ప దేశ శాస్త్ర, సాంకేతిక అవసరాలు ఎవరికీ పట్టవా?
బలపరీక్షలో పాలకకూటమి నెగ్గింది. కానీ యీ విజయం శాస్రజ్ఞులది కాదు, సాంకేతిక నిపుణులదీ కాదు, శాస్త్రీయ అవగాహన కలిగిన నాయకులదీ కాదు. ఈ విజయం చాణక్యులది! జ్యోతిష్కుల మాట విని, సభా కార్యక్రమం సాగదీయడానికి కరన్సీ నోట్ల పిడకల వేట ప్రదర్శనాన్ని ఏర్పాటు చేసినవారి ఎత్తులకు పై యెత్తులు వేసి చిత్తు చేసే జిత్తులు నేర్చినవారిది. కానీ భావిభారతానికి కావలసినది చాణక్యులు కాదు. దేశరుగ్మతలను గుర్తించి, నయం చేయగలిగిన చరకులు కావాలి, అవసరమైతే శస్త్రచికిత్స చేయగల శుశ్రుతులు కావాలి, భారతదేశ కీర్తిపతాకలు అంతరిక్షంలో రెపరెపలాడేట్లా చేయగలిగిన ఆర్యభట్టులు కావాలి.
శాస్త్రజ్ఞానమూ, సాంకేతికతా ప్రపంచగమనాన్ని నిర్వచిస్తున్నాయి, 2020 నాటికి దేశభవితను అవి నిర్దేశించబోతున్నాయి. అప్పటికి మనం తయారు కావాలంటే – మళ్లీ చెబుతున్నాను – మనకి కావలసినది సాంకేతిక అవగాహన కలిగిన నాయకులు. ఇప్పుడు చెప్పండి – రాజకీయాల్లోకి రమ్మనమని చదువుకున్న యువతను నేను కోరడం తప్పు కాదు కదూ!’
ఇదీ ఆనాటి వ్యాసం. దీనికి తాజా కలమేమిటో మీకూ తెలుసు – అణు ఒప్పందం విషయమై విభేదించి యుపిఏతో తెగతెంపులు చేసుకుని, లెఫ్ట్ తను తీవ్రంగా నష్టపోయి, దేశాన్ని కూడా నష్టపరిచింది. లెఫ్ట్ అనే అంకుశం లేకపోవడంతో యుపిఏ విదేశీ పెట్టుబడులకు అన్ని రంగాల్లో తలుపులు బార్లా తెరిచి దేశీయ పరిశ్రమలకు, దేశప్రజలకు ఎనలేని, పూడ్చలేని నష్టాన్ని కొని తెచ్చింది. తర్వాత వచ్చిన ఎన్‌డిఏ తలుపులే పీకేసింది. ఇక లెఫ్ట్ సంగతికి వస్తే, బెంగాల్, త్రిపురలలో కనుమరుగై, కేరళలో కొనఊపిరితో ఉంది. తెలుగు రాష్ట్రాలలో అస్తిత్వం పోగొట్టుకుని, ఏదో ఒక పార్టీకి తోకగా మిగిలింది. చాణక్యుల పరంగా జరిగినదిది.
మరి చరకుల విషయంలో తాజాకలం ఏమిటి? ఈ 16 ఏళ్లలో మన డాక్టర్ల సంఖ్య పెరిగిందా? కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి యీ మధ్యే రాజ్యసభలో చెప్పిన దాని ప్రకారం ‘2022 జూన్ నాటికి మన దేశంలో 13 లక్షల మంది అలోపతి డాక్టర్లు, 36 లక్షల మంది నర్సింగ్, యితర సిబ్బంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం జనాభాలో ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టరుండాలి. కానీ మన ఇండియాలో 834 మందికి ఒక డాక్టరున్నారు. అదీ మన ఘనత. ప్రతి 476 మందికి ఒక నర్సు ఉన్నారు. 2014లో 387 మెడికల్ కాలేజీలుంటే 2023 నాటికి అవి 706 అయ్యాయి. 2014లో మెడికల్ సీట్లు 51 వేలుంటే 2023 నాటికి 109 వేలు అయ్యాయి.’
ఈ అంకెల మాటున వారు చెప్పనిది ఏమిటంటే ఈ 834 మందికి ఒక డాక్టరు అనే సరాసరి దేశం మొత్తం మీద తీసుకున్నది. దక్షిణాది రాష్ట్రాల సగటు 535 వలన ఆ అంకెకు చేరింది. ఉత్తరాది రాష్ట్రాల విడి అంకెలు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది. కూల్చివేతలకు, ఆలయనిర్మాణాలకు వినుతి కెక్కిన యుపిలో ప్రతి 2363 మందికి ఒక డాక్టరున్నాడు! డాక్టర్ల సంఖ్య చెపుతున్నారు కానీ వారు సామాన్య రోగికి అందుబాటులో ఉన్నాడా లేదా అన్న సంగతి ఎవరూ చెప్పటం లేదు. నగర ప్రాంతాలలో డాక్టర్ల లభ్యత హెచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో బాగా తక్కువ అని కూడా మనం గ్రహించాలి.
ఇక ఆసుపత్రులెన్ని ఉన్నాయి, వాటిలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వాటిలో ఔషధాలు, పరికరాలు ఎన్ని ఉన్నాయి అనే లెక్కలు తీస్తే అసలు బండారం బయటపడుతుంది. ‘‘ద హిందూ’’ 111124 సంచికలో ఆరోగ్యరంగంపై కొన్ని దేశాలు ఎంతెంత ఖర్చు పెడుతున్నాయన్న దానిపై ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రచురించారు. ఇండియా సంగతి చూడబోతే 2017లో మొత్తం ఖర్చులో ఆరోగ్యరంగంపై వెచ్చించిన ఖర్చు 1.97% మాత్రమే. 2018లో 2.47%, 2019లో 2.35%, 2020లో 2.36%, 2021లో 2.28%, 2022లో 2.22%.
2020-2022 కరోనా సంవత్సరాలని గుర్తించాలి. కరోనా టైములో ఆసుపత్రులు లేక, బెడ్స్ లేక, వైద్యులు లేక, నర్సింగు సిబ్బంది లేక అవస్థ పడ్డాం కాబట్టి బుద్ధి తెచ్చుకుని బడ్జెట్ పెంచి ఉంటారని అనుకుంటాం. కానీ అలా జరగలేదు. 2023 నాటికి 1.75%కి పడిపోయింది. 2024 నాటికి 1.76%! ఇక దీనిపై ఏం వ్యాఖ్యానించాలి? ఎంతసేపూ ఆరోగ్యశ్రీ పేర కార్పోరేట్ ఆసుపత్రులను పోషించడం తప్ప, ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేస్తున్నామా? చిన్న క్లినిక్‌ల వద్దకు ప్రజలు వెళ్లి సాధారణ రోగాలను నయం చేసుకునేట్లు చూస్తున్నామా?
అసుపత్రులకు వెళితే చాలు, టెస్టులంటూ డబ్బు గుంజి, అవసరం లేకపోయినా ఐసియులో పెట్టి, కూడా వెళ్లినవాడిని కూడా మంచం ఎక్కించి, సెలైన్ పెట్టేస్తారనే భయం సామాన్యుడిలో వ్యాపించిన మాట వాస్తవమే కదా! చికిత్సకై ఆసుపత్రులకే కాదు, డాక్టరు దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేక, మెడికల్ షాపు వాణ్నే ధన్వంతరిగా భావించి, రోగాన్ని ముదర బెట్టుకుంటున్నాడు.
ఆసుపత్రులు ఉండగానే సరి కాదు, వాటిని బాగా మేన్‌టెయిన్ కూడా చేయాలి. ‘ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్టు లేదని పదేళ్ల తర్వాత గుర్తించిన వైనం’ వార్తలు యింకెన్నాళ్లు చదవాలి? హోటల్‌కు నిప్పంటుకుంటే రూముల్లో ఉన్న వారికి పారిపోయే శక్తి ఉంటుంది. ఇక్కడ పాపం మంచానికి అంటుకుపోయిన రోగులు. పారిపోలేక అగ్నికి ఆహుతై పోతారు. రోగులకే కాదు, వైద్యులకు రక్షణ ఉంటోందా? పేషంట్ బంధువుల ఆగ్రహానికి గురైన క్షతగాత్రుడైన డాక్టరు వార్తలూ తరచుగా చూస్తాం. చికిత్స సరిగ్గా సాగిందో లేదో చెప్పవలసినది నిపుణులు. రోగి బంధువులు వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఏదో ఊహించుకుని దాడి చేస్తే ఎలా?
ఇటీవలే కలకత్తా ఆసుపత్రిలో జరిగిన ఘటన చూడండి. ఇప్పటిదాకా దొరికిన సమచారం బట్టి అనిపించేది, ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని ఎక్స్‌పోజ్ చేయబోయిన యువ వైద్యురాలు బలాత్కారానికి, హత్యకు గురైంది. అది ప్లాను ప్రకారం జరిగిందా, యాదృచ్ఛికమా అనేది విచారణలో తేలాలి. ఈలోగా రాజకీయ కారణాల చేత చాలా యాగీ జరిగింది. మానభంగం చేసినది మొదట ఒకరే అన్నారు, తర్వాత కొందరు డాక్టర్లు కూడా కలిసి చేశారు అన్నారు, తాజాగా మొదట చెప్పిన ఒక్కడే అంటున్నారు.
ఈ వివాదం వలన ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రుల్లో అలజడి కలిగింది. తమ కూతుళ్లను నైట్ డ్యూటీకి పంపము అన్నారు. వారికే కాదు, సాక్షాత్తూ డాక్టర్లే భయంభయంగా ఉన్నారు. ‘‘ద హిందూ’’ 171124 ప్రకారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్‌ఏ) 2017లో చేసిన స్టడీ ప్రకారం డాక్టర్లలో 75% మంది వర్క్‌ప్లేస్‌లో దౌర్జన్యాన్ని చవి చూశారు. 11% మంది డాక్టర్లు మేం పని చేసే చోటు వెరీ అన్‌సేఫ్ అన్నారు. 24% మంది అన్‌సేఫ్‌గా ఫీలవుతున్నాం అన్నారు.
బెంగాల్ ఘటన తర్వాత కేరళ ఐఎమ్‌ఏ యూనిట్ దేశవ్యాప్తంగా దాదాపు 4 వేల మంది డాక్టర్లను సర్వే చేసింది. నైట్ డ్యూటీ డాక్టర్లలో సగానికి తక్కువమందికి డ్యూటీరూమ్ అందుబాటులో ఉంటుందిట. ఉన్నవాటిలో కూడా మూడో వంతు వాటికే ఎటాచ్‌డ్ బాత్‌రూమ్ ఉంటుంది. డ్యూటీ రూముల్లో 53%, వార్డు, కాజువాలిటీ ఏరియాల నుంచి 100-1000 మీటర్ల (అంటే కి.మీ.) దూరంలో ఉంటాయి. 9% డ్యూటీ రూములు కిలో మీటరు కంటె ఎక్కువ దూరంలో ఉన్నాయి. రాత్రి పూట తాగి వచ్చి పేషంటు బంధువులు చేసే అల్లరి నుంచి తప్పించుకోవాలంటే డాక్టర్లు అంత దూరం పరిగెత్త గలరా?
ఇలాటి సమస్యలపై జూనియర్ డాక్టర్లు తరచుగా సమ్మె చేస్తూంటారు. మళ్లీ జూడాల సమ్మె (నారాయణ స్వరూపుడైన వైద్యుడికి మన తెలుగు పత్రికలు తగిలించిన పేరు జూడా) అని పేపర్లలో వార్త వేసి ఊరుకుంటారు తప్ప వారి క్షేమమే మన క్షేమం అని గ్రహించేట్లు చేయరు. ఇప్పటికే డాక్టర్ల, నర్సుల కొరత ఉంది. ఇలాటి భయాల వలన ఆ కొరత మరింత పెరుగుతుంది. ఇక మనకు ఎక్కణ్నుంచి దొరుకుతారు వైద్యులు? వైద్యుల లభ్యత పెరగాలంటే వైద్యవిద్య అందుబాటులో ఉండాలి. ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగు కాలేజీలకు అనుమతులు యిచ్చే ప్రభుత్వం వాటిలో పదో వంతు మెడికల్ కాలేజీలకు యివ్వదు. తను పెట్టదు. ఏదైనా ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పెట్టినా, తర్వాతి ప్రభుత్వం వచ్చి ప్రయివేటు పరం చేస్తానంటోంది.
అన్యాయం కదా అంటే, అబ్బే పిపిపి (ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం) అంటుంది. అంటే వాటిల్లో ప్రయివేటు ఆసుపత్రుల కంటె రేట్లు తక్కువగా ఉంటాయా? లేక ఫీజులు తక్కువగా తీసుకుంటారా? ఏ విషయమూ క్లియర్‌గా చెప్పరు. ఆ పేరుతో మేనేజ్‌మెంట్ ప్రయివేటు రంగానికి అప్పగించేస్తారు. వాళ్లు కోట్లాది రూపాయల ఫీజు అంటారు. మన విద్యార్థినీ విద్యార్థులు చైనాకో, ఉక్రెయిన్‌కో వెళతారు. అక్కడ యుద్ధం వస్తే నానా అవస్తలూ పడతారు. ఇలాటి పరిస్థితుల్లో చరకులు పుట్టుకుని వస్తారని నమ్మగలమా?
వైద్యం అంటేనే గడగడ వణికే పరిస్థితి వచ్చింది. సాధ్యమైనంత వరకు రోగం పాలన పడకుండా యిమ్యూనిటీ పెంచుకోవడమే మంచిదనే అవగాహన పెరుగుతోంది. అయినా రోగం ముంచుకుని వస్తే, వైద్యో నారాయణో అనే ముందు భాగం వదిలేసి కేవలం ‘హరీ’మంటున్నారు. వెంటనే ‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యీ మరణం, 50 లక్షలు నష్టపరిహారం యిచ్చేదాకా యీ శవాన్ని యిక్కణ్నుంచి కదల నీయం’ అంటూ శవరాజకీయాలు చేయడానికి దిగబడిపోతారు- చాణక్యులు. దురదృష్టవశాత్తూ వారు చిరంజీవులు!
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
Govt hospital కి supply చేసే medicines ను, తక్కువ rate quote చేసిన వాడికి గుడ్డిగా ఇవ్వడం ఆపి….మంచి medicines bluk లో govt ye మంచి companies నుంచి కొంటె….నూటికి తొంబై మంది ఆ NCD( BP , diabetes and others) కి MEDICINES govt hospital లోనే తీసుకుంటారు….యెంతో మనీ save అవుతుంది…… quality medicines supply చేస్తే……బలవంతంగా patients ని govt hospital కి వచ్చేలా చర్యలు కూడా అవసరం వుండదు…simple solution…..ఇది తప్ప అన్ని చేస్తారు….🙏🙏🙏
neetulu cheppebadulu eeyane velli rajakiyalalo cheri, desaaniki paniki vache pani cheyyochu kada.
చచ్చీ చెడి ఇంటర్ నుండి 7 ఏళ్ల పాటు చదివి ఎంబీబీఎస్ చేస్తే గట్టిగా 25 వేలు జీతం కూడా రావడం లేదు.
చదువు లేని కూలీ కి కూడా నెలకి 40 వేలు వస్తాయి ఈ రోజుల్లో.
ఫార్మా కంపెనీలు లో ఇంకా ఘోరం.
PhD చేసిన వాళ్ళకి మరీ 20 వేలు మాత్రమే స్టార్టింగ్ సాలరీ ఆఫర్ చేస్తున్నారు.
అందుకే అందరూ తక్కువ శ్రమ తో ఎక్కవ డబ్బులు వచ్చే వేరే ప్రొఫషన్ కి వెళుతున్నారు.