సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఇలా వచ్చి అలా అయిపోతాయి. నూటికి 75శాతం గ్రామాల్లో పెద్దగా 'పంచాయతీ' పట్టింపు వుండదు. ఎందుకంటే ఆదాయంత వుండని పంచాయతీలే ఎక్కువ. నామినేషన్ పనులు సంపాదించుకుని కాస్త ఎన్నికల ఖర్చు రికవరీ చేసుకోవాలి తప్ప, మరో మార్గం వుండదు. ఇలాంటి పంచాయతీల్లో కులాలు, కుటుంబాలు, లోకల్ ఏరియాల ప్రాతిపదికగా ఎవరు పదవి చేపట్టాలి అన్నిది సెటిల్ చేసేసుకుంటారు.
ఇక్కడ ఎన్నికలు ఎంత చప్పగా జరుగుతాయి అంటే వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి జనాలే దొరకరు. చాలా గ్రామాల సర్పంచ్ లు ఆటో డ్రైవర్లుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేస్తున్నవారు కూడా వుంటారు. ఇక్కడ పార్టీల ప్రమోయం కన్నా, పైన పేర్కోన్న విషయాలే ప్రాధాన్యం వహిస్తాయి. అసలు పంచాయతీలకు రిజర్వేషన్లు రాకముందు చిరకాలం ఒకే కుటుంబం లేదా ఒకే వ్యక్తి చేతిలో సర్పంచ్ పదవులు వుండేవి.ఇక్కడ ప్లస్ వుండేది మైనస్ వుండేది.
ఇక మిగిలిన 25శాతం వ్యవహారం వేరు. ఇవి మేజర్ పంచాయతీలు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మినీ మున్సిపాల్టీలు. ఇక్కడ లే అవుట్ లు, విలువైన స్థలాలు వంటి వ్యవహారాలు ఉంటాయి. ఇక్కడే అసలు సిసలు పోటీ వుంటుంది. అలాగే ఈ 25శాతం లో మరో తరహా పంచాయతీలు కూడా వుంటాయి. ఇక్కడ ఆధిపత్య ధోరణి ఎక్కువ వుంటుంది. తమ మాట నెగ్గాలి, తమ పంతం నెగ్గాలి అనే టైపు. మొత్తం మీద 25శాతం పంచాయతీల్లోనే ఎన్నికల హడావుడి ఎక్కువ.
ఇలాంటి నేపథ్యంలో సాధారణంగా మీడియా పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ కవరేజ్ ఇవ్వదు. లోకల్ ఎడిషన్లకు మాత్రమే పంచాయతీ వార్తలు పరిమితం అయిపోతాయి. పంచాయతీల్లో ఎక్కువగా ఎన్నికల ప్రచారం కూడా సంప్రదాయ విధానాలకు డిఫరెంట్ గా వుంటుంది. రైతువారీ ఎక్కువగా వుండే గ్రామాల్లో పగటి వేళల్లో కాకుండా సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ప్రచారం సాగుతుంది.
కానీ ఈసారి మీడియా పంచాయతీ ఎన్నికల మీద ఎక్కడ లేని ఆసక్తి కనబరుస్తోంది. పంచాయతీల్లో ఏదో జరిగిపోతోంది. ఇదేదో జగన్ ప్రభుత్వ పనితీరును నిర్ణయించే ఉపఎన్నికలు అన్న రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తోంది. పంచాయతీల్లో దారుణాలు జరుగిపోతున్నాయనో, దాడులు జరిగిపోతున్నాయనో తెగ హడావుడి చేస్తోంది. కానీ ఈవార్తలు అన్నీ వడబోసి, చదివితే పట్టుమది పదిగ్రామాల వ్యవహారాలు అని ఇట్టే తెలిసిపోతుంది.
కానీ ఇదే రాష్ట్రం అంతటి పరిస్థితి అన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తోంది. ఆ విధంగా జగన్ ప్రభుత్వాన్ని బదనామ్ చేయాలన్నదే ఆలోచన అని అర్థం అయిపోతోంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే అసలు సిసలు ఎన్నికలు ఇంకా మూడేళ్ల దూరంలో వున్నాయి. అప్పటికి ఇవేమీ జనానికి గుర్తు వుండవు. ఎందుకు నిన్నమొన్నటి ఆలయాలపై దాడుల సంగతే జనానికి పట్టడం లేదు. రాజమండ్రిలో దేవుడి విగ్రహాన్ని పూజారికి ఆశపెట్టి తెలుగుదేశం జనాలే చేయించారనే వార్త ఇప్పుడు ఎవరికీ అక్కరలేదు.
గతంలో పవన్ కళ్యాణ్ విశాఖలో నానా హడావుడి చేసారు. జనాలకు పనులు దొరకడం లేదు అని. ఇప్పుడు ఎవరికన్నా గుర్తుందా? కరోనా టైమ్ లో ఇల్లు దాటి రాలేకపోయారు జనం. బయటకు వస్తే లాఠీ చార్జ్..ఎవరికన్నా గుర్తుందా? అసలు సిసలు వ్యవహారం అంతా ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రారంభం అవుతుంది. అప్పుడు ఏం జరిగితే అదే కీలకం.
అంతవరకు ఆత్మానందం కోసం, జగన్ ను బదనామ్ చేయాలనే తాపత్రయంలో చేసే హడావుడి తప్ప, ఇదంతా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి పనికి వచ్చేది కాదు. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ తొందరపడి పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించినపుడే జనం నవ్వుకున్నారు. దాన్ని బట్టే అర్థం అయిపోతోంది. ఈ అను'కుల' మీడియా హడావుడి ఏ మేరకు 'దేశా'నికి ఉపయోగం అన్నది.