ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి మూడో స్థానం!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ రోజురోజుకూ ప‌త‌న‌మ‌వుతోంది. అధికార పార్టీ వైసీపీకి ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఇన్‌చార్జ్ భూమా కిశోర్‌రెడ్డి ఎదుగుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప‌ల్లెబాట పేరుతో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం అంతా క‌లియ తిరిగి, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను…

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ రోజురోజుకూ ప‌త‌న‌మ‌వుతోంది. అధికార పార్టీ వైసీపీకి ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఇన్‌చార్జ్ భూమా కిశోర్‌రెడ్డి ఎదుగుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప‌ల్లెబాట పేరుతో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం అంతా క‌లియ తిరిగి, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, త‌న‌కు చేత‌నైన మేర‌కు ప‌రిష్కారానికి కృషి చేశారు. భూమా వార‌సుడిగా జ‌నంతో మ‌మేకం అయ్యేందుకు మార్గం సుగుమ‌మైంది.

తాజాగా ప‌ల్లెనిద్ర పేరుతో మ‌రోసారి ఆయ‌న జ‌నం ద‌గ్గరికి వెళ్లేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఈ మేర‌కు దొర్నిపాడు మండ‌లంలోని త‌న స్వ‌గ్రామం డ‌బ్ల్యూ.కొత్త‌ప‌ల్లి గ్రామంలో భూమా కిశోర్ బ‌స చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామస్తులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ్రామ‌ సమ‌స్య‌ల్ని ఆయ‌న  అడిగి తెలుసుకున్నారు.
 
గ్రామ ఎస్సీ కాలనీలో చర్చికి మరమ్మతులు, అదే  కాలనీలో పొలానికి వెళ్లే రస్తాలో కల్వర్టుకి  మరమ్మతులు, మ‌సీదుకు కాంపౌండ్ వాల్ త‌దిత‌ర వాటిని సొంత నిధుల‌తో చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మిగిలిన స‌మ‌స్య‌ల్ని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంట‌నే చేప‌డ‌తాన‌ని భ‌రోసా ఇచ్చారు. 

ఇదిలా వుండ‌గా కిశోర్‌రెడ్డికి భూమా కుటుంబానికి చెందిన వారంతా మ‌ద్ద‌తుగా నిలిచారు. భూమా కుటుంబానికి పెద్ద దిక్కు అయిన భూమా నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మాజీ స‌భ్యుడు భూమా వీరభద్రా రెడ్డి, భూమా రమేశ్‌ రెడ్డి తదితరులంతా త‌మ కుటుంబ వార‌సుడు కిశోరే అని ప్ర‌జానీకానికి చెప్ప‌డంతో పాటు ఆయ‌న వెన్నంటి న‌డిచారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా కుటుంబ వార‌సుడిగా కిశోర్‌నే చూస్తున్నార‌నేందుకు ఆయ‌న‌కు కుటుంబ స‌భ్యుల‌తో పాటు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తే నిద‌ర్శ‌నం.

ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర‌నాథ్‌రెడ్డిని ఎదుర్కోవ‌డంలో ఆ నియోజ‌క‌వ‌ర్గ స‌రైన ప్ర‌తిప‌క్షం లేకుండా పోయింది. దీంతో ఇదే అవ‌కాశంగా తీసుకున్న భూమా కిశోర్‌రెడ్డి బీజేపీ ఇన్‌చార్జ్ హోదాలో జ‌నానికి చేరువ‌య్యే ప్ర‌య‌త్నానికి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్పుడు ఆళ్ల‌గ‌డ్డ‌లో పోటీ ఎవ‌రి మ‌ధ్య అని ప్ర‌శ్నిస్తే… వైసీపీ వ‌ర్సెస్ భూమా కిశోర్‌రెడ్డి అనే స‌మాధానం వ‌స్తోంది. 

ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీ బ‌లంగా వుంది. అధికార పార్టీని ఢీ కొట్ట‌గ‌ల నాయ‌కుడిగా ఇప్పుడు కిశోర్‌రెడ్డి క‌నిపిస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి వెళ్ల‌డం వ‌ల్లే వైసీపీ వ్య‌తిరేకులంతా ఆయ‌న నాయ‌క‌త్వం గొడుగు కిందికి చేరుతున్నార‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతానికి ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ మూడో స్థానంలోకి జారిపోయింది.