పుష్ప సినిమా హిందీ బెల్ట్ లో కుమ్మేసిన తరువాత చాలా తెలుగు సినిమాలు హిందీ విడుదల కూడా వుంటుంది అంటూ హల్ చల్ చేసాయి. కానీ మన సినిమాలు హిందీలో విడుదల చేయడం అంత సులువు కాదు. చాలా ఖర్చుతో కూడిన పని.
అందుకే ఎవరో ఒకరికి డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చేస్తుంటారు. అదీ కాక హిందీ రైట్స్ రూపంలో మంచి అమౌంట్ వస్తున్నపుడు ఇంక ఈ తతంగం ఎందుకని కూడా అనుకుంటారు. కానీ భీమ్లా నాయక్, ఆచార్య ఇలా చాలా సినిమాలు హిందీలో కూడా విడుదలవుతాయని వార్తలు వినిపించాయి.
కానీ భీమ్లానాయక్ ఆ ఊసే మరిచిపోయింది. కనీసం హిందీలో పాటలు కూడా చేయించలేదు. విడుదల చేయలేదు. ఓ వారం తరువాత విడుదల చేస్తామని, రెండు వారాల తరువాత అని వాయిదా వేస్తూ వచ్చి ఆఖరికి చేతులు ఎత్తేసారు.
చిరు, చరణ్ ల ఆచార్య సినిమా హిందీలో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ చూస్తుంటే డవుట్ గానే వుంది. సినిమా విడుదల మూడు వారాల్లోకి వచ్చేసింది. తెలుగులో రెండు పాటలు వచ్చాయి కానీ ఒక్క హిందీ పాట కూడా రాలేదు. చూస్తుంటే ఆచార్య కూడా హిందీ వెర్షన్ విడుదల స్కిప్ చేసేలా వుంది.