ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఎన్నికల్లో.. తొలి విడత ఎన్నికలు జరిగే వాటిల్లో ఎన్ని ఏకగ్రీవం అయ్యాయనేది ఆసక్తిదాయకంగా మారింది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవం కావడం అందరికీ మంచిదే. అయితే ఏపీలో విపరీత రాజకీయ ధోరణులతో ఏకగ్రీవాల పట్ల పెద్ద రాజకీయం జరుగుతూ ఉంది.
ఏకగ్రీవం కావడం అంటే.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడగల సమర్థులు ఒప్పుకుని ఒకరి అభ్యర్థిత్వానికి ఓకే చెప్పడం. అయితే అటు ఎన్నికల్లో పోటీ పడలేక, ఏకగ్రీవం జరగడం పై రచ్చ చేసే వాళ్లు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఇలాంటి వారు ఈ ఏకగ్రీవాలపై ఎంత రాజకీయం అయినా చేయగలిగే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది.
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అటు ఇటు దాదాపు వంద పంచాయతీలు ఏకగ్రీవం కావొచ్చనేది ప్రస్తుతం ఉన్న అంచనా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు తొలి స్థానంలో ఉండటం గమనార్హం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కేవలం ఐదారు పంచాయతీలు మాత్రమే ఏకమయ్యే పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు సొంత జిల్లాలో ఏకంగా 19 పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయి.
ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఏకగ్రీవం అవుతున్న పంచాయతీల ఒకటీ, రెండుకు మించకపోవడం గమనార్హం. ఈ ఏకగ్రీవాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అని సూఛాయగా స్పష్టం అవుతోంది.