నెల్లూరు సిటీలో వైసీపీ ప్రాభవం రోజురోజుకూ మసకబారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులో బలపడేందుకు విభేదాలను పక్కన పెట్టి, టీడీపీ నేతలంతా ఒక్కటవుతున్నారు. కానీ అధికార పార్టీ వైసీపీలో మాత్రం కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
చివరికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పంచాయితీ చేసినా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఆయన బాబాయ్, నగర డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మధ్య సయోధ్య కుదర్లేదు. ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలుతూనే వున్నాయి.
ఇదే టీడీపీ విషయానికి వస్తే అంతా ఏకమవుతున్నారు. నెల్లూరు నగరంలో ఆనం కుటుంబానికి చెప్పుకోతగ్గ బలం వుంది. అనిల్‌ను ఓడించేందుకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కంకణం కట్టుకున్నారు. మరోవైపు నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసేందుకు మాజీ మంత్రి నారాయణ సిద్ధమయ్యారు. చాలా కాలం తర్వాత ఆయన రాజకీయంగా యాక్టీవ్ అవుతున్నారు.
నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి, పార్టీలోకి రావాలని మాజీ మంత్రి నారాయణ ఆహ్వానించారు. ఇదే సందర్భంలో గత ఎన్నికల్లో కోటంరెడ్డిపై ఓడిపోయిన నెల్లూరు నగర మాజీ మేయర్ అజీజ్‌ను వెంటబెట్టుకెళ్లారు. కోటంరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అజీజ్‌తో చేతులు కలిపించి, టీడీపీ గెలుపు కోసం అంతా కలిసి పని చేసేలా ముందుకు నడిపిస్తున్నారు.
నెల్లూరు వైసీపీలో పెద్దరికం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. వైసీపీలో విభేదాలు వస్తే పరిష్కరించేవారే కరువయ్యారు. దీంతో విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతూ, పార్టీని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వైసీపీకి నెల్లూరు కంచుకోట. ఇప్పుడా కంచుకోటకు బీటలు పడే పరిస్థితి. నెల్లూరులో ఇట్లే వదిలేస్తే వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.