షర్మిల పార్టీ ఎవరికి అవసరం?

గత వారం తన కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఆర్కే వైఎస్ షర్మిల పార్టీ ప్రస్తావన చేసారు. షర్మిల పార్టీ పెడతారనే విషయంతో ఆగలేదు ఆయన. అది కూడా తెలంగాణలో పార్టీ పెడతారని పేర్కొంటూనే దీని…

గత వారం తన కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఆర్కే వైఎస్ షర్మిల పార్టీ ప్రస్తావన చేసారు. షర్మిల పార్టీ పెడతారనే విషయంతో ఆగలేదు ఆయన. అది కూడా తెలంగాణలో పార్టీ పెడతారని పేర్కొంటూనే దీని వల్ల ఆంధ్రలో జగన్ ఏకంగా అధికారానికి దూరం అయిపోతారనేంత దూరం వరకు ఊహాగానం చేసారు. 

నిజానికి వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఎంత సహజమో, ఓ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి రాజకీయాలు చేయడం, పార్టీ పెట్టడం అన్నది అంతే సహజం. అయితే వైఎస్ జగన్ అధికారంలో వుండగా, సోదరి షర్మిల పార్టీ పెట్టడం అన్నది సహజంగానే ఆసక్తికరం. 

కానీ ఆసక్తికరం నుంచి దీన్నో అవకాశంగా అందిపుచ్చుకోవాలని అనుకుంటోంది తెలుగుదేశం అనుకూల మీడియా. వైఎస్ జగన్ అవకాశం దొరికిన ప్రతి వైపు నుంచి జనంలో బదనామ్ చేయడం అన్నది పనిగా పెట్టుకుందని క్లియర్ గా తెలిసిపోతొంది. 

కోర్టుల వ్యవహారంలో కావచ్చు, మరే ఇతర వ్యవహారాల్లోనైనా కావచ్చు జగన్ పాలనను భయంకరమైన, పనికిరాని, అర్హతలేని పాలనగా చూపించాలనే తాపత్రయం నిత్యం వండి వారుస్తున్న వార్తల్లో కనిపిస్తోంది. నిజానికి జనాల్లో ఇంతటి సీన్ కనిపిస్తోందా లేదా అన్నది ఆ మీడియాకు తెలుసు. కానీ తన ప్రయత్నం తాను చేయాలనుకుంటోంది. అంతే.

గతం వారం తాము వెల్లడించిన షర్మిల పార్టీ వ్యవహారం భయంకరమైన ప్రకంపనలు రేపుతుందని నమ్మారు. కానీ అది కాస్తా మర్నాడే తుస్సుమంది. షర్మిల వైపు నుంచి ఓ చిన్న ఖండన రావడంతో అంతా చల్లారిపోయింది. కానీ ఇది అస్సలు నచ్చలేదు సదరు మీడియాకు. దీన్ని ఎలాగైనా ఎగసం దోసి, జగన్ అనే నాయకుడు తన స్వంత కుటుంబానికే నచ్చలేదన్న ఫీలింగ్ ను జనాల్లోకి పంపాలనుకుంటోంది. 

కానీ ఈ క్రమంలో ఆ మీడియా రెండు విషయాలు అది కూడా తానే వెల్లడించిన రెండు విషయాలు చాలా కన్వీనియెంట్ గా మరిచిపోతోంది. షర్మిల మొండితనం విషయంలో జగన్ కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివారని చెప్పింది సదరు మీడియా అధినేతనే.. సదరు సీనియర్ జర్నలిస్ట్ నే.  

తల్లి విజయలక్ష్మి, పులివెందులకు చెందిన మరి కొందరి ఒత్తిడి మేరకే షర్మిల ఎవరో రాసిన ఖండన కాగితం మీద, తన మొహమాటానికి సంతకం చేసారని ఈ వారం చెబుతున్నదీ ఆయనే. మరి అంత జగమొండి షర్మిల అంత సులువుగా లొంగి సంతకం చేసారా? ఇది నమ్మదగ్గ విషయమేనా?

ఇక రెండో విషయం. షర్మిల పార్టీ పెడుతున్నది తెలంగాణలో,. గతవారం ఈ పలుకు పలికింది ఆయనే. మరి తెలంగాణలో పార్టీ పెడితే ఆంధ్రలో జగన్ కు వచ్చిన నష్టం ఏమిటి? సదరు పెద్దాయిన తన పలుకు పలకగానే సోషల్ మీడియా మొత్తం ఇదంతా జగన్-షర్మిల కలిసి ఆడుతున్న నాటకం అని అభిప్రాయపడింది. 

ఎందుకంటే అన్న మీద షర్మిల కు కోపం వుంటే ఆంధ్రలోనే పార్టీ పెడుతుంది కదా. ఈ మాతం లాజిక్ మెడ మీద తలకాయ వున్న ఆ పెద్దాయనకు తట్టలేదు. నిజానికి తట్టలేదని కాదు, ఈ దారం ముక్కలాంటి న్యూస్ ను పట్టుకుని జగన్ మెడకు ఉరితాడు వేసేద్దామన్న తాపత్రయం అందులో దాగి వుంది.

సరే మొత్తానికి ఈ ప్రయత్నం కాస్తా షర్మిల నోట్ వల్ల వీడిపోయింది. కానీ అలా వీగిపోతే ఎలా? జగన్ ఎలా బదనామ్ అవుతారు? తాము జగన్ ఎలా కార్నర్ చేయాలి. అందుకే రెండో వారం కూడా మళ్లీ 'అధికారం లేని ఏడుపు' అనే సీరియల్ ను కొనసాగించారు. 

పులివెందుల నుంచి ఎవరో వెళ్లారు. ఎవరో ఒత్తిడి చేసారు. ఎవరో కాగితం రాసారు. దాన్ని విజయలక్ష్మి తీసుకెళ్లారు. షర్మిల సంతకం చేసారు. అంటూ సుదీర్ఘ వివరణ ఇస్తూ, ఇది నిజం కాకపోతే తాను క్షమాపణ చెబుతా అంటూ ఓ కొత్త లా పాయింట్ తీసారు.

ఇలా లా పాయింట్ తీసేకన్నా, ఓ ఏడాది చూస్తాను. ఆ లోపు షర్మిల పార్టీ పెట్టకపోతే తాను రాజీనామా చేస్తా అంటూ కండిషన్ పెట్టి వుండే బాగుండేది. ఎందుకంటే ఆ లోగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే అవకాశం ఎక్కువ వుంది కాబట్టి, ఈ జర్నలిస్ట్ పెద్దాయిన క్షమాపణ చెప్పాల్సిన పని వుండేది కాదు.

సరే ఇదిలా వుంటే ఇక్కడితో ఈ సీరియల్ కొనసాగింపు ఆగిపోతే ఎలా? అందుకే ఆ మీడియా ఆస్థాన రాజకీయ విద్వాంసుల్లో ఒకరైన సబ్బం హరిని రంగంలోకి దింపారు. షర్మిల కచ్చితంగా పార్టీ పెడుతుందని, పలువురు నాయకులతో సంప్రదింపులతో వున్నారని ఓ మాట చెప్పించారు. దాన్ని తన మీడియాలో ప్రసారం చేసారు. 

మళ్లీ అక్కడా దాగుడు మూతలే. సదరు సబ్బం హరిగారు షర్మిల పార్టీ తెలంగాణలో పెడుతున్నారని కానీ, అనలేదు. ఆయన బాధ కూడా అదే. జగన్ కు వ్యతిరేకంగా షర్మిల పార్టీ పెడుతున్నారనే కలర్ జనాల్లోకి రావాలి. 

అసలు ఇదంతా ఇలా వుంచితే వైఎస్ జగన్ ది ఏమన్నా ఉమ్మడి కుటుంబమా? అమరావతిలో జగన్, ఆయన భార్య కలిసి వుంటున్నారు. తల్లి విజయలక్ష్మి హైదరాబాద్ లో ప్రశాంతంగా శేషజీవితం కొనసాగిస్తున్నారు. పెళ్లి అయిపోయిన షర్మిల తన భర్త, పిల్లలతో బెంగళూరులో వుంటున్నారు. ఇలాంటి నెపథ్యంలో షర్మిల పార్టీ పెట్టుకుంటే ఏమిటి విషయం. అన్నతో కలిసి వుంటారో, చెల్లిని దగ్గర కు పెట్టుకుంటారో అన్నది వాళ్ల వ్యవహారం.

రామ్మూర్తి నాయడు చంధ్రబాబును వీడి కాంగ్రెస్ లో చేరలేదా? హరికృష్ణ బావ చంద్రబాబును దుయ్యపడుతూ పార్టీ పెట్టలేదా? మరిది చంద్రబాబును కాదని, తోడల్లుడిని కాదని పురంధ్రీశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేరు వేరు పార్టీల్లోకి వెళ్లలేదా? అంతెందుకు చంద్రబాబే మామ ఎన్టీఆర్ పై పోటీ చేస్తా అంటూ కాంగ్రెస్ లో వుండి బీరాలు పలకలేదా? తెలుగుదేశం ప్రముఖుడు అశోక్, ఆయన సోదరుడు ఆనంద్ చెరో పార్టీలో వున్న రోజులు లేవా? జాతీయంగా, రాష్ట్రీయంగా ఒకే కుటుంబంలో రెండు మూడు పార్టీలు వున్న వైనాలు కో కొల్లలు.

మరి షర్మిల సంగతినే భూతద్దంలో చూపించాలని బాబు అనుకుల మీడియా ఎందుకు తాపత్రయ పడుతోంది. ఎందుకంటే అది జగన్ కు వ్యతిరేకంగా బ్యాడ్ ప్రాపగండా చేసేందుకు వీలుగా పనికి వస్తుంది కాబట్టి. ఓ మాజీ సర్పంచ్ జగన్ ను తిట్టినా బ్యానర్ వార్తగా వేద్దామనే తహ తహ వున్నవారికి జగన్ స్వంత సోదరి వేరే పార్టీ పెడితే అంతకన్నా తీన్ మార్ ఆడే చాన్స్ మరోటి వుంటుందా? 

అందువల్ల వీలయినంత వరకు షర్మిల పార్టీ వ్యవహారాన్ని, తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా సాగదీయడానికే ప్రయత్నించడం ఖాయం. దానికి జనాల టీఆర్పీ రేటింగ్ వున్నా లేకున్నా. ఎందుకంటే మనకి నచ్చని వాడి కొంప అంటుకుంటే మనకి ఎంత ఆనందమో కదా. 

-చాణక్య

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా