శ్యామ్ అనే కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా స్పష్టంగా వీడియో రికార్డు చేసి, తన ఆత్మహత్యకు కారణాలు చెప్పుకుని, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ్టి రోజుల్లో కుర్రాళ్లు బలవన్మరణాలకు పాల్పడడానికి అనేకరకాల కారణాలు ఉంటున్నాయి. చదువుల, కెరీర్ ఒత్తిడి, ప్రేమవ్యవహారాలు మెజారిటీ మరణాల వెనుక కారణాలు. కానీ శ్యామ్ మరణం కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఇలాంటప్పుడు సామాజిక స్పృహ ఉన్నవాళ్లు ఎవరైనా స్పందించి.. పోలీసులు లోతుగా విచారణ జరగాలని కోరడం సహజం. కానీ చంద్రబాబునాయుడు నీచరాజకీయం ఎలా ఉంటుందంటే.. వెంటనే అతడిని వైసీపీ కార్యకర్తలే హత్య చేసేసారని, ఆ నిజాలను బయటకు తేవడానికి పోలీసులు నిష్పాక్షికంగా పనిచేయాలని కోరేంతగా ఉంటుంది.
శ్యామ్ ఆత్మహత్య బాధాకరమే. అతను జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా ముద్రపడిన కుర్రాడు కావడంతో అతని ఆత్మహత్యకు మరింత క్రేజ్ వచ్చింది. అతడి మిత్రులందరూ కొన్ని ఫోటోల ఆధారాలను చూపించి, ఇది ఆత్మహత్య కాదనే అనుమానాలను వ్యక్తం చేశారు. శ్యామ్ మరణానికి ప్రేమ వ్యవహారం కారణం అని, వ్యక్తిగత కారణాలున్నాయని, వీడియోలో కూడా పేర్కొన్నారని అంటున్నప్పటికీ.. మిత్రులుగా వారి అభిప్రాయం వారు చెప్పారు.
సరిగ్గా ఇక్కడ చంద్రబాబునాయుడు రంగప్రవేశం చేశారు. శవాల మీద పేలాలు ఏరుకుని తినే అలవాటును బయటకు తెచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ హత్య చేయించినట్లుగా అనుమానాలున్నాయని ట్వీట్ చేశారు. బాప్ ఏక్ నంబర్ కా అంటే బేటా దస్ నెంబర్ కా అన్నట్టుగా.. నారా లోకేష్ ఈ ట్వీటును అందిపుచ్చుకున్నారు. శ్యామ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము విడవకుండా పోరాడుతాం అని కూడా సెలవిచ్చారు. తండ్రీకొడుకుల అప్రకటిత సూచనలతో తెలుగుదేశం దళాలు, వందిమాగధులు రెచ్చిపోయారు. పార్టీ నాయకులంతా ట్విటర్లో వైసీపీ వాళ్లే హత్య చేశారంటూ హోరెత్తిస్తున్నారు.
చంద్రబాబునాయుడు దళాలు సోషల్ మీడియా ట్రెండ్ లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారనేది నిజం. శ్యామ్ మరణం తర్వాత.. మిత్రుల అనుమానాలు ట్రెండింగ్ అవగానే.. దానినుంచి లబ్ధి పొందాలన చంద్రదళాలు స్కెచ్ వేశాయి. తమ ట్వీట్ కూడా వైరల్ అవుతుందనే కక్కుర్తితో, శ్యామ్ మిత్రుల అనుమానాలకు వైసీపీ యాంగిల్ ను కూడా జోడించాయి. వైసీపీ మాటెత్తకుండా.. నిష్పాక్షిక విచారణ కోరి ఉంటే చంద్రబాబును అభినందించి ఉండొచ్చు. విచారణలో దోషులు (ఉంటే) తేలిన తర్వాత.. వారు వైసీపీ వారైతే ఎన్ని నిందలు వేసినా సబబుగా ఉంటుంది. కానీ అలవాటైన శవరాజకీయం చంద్రబాబులోని సంయమనాన్ని చంపేసింది.
ఈ వ్యవహారం అంతా కూడా.. కేవలం చంద్రబాబునాయుడు నీచమైన శవరాజకీయం మాత్రమే అనుకుంటే పొరబాటు. అంతకు మించిన స్కెచ్ కూడా దీని వెనుక ఉంది.
మరణించిన శ్యామ్ జూ.ఎన్టీఆర్ అభిమానిగా గుర్తింపు ఉన్నవాడు. సో, ఎన్టీఆర్ ను కూడా ఇందులోకి లాగడం చంద్రబాబు అండ్ కో ఉద్దేశం. తెలుగుదేశం వాళ్లందరూ వైసీపీ పాత్ర గురించి ఆరోపిస్తూ ట్వీట్లు చేస్తుండేసరికి.. జూ.ఎన్టీఆర్ కూడా తప్పనిసరిగా ఏదో ఒక స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఎన్టీఆర్, చంద్రబాబు-లోకేష్ లాగా లేకితనానికి దిగజారలేదు. శ్యామ్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూనే, ఎందుకు చనిపోయాడో తెలియకపోవడం కలచి వేస్తున్నదని అన్నారు. అధికారులు ఈ విషయంలో దర్యాప్తు జరపాలని మాత్రమే కోరారు.
చంద్రబాబునాయుడు కోరిక నెరవేరింది. తమ ట్వీట్లకు జూనియర్ ఎన్టీఆర్ అనుకూలంగా స్పందించాడని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అండగా తాము ఉంటున్నామని.. ప్రజల్లోకి వ్యూహాత్మక సంకేతాలు పంపడం వారికి వీలవుతోంది. జూ.ఎన్టీఆర్ .. చంద్రబాబు వైఖరి పట్ల ఏవగింపుతో తెలుగుదేశానికి చాలా కాలంగా దూరంగా మెలగుతున్న సంగతి తెలిసిందే. అయితే ‘మేమంతా ఒక్కటే’ అని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడానికి చంద్రబాబునాయుడు ఈ రకంగా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్యామ్ మరణం ద్వారా కేవలం శవరాజకీయాలు మాత్రమే కాకుండా.. ఎన్టీఆర్ తెలుగుదేశం జట్టులోనే ఉన్నట్టుగా ప్రజలకు భ్రమ కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు వైసీపీ వారి మీద నిందలు వేసినట్టుగా కనిపిస్తోంది. శ్యామ్ మరణం జరిగిన తర్వాత.. కనీస విచారణ కూడా తన వాళ్లతో చేయించుకోకుండా.. చంద్రబాబు నిందలు వేసేయడమే నీచత్వానికి పరాకాష్ట. శ్యామ్ తన ఆత్మహత్య కారణాలు తెలియజేసిన వీడియో బయటకువ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం దళాలు సిగ్గుతో నోరు మూసుకోవడం లేదు. ఆ వీడియో పోలీసుల వద్ద ఉండాలి కదా.. బయటకు ఎలా వచ్చింది అనే వితండ వాదన లేవనెత్తుతున్నారు. ఈ నీచత్వాన్ని ప్రజలు గుర్తిస్తే.. పోలీసు విచారణలో వైసీపీ పాత్ర లేదని తేలితే.. చంద్రబాబును తెలుగుజాతి మొత్తం అసహ్యించుకుంటుంది.