అందరూ యాత్రలు చేస్తున్నారు కదా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తాము కూడా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నట్లుగా ఉంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సుమారు 5 వేల కిలోమీటర్ల బస్సు యాత్రను చేయబోతున్నట్లు తెలంగాణ తెలుగుదేశం సారథి కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. నిజానికి ఇలాంటి బస్సు యాత్ర తెలుగుదేశం పార్టీకి సాహసం అని చెప్పాలి. కాకపోతే ఆ సాహస యాత్రను కష్టనష్టాలు పడి పూర్తి చేస్తే మాత్రం పార్టీకి కచ్చితంగా కొంత అడ్వాంటేజీ ఉండవచ్చు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పూర్తిగా శవాసనం వేసి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. 2019లో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పార్టీ ఆ తరువాత పూర్తిగా సోదిలో లేకుండా పోయింది. పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకున్న వాళ్లు కూడా పార్టీ ఆఫీసులో కూర్చోవడానికి పరిమితమయ్యారే తప్ప పార్టీని ముందుకు తీసుకువెళ్లడం గురించి నామమాత్రంగానైనా కష్టపడలేదు.
కాసాని జ్ఞానేశ్వర్ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత మారింది. సొంత ఆర్థిక వనరులను పార్టీ కోసం ఖర్చు పెట్టే ఉద్దేశం ఉండే నేత కావడంతో ముందు వెనుక చూసుకోకుండా పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తూ వచ్చారు. చంద్రబాబుతో ఖమ్మంలో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కూడా ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయడం వలన తెలంగాణను తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్న దశ కంటే కచ్చితంగా ఒక్క శాతమైనా ఓటు బ్యాంకును పెంచుకుంటుంది. ఈ బస్సు యాత్ర సాగే క్రమంలో కనీసం 50 -60 నియోజకవర్గాలలో ఒక మోస్తరు జన స్పందనను రాబట్టగలిగితే, పార్టీకి ఎన్నికల నాటికి మంచి శకునాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల బరిలో నిలవడం ద్వారా తమ అస్తిత్వాన్ని చాటుకోవాలని తెలుగుదేశం అనుకుంటోంది. ఈ బస్సు యాత్రలో వారికి కొన్ని చోట్ల అయినా సానుకూల స్పందన లభిస్తే పొత్తులు పెట్టుకునే విషయంలో బిజెపి వీరి ఆరాటాన్ని పట్టించుకుంటుంది.
ప్రస్తుతం ఏమీలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పొత్తుల వల్ల ఏ కొంత లాభపడినా వారికి మంచిదే. అందువలన కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో బస్సు యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తే ఎంతో కొంత లాభం ఉంటుందని పార్టీ భావిస్తోంది. 2019లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచి, ప్రస్తుతం జీరో అయిన తెలుగుదేశం ఈసారి పాదయాత్ర వంటి ఈ కసరత్తులు అన్నీ చేయడం వలన.. ఒక్కటి గెలిచినా సరే.. వారికి లాభమే అవుతుందనే చర్చ పార్టీలో నడుస్తోంది.