ప్రతిపక్షాల నేతలను, వాటి అనుకూల మీడియాను ఎలా మేనేజ్ చేయాలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిని చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నేర్చుకోవాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యవహారశైలిపై ముఖ్యంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీటీడీని తన సొంత జాగీరులా భావిస్తూ, తన ఇష్టానుసారం దర్శనాలు చేయించుకుంటున్నారనేది అధికార పార్టీ నేతల ఆరోపణ.
పలు సందర్భాల్లో ఈవో ధర్మారెడ్డి తగిన విధంగా దర్శన భాగ్యం కల్పించలేదనే కారణంతో తిరుమలకు వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాహాటంగానే ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద ధర్మారెడ్డికి ఉన్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని కొందరు అవమానాల్ని మనసులోనే దిగమింగుకుంటున్నారు. మరికొందరు తోటి బాధితుల వద్ద తమ ఆవేదనను చెప్పుకుని, భారాన్ని దిగమింగుకుంటున్నారు.
అయితే ధర్మారెడ్డిపై ప్రతిపక్ష మీడియా, అలాగే కొందరు ప్రతిపక్ష నాయకులు ఈగ వాలనివ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా శ్రీవాణి ట్రస్ట్‌లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పవన్‌కల్యాణ్ ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి బాహాటంగానే ధర్మారెడ్డికి అండగా నిలిచారు. దర్శనాల విషయంలో మంత్రి ఆర్కే రోజాతో భానుప్రకాశ్‌రెడ్డి పోటీ పడుతున్నాడని జనసేన నేతల ఆరోపణల్లో నిజం ఎంతో కాసేపు పక్కన పెడదాం.
శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో తీవ్రమైన ఆరోపణలు వస్తే ఒకే ఒక్క బోర్డు సభ్యుడు ఖండించారు. పవన్‌కల్యాణ్‌పై ఒంటికాలిమీద లేచే మంత్రి రోజా… శ్రీవాణి ట్రస్ట్‌పై తీవ్ర ఆరోపణలు చేసినా, కనీసం ఖండించిన పాపాన పోలేదు. ధర్మారెడ్డిపై సహాయ నిరాకరణ ద్వారా తమ నిరసనను ప్రదర్శించారనేందుకు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఆయనకు అధికార పార్టీ నేతల మద్దతు కొరవడడమే నిదర్శనం. అలాగే వైసీపీ ప్రభుత్వంపై చిన్న ఆరోపణ వచ్చినా, నిజానిజాలతో సంబంధం లేకుండా గంటల తరబడి డిబేట్లు పెట్టే ఆ రెండు ఎల్లో చానళ్లు, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయించడం గమనార్హం. దీని వెనుక ధర్మారెడ్డి మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ని మెచ్చుకోక తప్పదు.
ధర్మారెడ్డిలో గొప్పతనం అదే. అధికార పార్టీ వాళ్లను పట్టించుకోకపోయినా నోరు తెరిచి ప్రశ్నించరని తెలుసుకున్నారు. ఇదే ఎల్లో మీడియా, ప్రతిపక్ష పార్టీకి చెందిన భానుప్రకాశ్‌రెడ్డి తదితరులపై చల్లని చూపు చూస్తే, అవసరాల్లో అటు వైపు నుంచి అదే రీతిలో తనను మంచిగా చూస్తారని ఆలోచించి, ఆ మేరకు అమలు చేస్తున్నారు. ఈ కిటుకు తెలియకే సీఎం వైఎస్ జగన్ నిత్యం ఎల్లో మీడియాపై పడి విమర్శలు చేస్తున్నారు.
మంచి లక్షణాలు ఎవరి నుంచైనా నేర్చుకోవాల్సిందే. ధర్మారెడ్డి నుంచి ప్రతిపక్షాల్ని ఎలా మేనేజ్ చేయాలో జగన్ తెలుసుకుని, కనీసం ఎన్నికల సమయంలో అయినా ఉపయోగించుకోవాల్సిన అవసరం వుంది. ధర్మారెడ్డి మీరు రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి గురూ! ఔను, నంద్యాల ఎంపీ సీటుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలొస్తున్నాయి. ఎంత వరకు వచ్చింది సార్!