ఎన్నికల కోసం గ్యాప్.. కథ కోసం కాదు

బాలకృష్ణకు 3 కథలు చెప్పలేదు. ఒకే కథను 3 విధాలుగా చెప్పాం.

కొన్ని రోజుల కిందటి సంగతి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైంది. అదే టైమ్ లో బాలకృష్ణ, బాబి దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేశారు. దీంతో బాబి సినిమాపై డౌట్స్ మొదలయ్యాయి. కథలో మార్పుచేర్పుల కోసం యూనిట్ టైమ్ తీసుకుందనే ప్రచారం జరిగింది.

దీనిపై దర్శకుడు స్పందించాడు. కథలో ఎలాంటి మార్పులు చేయలేదన్నాడు. “బాలకృష్ణ చెప్పిన మార్పుచేర్పుల కోసం గ్యాప్ తీసుకోలేదు. ఆయనకు ఎన్నికల కోసం రెండున్నర నెలలు గ్యాప్ ఇచ్చాం. అంతే తప్ప కథలో మార్పుల కోసం కాదు. భగవంత్ కేసరి పూర్తయిన వెంటనే డాకు మహారాజ్ ప్రారంభించారు.” అని చెప్పుకొచ్చాడు బాబి.

ఈ ప్రాజెక్టుపై గట్టిగా వినిపించిన మరో పుకారుపై కూడా స్పందించాడు దర్శకుడు. బాలయ్యతో సినిమా కోసం 3 కథలు రెడీ చేశాడని, వాటిలో ఒకటి బాలయ్య ఎంపిక చేశారనే ప్రచారం నడిచింది. అందులో నిజం లేదన్నాడు డైరక్టర్.

“బాలకృష్ణకు 3 కథలు చెప్పలేదు. ఒకే కథను 3 విధాలుగా చెప్పాం. ఈ కథను ఫలానా పాత్ర ద్వారా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే ప్రయత్నంలో భాగంగా 3 వెర్షన్లు వినిపించాం. ఇందులో భాగంగా ఓ వెర్షన్ లో బాలయ్యతో పాటు మరో హీరో ఉంటే బాగుంటుందనిపించింది. దుల్కర్ సల్మాన్ లాంటి ఇంపార్టెంట్ పాత్రను అనుకున్నాం. కానీ కథ మొత్తం రెడీ అయిన తర్వాత మరో హీరో పాత్రను కథ డిమాండ్ చేయలేదు. బలవంతంగా ఆ పాత్రను ఇరికిస్తున్న ఫీలింగ్ వచ్చింది. పైగా మరో హీరోను పెడితే, మళ్లీ వాల్తేరు వీరయ్య ఫార్మాట్ లోనే సినిమా చేశాననే ఫీలింగ్ జనాలకు రావొచ్చు. అందుకే సెకెండ్ హీరో పాత్రను తీసేశాం.”

సినిమా మేకింగ్ లో భాగంగా బాలకృష్ణకు ఆప్షన్లు ఇవ్వకూడదంటున్నాడు దర్శకుడు. ఏ విషయమైనా మనమే డైరక్ట్ గా చెప్పేయాలని, మనపై నమ్మకంతో బాలయ్య ముందుకెళ్లిపోతారని అన్నాడు. డాకు మహారాజ్ లో ముగ్గురు హీరోయిన్లను కావాలని తీసుకోలేదని, ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉందని చెబుతున్నాడు బాబి.

One Reply to “ఎన్నికల కోసం గ్యాప్.. కథ కోసం కాదు”

Comments are closed.