మెట్టు దిగడానికీ బాబు సిద్ధం! శ్రీలక్ష్మికి మాత్రం నో!

శ్రీలక్ష్మి తర్వాత అనంతరాము జాబితాలో ఉన్నప్పటికీ.. ఆయన విషయంలో కూడా చంద్రబాబు సుముఖంగా లేరని సమాచారం.

జగన్ హయాంలో కీలక పదవులు నిర్వహించిన ప్రతి అధికారినీ పక్కన పెడుతూ కొత్త ప్రభుత్వం పరిపాలన సాగించడం అనేది సాధ్యం కాని పని. అందుకే జగన్ సర్కారులోనూ, ఇప్పుడూ కూడా పలువురు అధికారులు తమ స్థాయికి తగిన కీలక పదవుల్లోనే కొనసాగుతూ ఉంటారు.

అదే తరహాలో.. జగన్ పరిపాలన రోజుల్లో కీలక విభాగాలకు సారథ్యం వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నియమితులు కాబోతున్నట్టుగా అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్.. ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ మీద కసరత్తు చేస్తున్న చంద్రబాబు.. సీనియారిటీ లిస్టులో సాయిప్రసాద్ వైపు మొగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడికే ఆయన ఒక మెట్టు దిగి మరీ అంగీకరించినట్టుగా చెబుతున్నారు.

నిజానికి నీరభ్ కుమార్ ప్రసాద్ తరువాత సీనియారిటీ లిస్టులో శ్రీలక్ష్మి ఉన్నారు. అయితే.. ఆమెను చీఫ్ సెక్రటరీ పదవిలో కూర్చోబెట్టడానికి మాత్రం.. చంద్రబాబు ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి మీద బనాయించిన అనేక కేసుల విషయంలో వై శ్రీలక్ష్మి కూడా నిందితురాలు. జగన్ కేసుల విచారణ సాగుతున్న కాలంలో ఆమె కూడా విచారణ ఎదుర్కొన్నారు. అరెస్టు కూడా అయ్యారు. తర్వాత బయటకు వచ్చిన శ్రీలక్ష్మి రాష్ట్ర విభజన తర్వాత ఐఏఎస్ ల పంపకాల్లో తెలంగాణకు కేటాయింపబడ్డారు.

అయితే.. తనను ఏపీ సర్వీసులకు కేటాయించాల్సిందిగా ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించుకుని.. ఏపీకి వచ్చారు. జగన్ పరిపాలన కాలంలో కీలక శాఖలకు సారథ్యం వహించారు. చిన్న వయసులోనే ఐఏఎస్ కు ఎంపికైన శ్రీలక్ష్మి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ అవుతారని అంతా అనుకునే వారు కానీ.. సీనియారిటీ జాబితాలో ఆమె పేరు వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఆమె మీద అవినీతి ఆరోపణలు ఉన్నందున ఈ పోస్టులోకి తీసుకోరాదని చంద్రబాబు సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

శ్రీలక్ష్మి తర్వాత అనంతరాము జాబితాలో ఉన్నప్పటికీ.. ఆయన విషయంలో కూడా చంద్రబాబు సుముఖంగా లేరని సమాచారం. ఈ ఇద్దరినీ ఇతర పెద్దపోస్టుల్లోకి సర్దుబాటు చేసిన తర్వాత.. సాయిప్రసాద్ ను చీఫ్ సెక్రటరీ చేస్తారని తెలుస్తోంది. గతంలో జగన్ ప్రభుత్వంలో కీలక పదవుల్లోనే ఉన్నప్పటికీ.. అంతకంటె ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన పేషీలో కార్యదర్శిగా పనిచేశారు. అప్పట్లో ఏర్పడిన నమ్మకమే ఇప్పుడు సీఎస్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది.

2 Replies to “మెట్టు దిగడానికీ బాబు సిద్ధం! శ్రీలక్ష్మికి మాత్రం నో!”

Comments are closed.