అక్ష‌ర ప‌ర్వంలో ఈనాడు దౌర్జ‌న్య‌కాండ‌…

అక్ష‌ర క‌నిక‌ట్టు విద్య ఈనాడు ప‌త్రిక‌కు ప‌ట్టుబ‌డినంత‌గా, మ‌రే మీడియా సంస్థ‌కు ఒంట‌ప‌ట్ట‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా సామాన్యుల‌పై దౌర్జ‌న్యాలు ఎక్క‌డ జ‌రిగినా, ఎవ‌రు చేసినా నిష్ప‌క్ష‌పాతంగా క‌ళ్ల‌కు క‌ట్ట‌డం…

అక్ష‌ర క‌నిక‌ట్టు విద్య ఈనాడు ప‌త్రిక‌కు ప‌ట్టుబ‌డినంత‌గా, మ‌రే మీడియా సంస్థ‌కు ఒంట‌ప‌ట్ట‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా సామాన్యుల‌పై దౌర్జ‌న్యాలు ఎక్క‌డ జ‌రిగినా, ఎవ‌రు చేసినా నిష్ప‌క్ష‌పాతంగా క‌ళ్ల‌కు క‌ట్ట‌డం మీడియా బాధ్య‌త‌. అయితే దౌర్జ‌న్య‌కారులు తాను ప్రేమించే పార్టీ వారైతే ఒక ర‌కంగా, ప్ర‌త్య‌ర్థులైతే మ‌రో ర‌కంగా పాఠ‌కుల‌కు చూపాల‌నే తాప‌త్ర‌యంలో  ఈనాడు జ‌ర్న‌లిజం విలువ‌ల‌కు పాత‌రేసింది.

అక్ష‌ర ప‌ర్వంలో ఈనాడు నిస్సిగ్గుగా దౌర్జ‌న్య‌కాండ‌కు దిగింద‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.  “నామినేష‌న్ల ప‌ర్వంలో దౌర్జ‌న్య‌కాండ” శీర్షిక‌తో ఈనాడులో బ్యాన‌ర్ క‌థ‌నం ఇచ్చారు. ఈ క‌థ‌నం ఉప శీర్షిక‌లుగా “ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌ద్ద‌తుదారుల‌పై వైసీపీ నాయ‌కుల దాడులు”, “రెండుచోట్ల స‌ర్పంచి అభ్య‌ర్థినుల భ‌ర్త‌ల అప‌హ‌ర‌ణ‌”, “శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌త్రాల చించివేత” అంటూ ఇచ్చారు. ఇక క‌థ‌నంలోకి వెళితే…

” వైకాపా నాయకులు, శ్రేణుల బెదిరింపులు, అపహరణలు, అడ్డగింతలు, దాడుల నడుమ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల ఘట్టం ఆదివారం ముగిసింది” అని రాసుకొచ్చారు.. ఈ క‌థ‌నంలో  చిత్తూరు జిల్లాలో తెదేపా ఎమ్మెల్సీ రాజసింహులు (దొరబాబు) ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ‌డం మొద‌లుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌ను రాసుకొచ్చారు.  

ఇదే క‌థ‌నంలో నిమ్మాడ‌లో ఉద్రిక్త‌త అనే స‌బ్ హెడ్డింగ్‌తో చిన్న వార్త ఇచ్చారు. ఈ వార్త‌ను జాగ్ర‌త్త‌గా చ‌దివితే ఈనాడు నిజ స్వ‌రూపం ఏంటో తెలుసుకోవ‌చ్చు. ఆ వార్త ఎలా సాగిందంటే…

“పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెదేపా, వైకాపా అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. వైకాపా బలపరిచిన అభ్యర్థి వేరే గ్రామంవారితో కలిసి నామినేషన్‌ వేయడానికి ప్రయత్నం చేయగా స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైకాపా అభ్యర్థితో పాటు ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ సహా పలువురు నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు ఎక్కడివారిని అక్కడే నిలువరించారు. సాయుధ బలగాలనూ మోహరించారు. అభ్యర్థిని దగ్గరుండి తీసుకెళ్లి నామినేషన్‌ వేయించారు. ఆ సమయంలో తెదేపా నేతలను కట్టడి చేశారు”

ఈనాడు దుర్మార్గానికి ఈ చిన్న వార్తే నిద‌ర్శ‌నం. నిజాల్ని ఎలా హ‌త్య చేయ‌వ‌చ్చో ఈ వార్త‌ను చూసి నేర్చుకోవ‌చ్చు. అడుగ‌డుగునా నిజాల‌కు నిర్భ‌యంగా ఈనాడు స‌మాధి క‌ట్ట‌డాన్ని చూడొచ్చు. బ్యాన‌ర్ హెడ్డింగ్ మొద‌లుకుని వార్త క‌థ‌నం అంతా శివాలెత్తిన‌ట్టు వైసీపీపై అక్ష‌ర దౌర్జ‌న్యానికి పాల్ప‌డిన ఈనాడు… టీడీపీ దౌర్జ‌న్యాల గురించి రాయ‌డానికి మ‌న‌సు, చేతులు రాలేదు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి స్వ‌గ్రామ‌మే నిమ్మాడ. ఈ వాస్త‌వం ఈనాడులో మ‌న‌కు అస‌లు క‌నిపించ‌దు. వైసీపీ మ‌ద్ద‌తుతో నామినేష‌న్ వేసిన వ్య‌క్తి అచ్చెన్న‌న‌కు వ‌రుస‌కు సోద‌రుడి కుమారుడైన కింజ‌రావు అప్ప‌న్న కావ‌డం విశేషం. సొంత వూళ్లో పంచాయ‌తీ బ‌రిలో వైసీపీ అభ్య‌ర్థి నిల‌బ‌డ‌డాన్ని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు జీర్ణించు కోలేకపోయారు. నామినేష‌న్‌ను అడ్డుకునేందుకు అచ్చెన్నాయుడు సోద‌రుడు హ‌రిప్ర‌సాద్ నామినేష‌న్ కేంద్రంలో వీరంగం సృష్టించాడు.

నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన‌ అప్పన్నపై టీడీపీ మద్దతుదారుడిగా పోటీ చేస్తున్న కింజరాపు సురేష్‌ తండ్రి హరిప్రసాద్‌ దూషణలకు దిగారు. వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌ తదితరులను దుర్భాషలాడారు. అనంతరం హరిప్రసాద్, సురేష్, అచ్చెన్నాయుడు అనుయాయులు నామినేషన్‌ కేంద్రంలోకి చొచ్చుకెళ్లి అప్పన్న, దువ్వాడ శ్రీనివాస్‌లను బ‌య‌టికి ఈడ్చారు. వైసీపీ నేత‌ల‌కు సంబంధించిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లను లాక్కున్నారు.

తాను రాయ‌క‌పోతే నిజాలు లోకానికి తెలిసే అవ‌కాశం లేద‌నే భ్ర‌మలో ఈనాడు ఉన్న‌ట్టు …నేటి ఆ ప‌త్రిక దౌర్జ‌న్య‌కాండ క‌థ‌నం తెలియ‌జేస్తోంది. వైసీపీ శ్రేణుల‌ను నామినేష‌న్ వేయ‌కుండా అడ్డుకుంటే అది ఈనాడుకు కేవ‌లం తోపులాట‌గా క‌నిపించింది. ఇదే టీడీపీ శ్రేణులను అడ్డుకుంటే మాత్రం దౌర్జ‌న్యంగా క‌నిపిస్తోంది. 

ఇదెక్క‌డి జ‌ర్న‌లిజం దౌర్జ‌న్యం? దౌర్భాగ్యం? జ‌ర్న‌లిజం ప‌ర్వంలో ఈనాడు ప్ర‌తిరోజూ చేసేది అక్ష‌ర దౌర్జ‌న్య‌కాండ కాకుండా మ‌రేంటి?  నీతులు చెప్ప‌డానికే త‌ప్ప … ఆచ‌రించ‌డానికి కాద‌ని ఈనాడు మ‌రోసారి రుజువు చేసిందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా