మా జగన్ మీద అంత అక్కసేందుకు పవన్ !

జగన్ మీద పవన్‌కి ఉన్నది రాజకీయ ప్రత్యర్ధి వైరమా లేక ద్వేషమా లేక అక్కసా, అసూయా అని అంటే ఎవరైనా అన్నీ కలిపే అని చెబుతారు. ఎందుకు అంటే మాత్రం జవాబు ఉండదు. పవన్…

జగన్ మీద పవన్‌కి ఉన్నది రాజకీయ ప్రత్యర్ధి వైరమా లేక ద్వేషమా లేక అక్కసా, అసూయా అని అంటే ఎవరైనా అన్నీ కలిపే అని చెబుతారు. ఎందుకు అంటే మాత్రం జవాబు ఉండదు. పవన్ కళ్యాణ్ జగన్ దాదాపుగా ఒకే వయసు వాళ్ళు. జగన్ 2009లో కడప ఎంపీగా అయ్యేంతవరకూ బిజినెస్ వ్యవహారాల్లో ఉండేవారు. పవన్ అయితే సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.

ఈ ఇద్దరి రంగాలు వేరు ఎపుడూ తారసపడిన సందర్భం కూడా లేదు. 2009లోనే ఇద్దరూ ఒకేసారి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. జగన్ పొలిటికల్ గ్రాఫ్ చూస్తే అంచలెంచెలుగా ఎగబాకి సీఎం గా రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలోనే ప్రమాణం చేశారు. 2014లో పార్టీ పెట్టిన పవన్ ఇంకా అసెంబ్లీ గేటు తాకలేదు. బహుశా ఇదే పవన్ కి జగన్ మీద ద్వేషానికి కారణమా అంటే జవాబు ఎవరు చెబుతారు.

జగన్ మీద అక్కసు వెళ్ళగక్కుతున్న పవన్ మీద వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. పేదల కోసం పనిచేసే సీఎం జగన్ మీద ఎందుకు అంత వ్యతిరేకత చిమ్ముతున్నావ్ పవన్ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి  కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిలదీశారు. జగన్ ఎన్నో పధకాలను తెచ్చి పేదల కడుపు నింపుతుంటే బటన్ నొక్కుడంటూ అవహేళన చేస్తావా అని ఫైర్ అయ్యారు.

మా ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి డీబీటీ కింద రూ.2.16 లక్షల కోట్లు నేరుగా జమచేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడటం ఏమైనా సమంజసంగా ఉందా పవన్ అంటున్నారు మంత్రి.  ఈ పధకాల్లో ఎక్కడైనా ఇందులో అవినీతి జరిగినట్టు మీదగ్గర ఆధారాలుంటే వచ్చి నిరూపించాలి. అలా నిరూపించే దమ్మూధైర్యం మీకుందా మీకే సూటిగా అడుగుతున్నాను  పవన్‌కళ్యాణ్‌ అని  కారుమూరి  సవాల్ చేశారు.

ఏపీలో అత్యంత పారదర్శక విధానంతో నడుస్తున్న వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను మెచ్చుకోవాల్సింది పోయి మా ప్రభుత్వంపై నిందలేయడం నీకు తగదని అసలు ఈ విషయాల మీద మీ అవగాహన ఏంటి అని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి జగన్ పేదల మనిషి, మచ్చలేని నాయకుడు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు ఆయన ఆరాధ్యదైవంగా నిలిచారు అది తెలుసుకోవాలని కారుమూరి పేర్కొన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తూ ఇప్పటికే 99 శాతం హామీల్ని నిలబెట్టిన మచ్చలేని నేత జగన్‌ అయితే హామీలు తుంగలోకి తొక్కిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న ఘనత పవన్ ది అని కారుమూరి సేనాని గాలి తీసేశారు. జగన్ కి ప్రజలకు మధ్య బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరన్నది గుర్తుంచుకోవాలని సూచించారు మంత్రి గారు.

వైసీపీ పాలనను మెచ్చుకోవాలి అంటే ఎవరికైనా మానవీయ విలువలుండాలి. అయితే,  చంద్రబాబుకు పవన్‌కళ్యాణ్‌కు మాత్రం ప్రభుత్వం చేసే మంచిని అంగీకరించలేని నిలువెల్లా విషం ఆవరించి ఉందని కారుమూరి అనాల్సినవి అన్నీ అనేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు జగన్ కి దక్కడం ఖాయం మీరు ఎన్ని రాజకీయాలు చేసినా పొత్తులతో వచ్చినా ఇదే ఫైనల్ డెసిషన్, ప్రజల డెసిషన్ అని ఫ్యూచర్ ఏంటో కూడా మంత్రి గారు చెప్పేశారు.