తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారం దిశగా నడిపించడానికి ముందు, క్రమశిక్షణ పరంగా శుద్ధీకరించాలని అధినాయకుడు రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల సన్నాహాల కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు న్యూఢిల్లీలో నిర్వహించిన వ్యూహ కమిటీ సమావేశంలో రాహుల్ వ్యాఖ్యలు ఆయన పార్టీలో క్రమశిక్షణ పట్ల ఎంత నిశ్చితాభిప్రాయంతో ఉన్నారో తేట తెల్లం చేశాయి.
పార్టీలో అంతర్గత విభేదాలు ఉండడం చాలా సహజమని అయితే ఈ విభేదాలు గురించి బయట బహిరంగ వేదికల మీద మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడితే వేటువేయక తప్పదని రాహుల్ గాంధీ హెచ్చరించారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నట్లయితే రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లతో పాటు స్వయంగా తన దృష్టికి కూడా తీసుకురావచ్చునని, అయితే నేరుగా మీడియాలోకి ఎక్కడం మాత్రం సరికాదని రాహుల్ గాంధీ స్ట్రాంగుగానే హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నయి.
మీకు అధికారం కావాలా? మీడియాలో ఫోకస్ కావడం కావాలా? అంటూ రాహుల్ మందలించినట్లుగా చెబుతున్నారు. విభేదాలపై మీడియాకెక్కే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఒకరిద్దరిపై వేటు వేస్తే తతిమ్మా నాయకులందరూ ఆటోమేటిగ్గా దారిలోకి వస్తారని రాహుల్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.
ఆల్రెడీ ఇద్దరు నాయకులు దొరికారని కూడా రాహుల్ అన్నట్టుగా వార్తలొచ్చాయి. అంటే కాంగ్రెస్ నుంచి త్వరలోనే ఇద్దరు నాయకులపై వేటు వేయడానికి అధినాయకులు ఆలోచిస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది.
తెలంగాణలో ఈసారి తాము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతాం అనే కాన్ఫిడెన్సు కాంగ్రెసు పార్టీలో కనిపిస్తున్నది. పార్టీ పరిస్థితి కొంచెం డోలాయమానంగా ఉన్నట్లయితే.. స్థానిక నాయకులు తోకజాడించే వైఖరుల మీద కాస్త చూసీచూడనట్టు వెళ్లే వైఖరి ఉండేది. కానీ రాహుల్ తీరును గమనిస్తే.. కొందరు నాయకుల మీద వేటు వేసి అయినా క్రమశిక్షణను కాపాడుకోవాలని చూస్తున్నట్టుంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఠా తగాదాలకు పెట్టింది పేరు. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఎవరికి తోచిన రీతిలో వారు రెచ్చిపోయి వ్యవహరిస్తూ ఉంటారు. పీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా ఎందరు నాయకులు గ్రూపులు కట్టి తలపడ్డారో అందరికీ తెలుసు. మొన్నమొన్నటిదాకా రేవంత్ సారథ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇప్పుడు ఆయనతో మైత్రీ బంధాన్ని కుదుర్చుకున్నారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
అయితే.. రేవంత్ తో ఇంకా విభేదిస్తూ చెలరేగుతున్న నాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారి మీద అధిష్ఠానం అసహనంతో ఉన్నదా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.