ప్రేమ ఇద్దరి మనసులను, మనుషుల్ని కలుపుతుందంటారు. కానీ ఓ విద్యార్థి ప్రాణాల్ని బలిగొంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గురవయ్య, శివకుమారి దంపతుల ఏకైక కుమారుడు వెంపటి సాయి. ఈ యువకుడు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టయిర్ చదువుతున్నాడు. సాయికి ఉండవల్లి సెంటర్‌లో కొందరు విద్యార్థులతో స్నేహం ఏర్పడింది. వాళ్లలో ఐటీఐ విద్యార్థి కూడా ఉన్నాడు. ఈ ఐటీఐ విద్యార్థి తన ఇంటి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
తన మిత్రుడు ప్రేమిస్తున్న ఆ యువతి ఫొటోను వెంపటి సాయి తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. అంతటితో ఆగినా సమస్య లేకపోయేది. ఆ ఫొటోకు ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టాడు. ఇది ఐటీఐ విద్యార్థి కంటపడింది. దీంతో తన ప్రియురాలికి ఐ లవ్ యూ చెప్పడాన్ని భరించలేకపోయాడు.
ఈ నేపథ్యంలో సాయిని ఉండవల్లి సెంటర్‌కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత సాయి అదృశ్యమయ్యాడు. తమ కుమారుడు కనపించకపోవడంతో సాయి తల్లిదండ్రులు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఒక వైపు సాయిపై దాడికి పాల్పడిన విద్యార్థులను పోలీసులు విచారిస్తుండగా, మరో వైపు సాయి వడ్డేశ్వరం వద్ద బకింగ్‌హామ్ కెనాల్‌లో శవమై కనిపించాడు. తమ కుమారుడు సాయిని అతని స్నేహితులు చంపి కాలువలో పడేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తుండడం గమనార్హం. లోతుగా దర్యాప్తు జరిపితే నిజాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.