తెలుగు సినిమాలు.. మూఢ‌న‌మ్మ‌కాలు!

భ‌క్తిభావాలు మ‌నిషికి ప్ర‌శాంతత‌ను ఇస్తే అంత‌క‌న్నా కావాల్సింది లేదు. అయితే భ‌క్తి కావొచ్చు, అధ్యాత్మిక‌త కావొచ్చు.. మ‌నిషిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళితే మాత్రం జ‌రిగే న‌ష్టం ఎంతో ఉంటుంది. మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న అందుకు…

భ‌క్తిభావాలు మ‌నిషికి ప్ర‌శాంతత‌ను ఇస్తే అంత‌క‌న్నా కావాల్సింది లేదు. అయితే భ‌క్తి కావొచ్చు, అధ్యాత్మిక‌త కావొచ్చు.. మ‌నిషిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళితే మాత్రం జ‌రిగే న‌ష్టం ఎంతో ఉంటుంది. మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న అందుకు ఒక రుజువు.

సొంత పిల్ల‌ల‌పైనే అలాంటి ప‌రాకాష్ట ప్ర‌యోగాలు చేసే అలాంటి త‌ల్లిదండ్రులు,  త‌ను కూడా ఆ మాయ‌లోనే ఆహుతి అయిన వాళ్ల పెద్ద‌మ్మాయి లాంటి వాళ్లు ఎంద‌రో ఉంటారు. ఇది ఒక దేశానికో, ఒకే మ‌తానికో, ఒకే సంస్కృతికో ప‌రిమిత‌మైన జాడ్యం కాదు. ప్ర‌తి చోటా ఇలాంటి ప‌రాకాష్ట బ్యాచ్ ఉండ‌నే ఉంటుంది. అయితే వీరిలో తీవ్ర‌త‌లే తేడా!

శ‌కునాల‌ను న‌మ్మ‌డం ద‌గ్గ‌ర నుంచి… జ‌రిగే ప్ర‌తి ప‌రిణామానికీ త‌మ‌లోని న‌మ్మ‌కాల‌ను ముడిపెట్టుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి ఈ జాడ్యాలు ఒక్కోరిలో ఒక్కో డిగ్రీలో ఉండ‌వ‌చ్చు. ఇలాంటి మూఢ‌న‌మ్మ‌కాల కాన్సెప్ట్ ల మీద బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి, వ‌స్తూనే ఉంటాయి.

దెయ్యం, అతీంద్రియ శ‌క్తులు, మంత్రాలు.. ఈ కాన్సెప్ట్ లో బోలెడ‌న్ని హార‌ర్ సినిమాలు వ‌స్తుంటాయి. ప్ర‌తి యేటా విడుద‌ల‌య్యే సినిమాల్లో క‌నీసం ఏ ప‌ది శాత‌మో ఇలాంటివి ఉంటాయి. హార‌ర్, స‌స్పెన్స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తిరుగులేని ఫార్ములా. అయితే ఫార్ములాలు, ఈ సినిమాలు ఎంట‌ర్ టైన్ చేయ‌డం సంగ‌త‌లా ఉంచితే.. ఇవి జ‌నాలకు ఎలాంటి సందేశాల‌ను ఇస్తాయి? అనేది కూడా కీల‌క‌మైన అంశ‌మే.

మిగ‌తా సినిమాలు క‌లిగించే భావ‌న‌లు వేరు, ఈ త‌ర‌హా సినిమాలు క‌లిగించే భ‌యాలు, న‌మ్మ‌కాలు వేరు! ఆ ఆలోచ‌న‌లు లేని వారిలో కూడా వాటి గురించి భ‌యాన్నో, న‌మ్మ‌కాన్నో క‌లిగించే శ‌క్తి ఈ త‌ర‌హా సినిమాల‌కు ఉంద‌ని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. ఈ త‌ర‌హా సినిమాల‌ను చూసి లేనిపోని భ‌యాల‌కు గుర‌య్యే వాళ్లు బోలెడంత మంది ఉంటారు.

జ‌నాల‌ను ఎడ్యుకేట్ చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు, సినిమాలు వారిని లేనిపోని మూఢ‌న‌మ్మ‌కాల్లోకి తీసుకెళ్ల‌డం మాత్రం అవాంఛ‌నీయ‌మైన ధోర‌ణి. ద‌శాబ్దాల కింద‌టే సినిమా వాళ్లు చేత‌బ‌డుల‌కు, మాయ‌ల‌కూ, మ‌ర్మాల‌కు, దెయ్యాల‌కు, అంతీద్రీయ శ‌క్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోయారు.  వాటిని వీలైనంత‌గా ప్ర‌మోట్ చేశారు.

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ తుల‌సీద‌ళం, తుల‌సి, అష్టావ‌క్రా వంటి న‌వ‌లల ద్వారా ఏం చెప్పాడు? అంటే.. అప్ప‌టికే కాస్తోకూస్తో చ‌దువుకుని మూఢ‌న‌మ్మ‌కాల‌కు, భ‌యాల‌కు దూరం అయిన వారిలో కూడా మ‌ళ్లీ ఆ ఆలోచ‌న‌ల‌ను దిగ్విజ‌యంగా రేకెత్తించ‌గ‌లిగాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఆ న‌వ‌ల‌లు నిఖార్సైన థ్రిల్ల‌ర్లు, పేజ్ ట‌ర్న‌ర్లు.. అందులో సందేహం లేదు.

అయితే ఆ న‌వ‌ల‌ల‌ను చ‌దివిన వాళ్లు.. వాటిని అంత వ‌ర‌కే చూస్తే ఎవ‌రికీ ఏ స‌మ‌స్యా లేదు. 1970-80 ల‌నాటికే తెలుగునాట ఈ చేత‌బ‌డులు, తాంత్రిక విద్య‌లు ప‌రిమితం అయిపోయాయి. వాటిని న‌మ్మ‌డం కాదు క‌దా, అలాంటివి ఉన్నాయ‌నే విష‌యం కూడా స‌మాజంలోని ఒక వ‌ర్గానికి తెలియ‌కుండా పోయిన టైమ్ అది. పాపుల‌ర్ న‌వ‌ల‌ల‌తో వాటిని మ‌ళ్లీ ఒక త‌రం మీద న‌మ్మ‌కంగానో, అప‌న‌మ్మ‌కంగానో రుద్దారు. క‌నీసం ఆ న‌వ‌ల‌ల ఎండింగ్ లో అయినా.. అలాంటివేమీ లేవు మొర్రో అని సూటిగా సుత్తి లేకుండా చెప్పారా? అంటే.. అది కూడా లేదు!

అదేమంటే.. ఏదైనా చెప్ప‌డానికి ర‌చ‌యిత ప్ర‌వ‌క్త కాదంటూ స‌ద‌రు ర‌చ‌యిత స‌మ‌ర్థించుకున్నారు.  ప్ర‌వ‌క్త కాన‌ప్పుడు.. జ‌నాల‌కు ప‌రిచ‌యం లేకుండా పోయిన వాటిని మ‌ళ్లీ ఎందుకు ఇంట్ర‌డ్యూస్ చేసిన‌ట్టో! వాస్త‌వానికి యండ‌మూరి రాసిన తుల‌సీద‌ళంలోని క‌థా వ‌స్తువే మ‌న‌ది కాదు.

ఒక హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొంది దాన్ని తెనుగీక‌రించాడు ఆ ప్ర‌ముఖ ర‌చ‌యిత‌. ఎక్క‌డో విదేశాల్లో న‌మ్మే విచ్ క్రాఫ్ట్ ను చేత‌బ‌డిగా మ‌నకు అన్వయించేశాడు. ఒరిస్సా.. బిస్తా.. అంటూ హాలీవుడ్ సినిమాను మ‌న ద‌గ్గ‌ర జ‌రిగిన క‌థే అనేంత స్థాయిలో అనువ‌దించేసి, చేత‌బ‌డులపై మ‌ళ్లీ చ‌ర్చ‌ను రేకెత్తించి, న‌మ్మే వాళ్లు న‌మ్మేలా, న‌మ్మ‌ని వాళ్లు లైట్ తీసుకునేలా యండ‌మూరి చాలా క‌న్వీన్సింగ్ ప‌ని పూర్తి చేసుకుని పాపుల‌ర్ అయిపోయారు.

యండ‌మూరి రాసిన క్షుద్ర సాహిత్యాన్ని చ‌దివిన వాళ్లంతా వేపమండ‌లు ప‌ట్టుకుని ఊగిపోతార‌నో, శ్మ‌శానాల‌కు వెళ్లి పూజ‌లు చేస్తార‌నో అన‌డం లేదు. ఏ లక్ష‌కో ఒక‌రు అలాంటి వాటికి ప్ర‌భావితం అయినా, మాన‌సికంగా వీక్ అయిన వారు వాటిని చ‌దివి త‌మ‌పై అలాంటి ప్ర‌యోగాలు జ‌రుగుతాయేమో అనే భ‌యాన్ని పెంపొందించుకున్నా.. అదెంత న‌ష్టమో.. వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

యండ‌మూరి వార‌స‌త్వం తెలుగు సినిమా పై చాలాకాలంగా కొన‌సాగుతూ ఉంది! 80ల‌కు ముందు వ‌చ్చిన తెలుగు హార‌ర్ సినిమాలు చంద‌మామ క‌థ‌ల్లా ఉంటే, ఆ త‌ర్వాతి సినిమాలు మాత్రం.. రియాలిస్టిక్ పేరుతో విప‌రీత‌మైన మూఢ‌న‌మ్మ‌కాల‌ను ప్ర‌మోట్ చేసేలా ఉండ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మైన అంశం.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న‌లో వాళ్ల పెద్ద‌మ్మాయిపై ఈ భ‌క్తి, అధ్యాత్మిక‌త సాహిత్యం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని ప‌రిశీలించిన వారు చెబుతున్నారు. ఆ అమ్మాయి లాక్ డౌన్ స‌మ‌యంలో విప‌రీతంగా ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను చ‌దివింద‌ని… అప్ప‌టికే ఆమెలో ఉన్న న‌మ్మ‌కాల‌ను అవి పురిగొల్పాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఆమె ఓషో పుస్త‌కాల‌ను విప‌రీతంగా చ‌దివింద‌ట‌. అయితే ఓషో దేవుడు ఉన్నాడంటూ వాదించే త‌త్వ‌వేత్త కాదు. క్షుద్ర‌పూజ‌ల ప్ర‌మోట‌రూ కాదు. అయితే ఆధ్యాత్మిక పుస్త‌కాలు, విప‌రీత భావ‌జాలాల పుస్త‌కాల ప్రభావం ఆ అమ్మాయిపై ఉంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఆ కేస్ లో పుస్త‌కాల ప్ర‌భావం ఉండొచ్చు. సినిమాలు కూడా మిస్ గైడ్ చేసే అవ‌కాశాలు చాలా ఉన్నాయి. పుస్త‌కాల‌తో పోలిస్తే.. సినిమాల ప్ర‌భావం ఇప్పుడు చాలా ఎక్కువ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అలాగ‌ని తెలుగు సినిమా రూప‌క‌ర్త‌లు మూఢ‌న‌మ్మ‌కాల‌ను ప్రస్తావిస్తూనే, క్లైమాక్స్ లో అయినా స‌రైన అంశాల‌ను ప్ర‌స్తావించిన సినిమాలు రాలేద‌ని కాదు. అందుకు చాలా మంచి ఉదాహ‌ర‌ణ 'అనుకోకుండా ఒక‌రోజు' చంద్ర‌శేఖ‌ర్ యేలేటి రూపొందించిన ఈ సినిమా…  హాలీవుడ్ సినిమాల రూప‌క‌ర్త‌ల ఆలోచ‌న‌ల‌ను కూడా త‌ల‌ద‌న్నే సినిమా. భ‌క్తి పిచ్చోళ్లు, మూఢ‌న‌మ్మ‌కాలు, బాబాల‌ను న‌మ్మే ముఠాలు మ‌న ద‌గ్గ‌ర బోలెడ‌న్ని ఉంటాయి. వీళ్లు న‌మ్మే బాబాల ను ఎవ్వ‌రైనా ఏమైనా అంటే వీరు అస్స‌లు స‌హించ‌లేరు.

ఆ బాబా త‌మ బోటి విశ్వాస ప‌రుల‌ను మ‌రో లోకానికి తీసుకెళ్తాడు అనేంత న‌మ్మ‌కం వీరిలో ఉంటుంది. ప్ర‌తి ఊరిలోనూ ఇలాంటి బ్యాచ్ ఒక‌టి క‌నిపిస్తుంది. ఊరంతటిదీ ఒక దారి అయితే ఉలిపిక‌ట్టెది మ‌రో దారి అయిన‌ట్టుగా.. ఎవ‌రో  అనామ‌క బాబాను, అతడి పిచ్చి ప్రవ‌చ‌నాల‌ను మాత్ర‌మే న‌మ్మే వాళ్లు కొంద‌రుంటారు. వాళ్ల ఆశ్ర‌మాల‌కు త‌ర‌చూ వెళ్ల‌డం, అక్క‌డ వాళ్ల మార్కు తాత్విక చ‌ర్చ‌లు, క్విడ్ ప్రో కో భ‌క్తి సూత్రాలు.. వీళ్ల స్పెష‌ల్.

ఈ న‌మ్మ‌కాలు కూడా అనేక సంద‌ర్భాల్లో శ్రుతి మించుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే గ‌మ‌నిస్తే.. రెండు మూడు మండలాల‌కు అయినా ఇలాంటి లోక‌ల్ బాబాలు ఉంటారు. వీరిని అంద‌రూ న‌మ్మ‌రు. అయితే వీళ్లను న‌మ్మే వాళ్లు అతిగా న‌మ్ముతుంటారు.

ఆ బాబాల చేష్ట‌లు, మాట‌లు కాస్త త‌ర్కం ఉన్న వాళ్ల‌కు పిచ్చిగా అనిపిస్తాయి. అయితే వారికి క‌నెక్ట్ అయిపోయిన  విప‌రీత న‌మ్మ‌క‌స్తుల‌కు మాత్రం ఆ బాబాల ఉమ్మి కూడా రుచిగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే.. ఆ బాబాలకు విశ్వాస‌ప‌రులుగా మారిపోయి, త‌మ పిల్ల‌ల‌ను ఆ ప్ర‌భావంలోకి తీసుకెళ్లి, బాబాల సేవ‌ల‌కు అంటూ త‌మ కూతుళ్ల‌ను ఆశ్ర‌మాల్లో వ‌దిలేసిన వాళ్ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు!

స‌భ్య‌స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌దంగా బ‌తుకుతున్న వాళ్లు కూడా విశ్వాసాల పేరుతో అలాంటి విప‌రీత చేష్ట‌ల‌కు పాల్పడుతూ ఉంటారు. అన్నీ వార్త‌ల్లో రావు. త‌ర‌చి చూస్తే.. చుట్టుప‌క్క‌ల వాళ్ల‌లో ఇలాంటి పోక‌డ‌లు ఉంటాయి. చ‌దువుకున్న వారు, అన్నీ ఉన్న వారే అయిన‌.. ఎదిగిన కూతుళ్ల‌ను కూడా ఆశ్ర‌మాల్లో వ‌దిలి వ‌చ్చి భ‌జ‌న‌లు చేసుకునే మూర్ఖులు మ‌న స‌మాజంలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ల ముర్ఖ‌త్వాల‌కు మ‌రో రూపాలు ఎన్నో ఉంటాయి.

అలాంటి వారి గురించినే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి గొప్ప స్ట‌డీ చేసి.. ద‌శాబ్దంన్న‌ర కింద‌టే అంత అర్థ‌వంత‌మైన సినిమాను రూపొందించాడు. ఒక‌ చింపిరి చింపిరి పిచ్చోడు, ఆ పిచ్చోడు చెప్పే ప్రవ‌చ‌నాల‌ను న‌మ్మే వైట్ కాల‌ర్ పిచ్చోళ్లు.. వీళ్లంతా మ‌రో లోకాన్ని సృష్టించే ప‌నిలో ఉంటారు. మ‌ద్యం మ‌త్తులో వీళ్ల క్షుద్ర‌పూజ‌కు ఆటంకం క‌లిగిస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిపై ఆ పిచ్చోడి ఫాలోయ‌ర్లు ప‌గ‌బ‌ట్ట‌డం, ఆమెను చంప‌డానికి వారు చేసే ప్ర‌య‌త్నం, వారిలో ప‌తాక స్థాయికి చేరిన ఆ ఉన్మ‌త్త‌త‌ను చూపించి.. డీప్ క్యారెక్ట‌ర్ స్ట‌డీని తెర‌పై ఆవిష్క‌రించిన చంద్ర‌శేఖ‌ర్ యేలేటి.. ఆ సినిమాకు ఇచ్చే క్లైమాక్స్ గొప్ప సైకాల‌జీని చూపిస్తుంది.

ముళ్లును ముళ్లుతోనే తీయాల‌నే రీతిలో రాసుకున్న క్లైమాక్స్ చూసే వాళ్ల‌లో లేనిపోని అనుమానాల‌ను క‌లిగించ‌కుండా, భ‌క్తి ఉన్మ‌త్త‌త ఎంత అసంమ‌జ‌స‌మైన‌దో, పిచ్చిబాబాల‌ను న‌మ్మ‌డం ఎంత ప‌నికిమాలిన ప‌నో కూడా ఆ సినిమాలో స్ప‌ష్టంగా చూపించ‌గ‌లిగారు. ఇలాంటి ప్ర‌య‌త్నాలు మాత్రం అరుదుగా జ‌రిగాయి. ఈ విష‌యంలో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తెలుగు షినిమాకు గొప్ప‌ దార్శానికుడు.

ఇక కృష్ణ‌వంశీ వంటి ద‌ర్శ‌కుడు 'శ్రీ ఆంజ‌నేయం' అనే పేరుతో తీసిన సినిమాలో.. చేత‌బ‌డి, క్షుద్ర‌పూజ‌ల‌తో హ‌త్య‌లు చేయ‌వ‌చ్చ‌నే విధానాన్ని చూప‌డం ద‌ర్శ‌కుడిగా త‌న స్థాయిని పాతాళానికి తీసుకెళ్లిన అంశం. బూరె  బుగ్గ‌ల క్షుద్ర‌మాంత్రికుడు, చేత‌బ‌డి- ఆవాహన‌ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేను చంపాల‌ని చూసే విల‌న్.. వీటిని చూస్తే.. కృష్ణ‌వంశీ అమాయ‌కుడో, త‌న సినిమాల‌ను చూసే ప్రేక్ష‌కుల‌ను వెర్రివాళ్లు అని ఆ ద‌ర్శ‌కుడు భావించాడో అనే డౌటొస్తుంది.

ఇక ఇటీవ‌లి కాలంలో హార‌ర్ కామెడీలు చాలా ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. థియేట‌ర్లో కాసేపు భ‌య‌ప‌డి, థ్రిల్ పొందే అనుభ‌వాన్ని ఇస్తూ ఇవి బాక్సాఫీస్ హిట్ ఫార్ములాగా మారిపోయాయి. ఇలాంటి సినిమాల సంఖ్య క్ర‌మంగా ఎక్కువ‌వ్వ‌డంతో.. దెయ్యం అంటే ప్రేక్ష‌కుల‌కు కామెడీ అయిపోయింది, నిజంగానే దెయ్య‌మంటూ ఉండి, వ‌చ్చి ప‌ల‌క‌రించినా.. ఈ సినిమాల్లోలా వాటితో జ‌నాలు కామెడీ చేసేంత స్థాయికి దెయ్యం స్థాయిని దించేశారు తెలుగు సినిమా వాళ్లు.  కానీ వీటిల్లో ఎన్నో మూఢ‌న‌మ్మ‌కాల‌ను ప్ర‌మోట్ చేస్తూనే ఉన్నారు.

కొత్త కొత్త మూఢ‌న‌మ్మ‌కాల‌ను, దెయ్యాల‌కు ఉండే విప‌రీత శ‌క్తుల‌ను కూడా క్రియేటివిటీ ద‌ట్టించి ప్ర‌మోట్ చేస్తూ ఉన్నారు. చదువుకున్న వారిలోనే ఇలాంటి వాటిపై న‌మ్మ‌కాలంటే, అప్ప‌టికే ఎంతో కొంత ఈ న‌మ్మ‌కాల ప్ర‌భావాల‌కు లోనైన వారిని ఈ సినిమాలు మ‌రింత భ‌య‌పెట్ట‌డ‌మో, ఏదో ఉంద‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించ‌డ‌మో చేయ‌డానికి త‌మ వంతు పాత్ర పోషిస్తాయి.  

మూఢ‌న‌మ్మ‌కాల‌ను గ్లోరిఫై చేయ‌డం, క్షుద్ర విద్య‌ల‌నే మ‌రో మూఢ‌న‌మ్మ‌కాన్ని ప్ర‌మోట్ చేయ‌డం తెలుగు సినిమాలు చేసే దుర్మార్గ‌పు చ‌ర్య‌ల్లో ఒక‌టి. స‌మాజంలో జ‌రుగుతున్న దారుణాల‌ను గ‌మ‌నించి అయినా.. అలాంటి పోక‌డ‌లు ఆగితే మంచిది.

-జీవ‌న్ రెడ్డి.బి

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా