తన భార్యకు కావాల్సినవన్నీ తను తెచ్చిపెడుతున్నట్టుగా, తనకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్టుగా ఏ మగాడిని అడిగినా చెబుతాడు. మరి అది అంత సులువు అయితే.. ప్రపంచ మనుగడే మరోలా ఉండేది! వివాహం అనేది వ్యవస్థీకృతంగా మంచిదే అయినా అందులో ఇమిడిన వ్యక్తులు మాత్రం అనేక రకాలుగా సర్దుకుపోతూ ఉంటారు.
ప్రత్యేకించి వివాహ వ్యవస్థ ఈ ప్రపంచంలో ఈ మాత్రం ఉందన్నా.. అందులో మగువలు సర్దుకుపోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఏ తరానికి తగ్గట్టుగా ఆ తరం వారు అందులో సర్దుకుపోతూ ఉంటారు. ఈ విషయంలో పోలికలు అక్కర్లేదు.
ఈ తరం వారిని చూసి పాత తరం వారు ఈ మాత్రం స్వతంత్రం కూడా తమకు లేకపోయిందనుకోవచ్చు. అయితే.. ఈ తరం వివాహ బంధాలకు ఈ తరం సమస్యలు ఉండొచ్చు.
సమస్యలు అనేది పెద్ద పదం అనిపించినా.. చిన్న చిన్న విషయాల్లో మగువలకు కొన్ని ప్రత్యేక కోరికలు ఉండవచ్చని అంటున్నారు రిలేషన్షిప్ కన్సల్టెంట్ లు. అనేక మంది అతివల అభిప్రాయాలను తీసుకుని వారు చెప్పే విషయం ఏమిటంటే.. స్త్రీ వ్యక్తిగతంగా, ప్రాథమికంగా కోరుకునే కనీస ఏమిటంటే..
తనతో తను గడపడానికి కొంత సమయం..
ఇది చాలా ముఖ్యమైనది. ప్రస్తుత తరం పెళ్లైన యువతులకు ఒక రకంగా డబుల్ బర్డెన్ ఉంటోంది. చదువుకున్న చదువు, ఉన్న అవకాశాల మేరకు వారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందనే లెక్కలతో అబ్బాయిలు కూడా అలాగే చాలా మంది కోరుకుంటున్నారు. అ
యితే అలాంటి అమ్మాయిలకు కూడా ఇళ్లలో చాకిరీ తప్పదు. ఆఫీసు పనైపోయి ఇంటికి రాగానే.. మగాడు తన కంఫర్ట్ మేరకు ఉండగలడు. అయితే ఉద్యోగం చేసే భార్యలకు మాత్రం.. ఇంటికి వచ్చాకా వేరే బాధ్యతలన్నీ ఉంటాయి. పిల్లలు కూడా కలిగిన జంటల్లో ఉద్యోగులు చేసే భార్యల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. వీటన్నింటి మధ్యనా.. తనకంటూ కొంత సమయం కావాలని, తన కోరిక మేరకు తనతో తాను గడపడానికి సమయం కావాలనుకుంటారు. దీనికి మహిళలు మినహాయింపు కాదు.
గతాన్ని తవ్వొద్దు..
మనం కమ్యూనికేషన్ యుగంలో ఉన్నాం. గత పది, 15 సంవత్సరాల్లో సామాజికంగా పరిస్థితులు చాలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు ప్రేమలో, డేటింగ్ లో ఉండే వారు ఉంటారు. అదంతా గతం. వారు పాత ప్రియుడితో ఇప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ నూ మెయింటెయిన్ చేయకపోవచ్చు.
అలాంటి వారి విషయంలో గతంగతః అన్నట్టుగా వ్యవహరిస్తే అందరికీ మంచిది. తమ పాత వ్యవహారాల గురించి వాకబు చేయడం, వాటిని పట్టుకుని ఇప్పుడు ఏదైనా మాట్లాడటం ఆడవాళ్లు అస్సలు సహించలేరని స్పష్టత తెచ్చుకోవాల్సిందే పెళ్లైన మగాడు. ఎందుకంటే తను కూడా ఈ జనరేషన్ వాడే, తన గత చరిత్ర ఏమిటో తను కూడా పరిశీలించుకోవాలి మరి!
కొంచెం డబ్బు..
ఉద్యోగం చేసే వాళ్లు అయినప్పటికీ.. భార్య సంపాదించే సొమ్ముకు తగ్గట్టుగానే ప్రణాళికలు వేసుకుంటారనేది నిష్టూరమైన సత్యం. భార్యను ఉద్యోగానికి పంపించే మగాడు ఆమె సంపాదించే దానిపై అథారిటీ మాత్రం తనదే అంటాడు.
ఒకవేళ ఆమె సంపాదించినా, సంపాదించకపోయినా… తమ వద్ద అంటూ కొంత డబ్బు ఉండటాన్ని, దాన్ని ఖర్చు పెట్టకుండా దాన్ని చూసుకునే తత్వం ఉంటుందట ఆడవాళ్ల వద్ద. అది వారిని మానసికంగా సంతోష పెట్టవచ్చు. ఆ మాత్రం ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.
తన ఆసక్తులపై రన్నింగ్ కామెంట్రీ వద్దు..
ఆడవాళ్లకు కూడా ప్రత్యేకంగా వారి అభిరుచులు ఉంటాయి. వారు సినిమాలు చూస్తారు, వారంటూ కొన్ని సీరియల్స్ చూసుకోవచ్చు, వాళ్ల ఎంపికకు తగ్గట్టైన ఓటీటీ కంటెంట్ ను చూసుకోవచ్చు. అది భర్తకు నచ్చాల్సిన అవసరం లేదు.
తన భార్య తను చూసిందే చూడాలి అనుకునేంత మూర్ఖత్వం చాలా మందికి ఉండకపోవచ్చు. అయితే భార్య చూసే సీరియల్స్ మీదనో, తనకు నచ్చే సినిమాల మీదనో ఆమె ఆ పనిలో ఉన్నప్పుడు కామెంట్ చేసే వాళ్లు, ఛానల్ మార్చే వాళ్లూ మాత్రం చాలా మంది ఉంటారు.
మీ ఆసక్తి మీ ఫ్రెండ్స్ కు నచ్చనట్టుగా.. మీ భార్య ఆసక్తి నచ్చకపోవచ్చు. ఫ్రెండ్ ను అయితే తేలికగా కామెంట్ చేయలేం, భార్య విషయంలో మాత్రం రన్నింగ్ కామెంట్రీ సాగుతూ ఉంటుంది. అదే సబబు కాదనేది నిపుణులు చేసే సూచన!