కేంద్ర ప్రభుత్వం ఎంత వేగంగా, శ్రద్ధగా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ! మణిపూర్ లో వందల ప్రాణాలు ఆహుతైపోతూ ఉన్నప్పటికీ.. రాష్ట్రం మొత్తం రావణకాష్టంలా తగలబడిపోతూ ఉన్నప్పటికీ.. ప్రధాని ఇప్పటిదాకా నోరు మెదపలేదు. కేంద్రం పద్ధతిగా స్పందించి.. అక్కడి సమస్యను సద్దుమణిగేలా చేయడంలో చర్యలు తీసుకోవడం లేదు.
అయితే ఈటల రాజేందర్ విషయంలో, ఆయన భద్రత కోసం పరితపించడంలో వారు తీసుకున్న శ్రద్ధ, వేగం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా తన ప్రాణాలకు హాని ఉన్నదనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారో లేదో.. గంటల వ్యవధిలోనే ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించడం గురించిన నిర్ణయం జరిగిపోయింది. ఉత్తర్వులే తరువాయి.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌ను ఆ పార్టీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నదనే అభిప్రాయం కలుగుతోంది. ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉన్నదని ఆయనను చంపించడానికి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈటల భార్య జమున ఆరోపణలు చేసిన ఒక రోజు కూడా గడవకముందే ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా ఉంది.
అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడికపోయినప్పటికీ ఒకటి రెండు రోజుల్లో ఈటెల రాజేందర్ వై కేటగిరి భద్రత గురించి నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈటల రాజేందర్ ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై ఈటల కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల పట్ల కూడా అంటీముట్టనట్టుగా ఉన్నారు. కేసీఆర్ సర్కారు పట్ల కఠినంగా వ్యవహరించడంలో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నదనే అభిప్రాయంతో ఉన్నారు. వెరసి.. ఈటల పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని, ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఒక ప్రచారం మొదలైంది. అధిష్ఠానం పెద్దలు వీరిద్దరినీ పిలిపించి మాట్లాడారు. ఈటల రాజీపడినట్టు కనిపించలేదు. జెపి నడ్డా సభ నాగర్ కర్నూలులో జరిగితే ఆయన హాజరు కూడా కాలేదు.
ఇలాంటి నేపథ్యంలో ఈటల భద్రత కు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. వెంటనే ఆయనకు వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేస్తున్నది. ఈటలను పార్టీవీడకుండా కాపాడుకోవడం వారికి అత్యవసరంగా కనిపిస్తున్నట్టుంది. ఈటల కూడా బయటకు వెళితే.. పార్టీ పరువు పోతుందని వారు భయపడుతున్నారు. కేడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అనుకుంటున్నారు.
తెలంగాణ బిజెపి పటిష్ఠం కోసం ఈటల ప్రతిపాదనలపై వారు వేగంగా స్పందించలేకపోతున్నారు గానీ.. వైకేటగిరీ భద్రత ద్వారా ఆయనను బుజ్జగించి పార్టీకి కట్టుబడి ఉండేలా చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.