మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఎస్సీవీనాయుడు టీడీపీలో చేరికకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 29న చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు.
నిజానికి రెండు వారాల క్రితమే ఆయన టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. అయితే తనకు తెలియకుండా ఎస్సీవీని చేర్చుకుంటున్నారని, ఏ ఒక్క టీడీపీ కార్యకర్త వెళ్లొద్దని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి ఆడియో సందేశాన్ని తన పార్టీ శ్రేణులకు పంపారు.
సుధీర్ ఆడియో శ్రీకాళహస్తి టీడీపీలో కలకలం రేపింది. దీంతో దిద్దుబాటు చర్యలను టీడీపీ చేపట్టింది. బొజ్జల సుధీర్‌తో పాటు ఎస్సీవీనాయుడిని చంద్రబాబు పిలిపించుకుని చర్చించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. శ్రీకాళహస్తిలో టీడీపీ గెలుపు కోసం ఇద్దరూ కలిసి పని చేయాలని ఆయన హితబోధ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీవీనాయుడితో కలిసి పని చేసేందుకు సుధీర్ ముందుకొచ్చారు.
ఎస్సీవీ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా టీడీపీ గెలుపు కోసం పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు తెలిపారు. ఇటీవల యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ను ఎస్సీవీ కలుసుకున్నారు. ఈ నెల 29న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమానికి బొజ్జల సుధీర్‌తో పాటు శ్రీకాళహస్తిలోని టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.