రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు పూజారే అని తేల్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. పూజారి ఆర్థిక కష్టాలను ఆసరాగా చేసుకుని కొందరు టీడీపీ నేతలు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్టు తేల్చారు పోలీసులు. 30వేలకు బేరం మాట్లాడుకుని ఈ పాడుపని పూర్తి చేశారు.
పూజారితోనే విగ్రహాన్ని ధ్వంసం చేయించి, అదే పూజారితో పోలీసులకు ఫిర్యాదు చేయించి తమాషా చూశారు. పూజారి చెప్పిన వివరాలపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా పరిశోధన చేశారు. దీంతో నిజం బయటపడింది.
రామతీర్థం ఘటన తర్వాత రాష్ట్రంలో ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం ఓ సీరియల్ లా కొనసాగింది. అదిగో అక్కడ విగ్రహం పక్కకు జరిగిందంటే, ఇదిగో ఇక్కడ దీపారాధన ఆగిపోయింది అనే వరకు వచ్చింది వ్యవహారం. అన్నిటికీ కారణం అధికార వైసీపీయేనని, వారి ప్రోద్బలంతోనే, మతమార్పిడులకు అనుకూలంగా ఈ దాడులు జరిగాయనేది ప్రతిపక్షాల ఆరోపణ.
కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాష్ట్రంలో ఆందోళనలు రేకెత్తించడానికి ప్రతిపక్షాలు ఈ కుట్రకు పాల్పడ్డాయనేతి ప్రభుత్వ వాదన. చివరకు ప్రభుత్వ వాదనే నిజమని తేలింది. ప్రతిపక్షాలు కావాలనే ఈ పని చేశాయని విచారణలో తేలింది.
పూజారితో పాటు అరెస్ట్ అయిన మళ్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతిరాజు.. ఇద్దరూ టీడీపీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ అనుచరులుగా తేలింది. వెంకటరాజు సతీమణి, రాజమండ్రి 42వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా పనిచేశారు.
ఇక వెంకటపతిరాజు అనే వ్యక్తి టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. అధినేత పురమాయించారో లేక, వారికే దుర్బుద్ధి కలిగిందో తెలియదు కానీ.. ఆలయాల ఘటనలో వీళ్లు ఉన్నారు. పూజారితోటే పాడుపని చేయించారు.
పచ్చ పత్రికల్లో వార్తకు స్థానం లేదు..
ఆలయాల ఘటనలు జరిగిన సమయంలో అదిగో అక్కడ అపచారం జరిగింది, ఇదిగో ఇక్కడ తప్పు జరిగింది అంటూ బ్యానర్ వార్తలు వండివార్చిన పచ్చపాత మీడియాకి సిట్ దర్యాప్తు చిన్నదిగా తోచింది.
ఈనాడు జిల్లా పేజీకి పరిమితం చేయగా, ఆంధ్రజ్యోతి నాలుగు లైన్ల కాలమ్ కేటాయించింది. తప్పు చేసింది పూజారి, చేయించింది టీడీపీ నాయకులు అని తేలడంతో బాబు అనుకూల మీడియా తేలుకుట్టిన దొంగలా మారింది. తప్పుడు పని చేసింది ఎవరో బయటకు చెప్పుకోలేక, అసలు కేసు విచారణ వార్తనే పక్కనపెట్టేశారు.
రాజమండ్రితో పాటు.. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఆలయాల ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజమండ్రి రూరల్ మండలం వెంకటగిరి ప్రాంతంలో వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ సందీప్ ని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
చూస్తుంటే.. ఏపీలో జరిగిన ఆలయాల ఘటనల వెనక టీడీపీ నేతల హస్తం ఉన్నట్టు స్పష్టమవుతోంది. దుర్ఘటనలు జరిగినప్పుడు ఎగిరెగిరి పడ్డ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా.. నిజాలు బయటపడేసరికి నోరు మూసుకుంది.